కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఎజెండా వారిది కాదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజల అజెండానే మా ఎజెండా. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు వరి ధాన్యం సమస్య రాలేదు. ఎంతో కష్టపడి తెగుళ్ళతో పోరాడి పంట పండిస్తే వరి ధాన్యం కొనుగోలు చేయమంటే రైతులు ఏం చేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ఆడుతున్న నాటకంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతుల కోసమే మేం ప్రయత్నిస్తున్నాం. నేతలు ఎక్కడికక్కడ రైతులకు భరోసా ఇస్తున్నాం. చేసే ప్రయత్నాలు వ్యక్తిగత స్వార్థం లేదు. అంతేగానీ ఎవరికి వారు నడిచే అవకాశం లేదు. ఉమ్మడి కార్యాచరణ అవసరం. నేతలంతా కలిసి నడవాలని భావిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అనేక అంశాలపై స్పందించారు.
కాంగ్రెస్‌లో ఎలాంటి వర్గాలు లేవు
కాంగ్రెస్‌లో ఎలాంటి వర్గాలు లేవు. అలాంటివి వుంటే అది సరైంది కాదు. సభ్యత్వ నమోదు, రైతు, ఇళ్ళ సమస్యలు, నిరుద్యోగ సమస్యల్ని క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేస్తున్నాం. ప్రతి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతాం. రైతుల కోసం పోరుని చివరి వరకూ తీసుకువెళతాం. భూముల అక్రమాలను నిలదీస్తాం అన్నారు భట్టి విక్రమార్క. గతంలో కంటే భిన్నంగా ముందుకు వెళతాం అన్నారు. రాష్ట్రంలో ప్రతిబూత్‌లో, వార్డులో కాంగ్రెస్ అభిమానులు వున్నారు. కాంగ్రెస్ లో పోరాటాలు చేసినవారు అనేకమంది వున్నారు. మాకు బీజేపీ పోటీ అనేది కానేకాదు. టీఆర్‌ఎస్, బీజేపీ చేసేవి భ్రమ, డ్రామా అని అంటున్నారు.
బీజేపీ-టీఆర్‌ఎస్ రెండూ ఒకటే
టీఆర్ఎస్ విధానాలపై పోరాటం చేసింది మేమే. బీజేపీ-టీఆర్‌ఎస్ రెండూ ఒకటే. రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. రెండూ కలిసి ఆడుతున్న నాటకం వరి ధాన్యం విషయంలో జరిగింది. యుద్ధం చేద్దామనేవాడు యుద్ధం చేయాలి. కేసీఆర్ అలా చేయడం లేదు. రైతులకు భరోసా కల్పించడానికే ప్రయత్నిస్తున్నాం. బీజేపీ మాకు పోటీకాదు. బీజేపీ పనైపోయింది. బీజేపీకి దేశవ్యాప్తంగా గ్రాఫ్ పడింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి గురించి ఆలోచించాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేం పోటీ పెడితే మాకు మంచి ఓట్లు వచ్చాయి. ఉన్న ఓట్లు కంటే ఖమ్మం, మెదక్ జిల్లాల్లో మంచి ఓట్లు వచ్చాయి. ప్రజలు కేసీఆర్‌కి వ్యతిరేకంగా వున్నారు.
బీజేపీ తాత్కాలిక బుడగ…రాబోయే ప్రభుత్వం మాదే
బీజేపీ తాత్కాలిక బుడగ లాంటిది.అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే. బీజేపీ బలంగా వుంటే ఎందుకు పోటీపెట్టలేదని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ వుండాలని రాష్ట్ర నాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంది. పోటీ లేకుండా ఇవ్వడం మంచిది కాదు. సీనియర్లను కోవర్టులు అనడం సరికాదు. పార్టీ ఇంట్రెస్ట్ లేనివాళ్ళు కోవర్ట్ ప్రచారం చేస్తారు. వారిని జాగ్రత్తగా వుండాలి. పార్టీని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. అన్ని చర్యలు తీసుకుంటాం. పార్టీ బతికుంటేనే పేదలు బతికి వుంటారు. పార్టీ ముందుంటేనే వనరులు అందరికీ పంచబడతాయని నమ్ముతున్నారు. కాంగ్రెస్ ని నమ్మి పనిచేసేవారు చాలామంది వున్నారు. కోమటిరెడ్డిని కలుపుకుని ముందుకుపోవాలి. డీఎస్ లాంటి వారు పార్టీలోకి వస్తామంటే ఆహ్వానించడంలో తప్పేం లేదు.