మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో నిందితుడు గజ్జల ఉమాశంకర్‌రెడ్డి పాత్రకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. ఉమాశంకర్‌రెడ్డి వివేకా పీఏగా పనిచేసిన జగదీశ్వర్‌రెడ్డి సోదరుడు. ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా… అందులో కీలక విషయాలను వెల్లడించింది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో ఉమాశంకర్‌రెడ్డి రోడ్డుపై పరుగులు తీస్తున్నట్లు వివేకా ఇంటి సమీపంలోని బ్రిడ్జి స్టోన్ దుకాణం వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిందని సీబీఐ పేర్కొంది.
Read Also: ఏపీలో ముగిసిన నామినేషన్ల పరిశీలన
సీసీ కెమెరా ఫుటేజీని గుజరాత్ గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్, బెంగళూరులోని ఫిల్మ్ ఫ్యాక్టర్‌కు పంపామని సీబీఐ వెల్లడించింది. అలాగే స్వతంత్ర సాక్షులు, వ్యక్తుల సమక్షంలో ఉమాశంకర్ పరుగును రికార్డు చేశామని పేర్కొంది. రెండు పరుగులకు సారూపత్య ఉన్నట్టు ఫోరెన్సిక్ ల్యాబ్, ఫిల్మ్ ఫ్యాక్టర్ అభిప్రాయపడినట్టు సీబీఐ పేర్కొంది. మరోవైపు వివేకా హత్యలో ఉమాశంకర్‌రెడ్డితో పాటు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరి పాత్ర ఉందని పులివెందుల కోర్టులో అక్టోబరు 27న సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన కోర్టు.. కేసులో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తున్నందున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని పిటిషన్‌ను కొట్టివేసింది.