కరీంనగర్లో అరెస్టై జైలులో వున్న కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బండి సంజయ్ తో పాటు ముగ్గురు కార్పొరేటర్లను జైల్లో పరామర్శించానన్నారు ఈటల. మొన్న జరిగింది అత్యంత హేయమైన చర్య. ప్రజాస్వామ్య విలువలకు పాతర పెట్టారు. ఉద్యోగులను ఎవరూ ఆదుకోవడం లేదని మధన పడుతున్నారు. ప్రజల పక్షాన నిలిచేందుకు బండి సంజయ్ జాగరణకు పిలుపునిచ్చారు.
సీపీ వాటర్ క్యానన్లతో శత్రువుల మీద దాడి చేయడం దుర్మార్గం. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఇవన్నీ పోలీసులు చేసినట్టు తెలుస్తోంది. జీవో 317 సవరించాలని కోరితే ఇలాంటి నీచమైన చర్యలు చేశారని మండిపడ్డారు. చట్టానికి రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సినది పోయి బానిసల్లాగా పని చేశారన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయుల మీద కక్ష సాధించకండి.
బండి సంజయ్ పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. ఉద్యోగుల గురించి దీక్ష చేస్తుంటే కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జీవో నెం 317 ను సవరించాలని కోరుతున్నా అన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి కరీంనగర్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కి పింక్ బట్టలు, పింక్ చెప్పులు కొరియర్ చేస్తున్నా. పింక్ బట్టలు సీపీకి పంపించాలని టీచర్ లను విజ్ఞప్తి చేస్తున్నా. టీఎస్ పోలీసులు కాదు.. వీళ్ళు TRS పోలీసులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు… మీకు పింక్ స్లిప్స్ తప్పవన్నారు రాకేష్ రెడ్డి.