పేరుకు ఆ రెండు జాతీయ పార్టీలు కానీ. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ రెండు పార్టీలు యేటికి ఎదురీదుతున్నాయి. తెలంగాణలో ఆ రెండు పార్టీలు పోటీలో ఉన్నట్లే కన్పిస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం వీటి ఉనికి అగమ్యగోచరంగా మారింది. కనీసం ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఆ రెండు పార్టీలు ఏవో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవేనండి కాంగ్రెస్, బీజేపీలు.
ఈ రెండు పార్టీలే కేంద్రంలో అధికారం చేపడుతూ వస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ రెండు పార్టీలు ప్రస్తుతం చెప్పుకోదగిన ఫార్మమెన్స్ చూపెట్టడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ కొన్ని దశాబ్దాలపాటు పాలించింది. రాష్ట్ర విభజనకు ముందు కూడా కాంగ్రెస్ అధికారంలోనే ఉంది. కానీ సమైక్యంధ్రవాదుల మాటను పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుంది.
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ ప్రజలు మాత్రం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్ఎస్ కే పట్టంకట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తన స్వయంకృపరాధంతోనే అధికారానికి దూరమైంది. ఇటీవల తెలంగాణలో కొత్త పీసీసీగా రేవంత్ రెడ్డిని నియమించడంతో ఆపార్టీలో జోష్ నెలకొంది. అయితే ఆపార్టీలోని సీనియర్లు రేవంత్ కు పెద్దగా సహకరించడం లేదు. అదేవిధంగా బీజేపీ రోజురోజుకు పుంజుకుంటుంది.
అయినా కూడా తెలంగాణలో ఈ రెండు పార్టీలకు అధికారంలోకి వచ్చే సత్తా లేదనే మాటలే విన్పిస్తున్నారు. ఈ రెండు పార్టీల కన్నా టీఆర్ఎస్ బలంగా ఉంది. కేసీఆర్ వ్యూహాలు ముందు ఈ రెండు జాతీయ పార్టీలు చిత్తవుతున్నాయి. అయితే వరుసగా టీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి రావడంతో ఆపార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ మెజార్టీ వర్గం టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హోరాహోరీగా జరుగడం ఖాయంగా కన్పిస్తుంది.
తెలంగాణలో జాతీయ పార్టీల పరిస్థితి పర్వాలేదని అనిపిస్తుంది. కానీ ఏపీలో మాత్రం ఈ రెండు పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడిచి పెట్టుకుపోయింది. ఇప్పట్లో ఆపార్టీ కోలుకునే అవకాశం కన్పించడం లేదు. అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. విభజన హామీలను ఆ పార్టీ ఏమాత్రం నెరవేర్చడం లేదు. దీనికితోడు పుండుమీద కారం చల్లినట్లుగా నిర్ణయాలను తీసుకుంటుంది. దీంతో ప్రజలు బీజేపీని దూరం పెడుతున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోమువీర్రాజు ఉన్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలకు ఆయన వచ్చాక ప్రాధాన్యం తగ్గిందంటున్నారు. అలాగే జనసేన పార్టీతో పొత్తుపెట్టుకొని కలిసి పోరాడడం లేదు.. కొద్దిరోజులుగా జనసేన, బీజేపీ మధ్య గ్యాప్ వచ్చినట్లు కన్పిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయనేది అనుమానంగా మారిందంటున్నారు.. ఒక్క టీడీపీ మాత్రం వైసీపీని ఎదుర్కొంటోంది. 2019 ఎన్నికల్లో మొదలైన జగన్ వేవ్ ఇంకా కొనసాగుతోందని నిన్నటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు నిరూపించాయి.
ఈ రెండు జాతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వస్తాయనేది మాత్రం కలగానే మిగిలేలా ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్, బీజేపీ ఓ మాదిరిగా పోటీ ఇస్తున్నాయి. కానీ అధికారంలోకి వస్తాయనే నమ్మకాన్ని కలిగించలేక పోతున్నాయి. అలాగే వైసీపీకి ఏపీలో అల్టర్నేట్ లేకుండా పోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగే అవకాశం కన్పిస్తుంది. దీంతో రెండు జాతీయ పార్టీలు కూడా తెలుగునేలపై గల్లీ స్థాయికి పడిపోయాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరీ మున్ముందు ఈ రెండు పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తాయో లేదో మరీ..!