ప్రభుత్వ ఆస్పత్రులపై ఎక్కువ మంది ప్రజలకు నమ్మకం ఉండదు. అక్కడ ఎక్విప్‌మెంట్ సరిగ్గా ఉండదని, వైద్యులు బాధ్యతగా వ్యవహరించరని అనుకుంటూ ఉంటారు. అందుకే వారు ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మెరుగైన చికిత్స అందుతుందంటూ ప్రజలందరికీ నమ్మకం కలిగించాలని పలువురు రాజకీయ నేతలు, అధికారులు తాపత్రయపడుతుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఓ జిల్లా కలెక్టర్ తన భార్యకు గవర్నమెంట్ ఆస్పత్రిలో ప్రసవం చేయించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.
Read Also: రూ.50వేలు పరిహారం పొందడానికి ఇలా దరఖాస్తు చేసుకోండి
మంగళవారం నాడు భద్రాచలంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో కలెక్టర్ అనుదీప్ భార్య పురిటినొప్పులతో చేరింది. దీంతో వైద్యులు ఆమెకు చికిత్స చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. కాగా ప్రజలకు విశ్వాసం కలిగించే ఉద్దేశంతోనే కలెక్టర్ తన భార్యను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన అనుదీప్ 2017లో జరిగిన సివిల్స్ పరీక్షలో దేశంలోనే మొదటి ర్యాంక్ సొంతం చేసుకున్నారు.