తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో చంద్రబాబు ఈ నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ పాలన, వైసీపీ నేతల అరాచకాలపై నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు నేను మూడు సార్లు నిరాహార దీక్ష చేశాను. పార్టీ కార్యాలయంపై వైసీపీ ఉగ్రవాద దాడి చేసింది. డీజీపీ ఆఫీస్, సీఎం ఇల్లు, బెటాలియన్ దగ్గర్లోనే ఉన్నాయి. ఏపీ నుంచే వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతోంది.
Read Also:సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీనేత.. అలా జరిగితే టీడీపీ మూసేస్తాం..
హెరాయిన్ డంప్ పట్టుకున్నారు.. దీనికి ఏపీకి లింకులున్నాయి. ఇంతటి పెద్ద ఎత్తున మత్తు మందులు సరఫరా జరుగుతోంటే ప్రభుత్వం అలెర్ట్ కావద్దా..? పార్టీ నేతలపై దాడులు జరిగితే సహించాం.. కానీ డ్రగ్స్ వల్ల పిల్లల భవిష్యత్ పాడవుతోంది. అందుకే డ్రగ్స్ పై టీడీపీ పోరాటం చేస్తోందన్నారు చంద్రబాబు.
దీనికి ప్రజల నుంచి సహకారం వచ్చింది కానీ.. ప్రభుత్వంలో చలనం లేదు. సీఎంకు భయపడి అందరూ సరెండర్ అవ్వాలా..? ఇంత మంది సీఎంలు వచ్చారు.. ఏ సీఎం అయినా మద్యం వ్యాపారం చేయడానికి సాహసించారా..? దొంగ సారా వ్యాపారంతో డబ్బులు గుంజుతున్నారు.
మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్.. మద్యం ఆదాయాన్ని 25 ఏళ్లు తాకట్టు పెట్టారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం ఆడబిడ్డల తాళిబొట్లని తాకట్టు పెట్టారు. మద్యపానం నిషేధం పేరుతో రేట్లు పెంచేశారు.మద్యం ధరలు పెంచితే మద్యపానం తగ్గుతుందా..? పక్క రాష్ట్రానికి పోయి మద్యం తెస్తున్నారు.. శానిటైజర్లు తాగేస్తున్నారు.
మద్యం ధరలు పెరగడం వల్ల తక్కువ ధరకు లభించే గంజాయికి అలవాటు పడుతున్నారు. డ్రగ్స్.. గంజాయి గురించి ఆనందబాబు మాట్లాడితే నోటీసులిచ్చారు. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు సీఎం జగన్‌కు సమీక్ష జరిపే సమయం కూడా లేదా..?మేం ఆధారాలిస్తాం.. పోలీసులు చొక్కాలిప్పేయండి.. ఆ ఇన్వేస్టిగేషన్ మేమే చేస్తాం.. అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.