(సెప్టెంబర్ 7న ‘అఫ్సానా’కు 70 ఏళ్ళు పూర్తి)
దేశం గర్వించదగ్గ దర్శకనిర్మాత బి.ఆర్.చోప్రా. ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘అఫ్సానా’. ప్రముఖ నటుడు అశోక్ కుమార్ ద్విపాత్రాభినయంతో రూపొందిన ‘అఫ్సానా’ 1951 సెప్టెంబర్ 7న విడుదలయింది. ఈ చిత్రానికి ఐ.ఎస్.జోహార్ కథ, మాటలు సమకూర్చారు. షదీలాల్ హండాతో కలసి బి.ఆర్.చోప్రా ఈ సినిమాను నిర్మించారు. త్రిభువన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది.
‘అఫ్సానా’ సినిమా కథ చదువుతున్నట్టుగానే చిత్రీకరించారు. టైటిల్ కార్డ్స్ సమయంలోనే ఓ చేయి పుస్తకం తిప్పుతూ ఉంటుంది. టైటిల్స్ పూర్తి కాగానే కవల సోదరులు రతన్, చమన్ , వారి నేస్తం మీరా కలసి నాటకం వేసే దృశ్యంతో చిత్రం మొదలవుతుంది. ఆ నాటకంలో ఇద్దరు కవలల్లో ఎవరు పెద్దవారు అనే దానిపై చర్చసాగి, ఓ విధూషకుడు వచ్చి ఆ చిక్కు ముడిని విప్పి రతన్ పెద్ద అని తేలుస్తాడు. ఇదే తీరున వారి జీవితం కూడా సాగడం విశేషం. ఓ ప్రదర్శనకు వెళ్ళిన రతన్, చమన్, మీరా విడిపోతారు. చమన్ , మీరా మిగులుతారు. రతన్ ఎక్కడిపోయాడో తెలియదు. మీరా మాత్రం రతన్ తిరిగి వస్తాడని వేచి ఉంటుంది. చమన్, రసిలి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అనుకోకుండా ఓ గొడవలో చమన్ ఓ వ్యక్తిని చంపుతాడు. దాంతో చమన్ పరారీ అవుతాడు. అయితే అది ప్రమాదవశాన జరిగిన మరణం అని కోర్టు చమన్ ను విడుదల చేస్తుంది. అయితే వచ్చిన చమన్ లో తేడా కనిపిస్తుంది. అతనికి రసిలీ కంటే మీరా అంటే ఆసక్తి కలుగుతుంది. చివరకు రతన్ మిగిలాడని తేలిపోవడంతో కథ ముగుస్తుంది.
తొలి చిత్రంలోనే అశోక్ కుమార్ వంటి నాటి మేటి హీరోతో ద్విపాత్రాభినయం చేయించి, ఎంతగానో ఆకట్టుకున్నారు బి.ఆర్.చోప్రా. ఈ చిత్రంలో రతన్ కుమార్, జడ్జి అశోక్ కుమార్ గా, దివాన్ ఛమన్ కుమార్ గానూ అశోక్ కుమార్ వైవిధ్యమైన నటనను ప్రదర్శించారు. వీణా, జీవన్, ప్రాణ్, కుల్దీప్ కౌర్, కుక్కు, తబస్సుమ్, బాలనటునిగా జగ్ దీప్ నటించారు. ఈ చిత్రానికి హుస్న్ లాల్ భగత్ రామ్ సంగీతం సమకూర్చగా, అసద్ భోపాలీ పాటలు రాశారు. ఇందులోని మహ్మద్ రఫీ పాడిన “దునియా ఏక్ కహానీ రే భయ్యా…” పాట ఆ రోజుల్లో ఎంతగానో అలరించింది. షంషాద్ బేగం పాడిన “మొహబ్బత్ కా దోనో…” పాట ఆకట్టుకుంది. లతా మంగేష్కర్ గాత్రంలో జాలువారిన “కహా హై తూ మేరే సప్నోంకీ రాజా…”, “వో ఆయే బహారే లాయే…”, “ఖుషియోం కే దిన్…” వంటి పాటలు మురిపించాయి. కొన్ని చోట్లనే ద్విపాత్రాభినయం కనిపించినా, దానిని చక్కగా తెరకెక్కించడంలో రాజేంద్ర మలోనే సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.