ఇండియా చైనా దేశాల మధ్య 13 వ విడత చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. భారత్ ప్రతిపాదించిన ప్రతిపాదనలను చైనా తోసిపుచ్చింది. ఇక ఇదిలా ఉంటే చైనా మరో కొత్త కుట్రకు తెరలేపింది. భూటాన్ దేశంతో ఉన్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ముడు ప్రతిపాదనలు చేసింది. ఈ మూడు ప్రతి పాదనలకు భూటాన్ అంగీకారం తెలపడం భారత్‌కు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పవచ్చు. గత 37 ఏళ్లుగా భూటాన్, చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్నది. ఈ సరిహద్దు వివాదం పరిష్కరించుకోవడమే కాకుండా, బీఆర్ఐ పథకానికి ఆమోదం తెలిపితే, భూటాన్ సరిహద్దుల్లో చైనా అభివృద్ది కార్యక్రమాల పేరిట రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇండియా భూటాన్ సరిహద్దుల్లో శిలిగుడి కారిడార్ ఉన్నది. ఈ కారిడార్ భారత్‌కు కీలకమైనది. దీనిని చికెన్ నెక్ కారిడార్ గా పిలుస్తారు. ఇది భారత్‌ను ఈశాన్యరాష్ట్రాలతో కలిపే కారిడార్. ఈ కారిడార్‌పై చైనా కన్నేసే అవకాశం ఉన్నది. చైనా మూడు అంచెల ప్రతిపాధనలను భూటాన్ అంగీకరించడంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారత్ తన నిఘాను పెద్ద ఎత్తున పెంచింది. ఇకపోతే, పాకిస్తాన్‌కు చైనా హెచ్‌క్యూ 9 క్షిపణులను సరఫరా చేసింది. ఈ క్షిపణులను రష్యా ఎస్ 300 క్షిపణీ వ్యవస్థను పోలి ఉంటుంది. శతృదేశాలకు చెందిన విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశిస్తే వాటిని ముందుగానే పసిగట్టి కూల్చివేసే సత్తా హెచ్‌క్యూ 9 క్షిపణులకు ఉంటుంది. వీటిని పాక్ కు సరఫరా చేయడమే కాకుండా ఇండియాకు కూతవేటు దూరంలో ఉన్న షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో కూడా మోహరించడంతో చైనా పెద్ద కుట్రకు పాల్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.