ప్రేమ.. ఎవరు నిర్వచించలేని ఒక గొప్ప అనుభూతి.. ప్రేమ.. ఒక నమ్మకం.. ప్రేమ ఒక త్యాగం.. ప్రేమ అంటే ఒక స్వార్థం.. ఇవన్నీ ఉంటేనే ప్రేమ.. మరి ఆ ప్రేమ దూరమైతే.. అది నరకం.. దాన్ని భరించడం చావు కన్నా ఘోరం. ప్రేమికులు.. తన బ్రేకప్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు.. తనే నా జీవితం.. తనే నా ప్రాణం అంటూ విరహ గీతాలను ఆలపిస్తారు.. అయితే ప్రేమికులలో ఈ బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ ఉంటుంది.. అమ్మాయిలోనా..? అబ్బాయిలోనా..? ఇదే డౌట్ ఎవరినైనా అడిగితే.. ఎవరి ఫీల్ వారికి ఉంటుంది. మాకు ఎక్కువ అంటే మాకు ఎక్కువ అని చెప్పేస్తుంటారు. అయితే తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. బ్రేకప్ లో ఎక్కువగా అమ్మాయిలకంటే అబ్బాయిలే బాధపడతారంట. ఈ విషయాన్ని స్వయంగా రు బ్రిటన్ కు చెందిన ఓ యూనివర్శిటీ పరిశోధకులు పరిశీలించి మరి తేల్చి చెప్పారు. అందులోను అల్లాటప్పాగా పరిశీలించలేదు. దీనికోసం ఏకంగా సుమారు లక్షా ఎనభై నాలుగు వేల మంది లవ్ ఫెయిల్యూర్ అయిన వారిని ఎంచుకొని వారితో మాట్లాడాకే ఈ రిజల్ట్ వచ్చిందని తెలిపారు.
ఇక ఇందులో మగవారు ఎక్కువ బాధపడడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. అమ్మాయిలు కూడా బాధపడినా బ్రేకప్ తర్వాత ఎక్కువగా అబ్బాయిలే ఆ పెయిన్ అనుభవిస్తారట.. గర్ల్స్ అయినా తమ స్నేహితులకు చెప్పుకొంటారేమో బాయ్స్ తమ బ్రేకప్ స్టోరీని ఫ్రెండ్స్ తో కూడా పంచుకోరని సర్వేలో తెలిసింది. ఇంకొంతమంది తమలో తాము కుళ్లికుళ్లి ఏడుస్తారని, తన ప్రియురాలినే తలుచుకుంటూ జీవిస్తారని తెలిపింది. ఇక ఈ బ్రేకప్ అవ్వడానికి గల కారణాలను కూడా వారు చెప్పడం గమనార్హం.
సర్వే చేసిన వారందరిలో సగానికి పైగా యువకులు ఇరువురు మధ్య నమ్మకం లేనందున వీడిపోయినట్లు తెలిపారు.. మరికొంతమంది తన ప్రియురాలు తనను కాదని వేరొక అబ్బాయితో వెళ్లిపోతుందేమో అన్న భయమే వేటాడుతుండేదని, దానివల్లనే బ్రేకప్ అయ్యినట్లు తెలిపారు.ఇంకొంతమంది బ్రేకప్ అయ్యాకా డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు తెలుపగా, మరికొందరు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినట్లు తెలిపారు. ఏదిఏమైనా ఈ బ్రేకప్ బాధ ఎక్కువగా అబ్బాయిలల్లో ఉంటుంది అని ఈ సర్వే తెలిపింది.