పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ కు ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే, భవానీ పూర్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్నారు. కొన్నినెలల క్రితం జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సిట్టింగ్ స్థానం భవానీ పూర్ నుంచి కాకుండా నందిగ్రామ్ నుంచి పోటీ చేసి సువేందు అధికారిపై ఓటమిపాలయ్యారు. దీంతో తిరిగి ఇప్పుడు భవానీపూర్ నుంచి రంగంలోకి దిగారు. ఇది ఆమె సిట్టింగ్ నియోజకవర్గం. ఈ నియోజక వర్గంలో ఆమె విజయం నల్లేరుపై నడకే. అయినప్పటికీ బీజేపీ ఎలాగైనా మమతా బెనర్జీని ఓడిస్తామని, అమె ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీదీని ఓడించడం కోసం పెద్ద ఎత్తున స్టార్ క్యాంపెయిన్ తో ప్రచారం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికపైనే బెంగాల్ బీజేపీ దృష్టిసారించింది. దీనికోసమే పశ్చిమ బెంగాల్ రాజ్యసభ స్థానానికి పోటీ నుంచి పక్కకు తప్పుకున్నది. మమతను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్న సువేందు అధికారి టీమ్ ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందా? మరికొన్ని రోజుల్లోనే తేలిపోతుంది.