తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుందని తెలుస్తోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభా సమావేశాల్లో పాల్గొన్న అనంతరం జరిగే బీఏసీ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఆదివారం రోజు నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీకి పయనమవుతున్నారు.
ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఈ భేటీ జరుగనుంది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. శనివారం రోజు.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో కేసీఆర్ సమావేశమవుతారు.
సీఎం కేసీఆర్ ఈనెల ఆరంభంలోనే వారం పాటు ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. దేశ రాజధానిలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ నిర్వహించారు. కాగా, నెల కూడా కాకముందే కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.