ఇప్పుడున్నది డిజిటల్ యుగం. ఇళ్లు కదలకుండానే ఒక్క క్లిక్కుతో అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఆఖరికి గుండుసూది కావాలన్నా ఆన్ లైన్లోనే బుక్ చేసే రోజులు వచ్చాయి. ఆన్ లైన్ వల్ల ఎంత ఉపయోగం ఉందో.. అంతే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచి చెడులను బేరీజు వేసుకొని ఇంటర్నెట్ ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇక బ్యాంకులు మొత్తం డిజిటలేజేషన్ అయిపోయిన తర్వాత జనాలు బ్యాంకులు వెళ్లడం తగ్గిపోయింది. తమ అకౌంట్లో పైసలు పడగానే ఏటీఎంలు వెళ్లి డ్రా చేసుకుంటున్నారు. లేదంటే ఆన్ లైన్ పేమెంట్లు చేసేస్తున్నారు. దీని వల్ల మనకు చాలా సమయం ఆదా అవుతుండటంతో అంతా వీటివైపు మొగ్గు చూపుతున్నారు.
ఇక బ్యాంకులు డిజిటలైజేషన్ అయ్యాక తరుచుగా ఒకరి అకౌంట్లో పడాల్సిన డబ్బులు మరొకరి అకౌంట్లో పడటం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు ఏకంగా వందల కోట్ల రూపాయలు ఇతరుల అకౌంట్లలో వేసిన ఘటనలు ఉన్నాయి. ఆ తర్వాత బ్యాంకు అధికారులు తమ తప్పు తెలుసుకొని ఆ డబ్బులను రికవరీ చేస్తుంటారు. ఇలాంటి సంఘటనే తాజాగా బీహార్లో జరిగింది. అయితే ఆ ఖాతాదారుడు ఈ ఇష్యూలోకి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని లాగడం చర్చనీయాంశంగా మారింది. అతడు చెబుతున్న సమాధానం చూసి బ్యాంకు అధికారులుగానీ, పోలీసులు గానీ ఏం చేయలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో అతడి తెలివికి ‘జోహార్లు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. బీహార్లోని ఖగారియాకు చెందిన రంజిత్ దాస్ అనే వ్యక్తికి స్థానిక గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. గత మార్చి నెలలో బ్యాంకు అధికారులు పొరపాటున అతడి ఖాతాలో రూ.5లక్షల 50వేల రూపాయాలను డిపాజిట్ చేశారు. ఇంకేముంది? మనోడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అని ఆలోచించకుండా ఏటీఎం వెళ్లి సీదా డ్రా చేసుకున్నాడు. తన అవసరాల కోసం డబ్బు మొత్తాన్ని ఖర్చు పెట్టేశాడు. తీరా అసలు విషయాన్ని తెలుసుకున్న బ్యాంకు అధికారులు ఖాతాదారుడిని పిలిపించుకొని మాట్లాడారు. దయచేసి తమ డబ్బులు తమకు రిటర్న్ చేయాలని వేడుకున్నారు. దీనికి ఆయన చెప్పిన సమాధానం విని బ్యాంకులు అధికారులే విస్తుపోతున్నారు.
ఈ ఇష్యూలోకి ఏకంగా ప్రధాని నరేంద్రమోదీని ఖాతాదారుడు రంజిత్ లాగడంతో బ్యాంకులు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో చేసేది ఏమిలేక పోలీసులను బ్యాంక్ అధికారులు ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంజిత్ ను విచారించగా వారికి సైతం అతడు అదే సమాధానం చెప్పడం గమనార్హం. ఇంతకీ ఆయన బ్యాంక్ అధికారులకు, పోలీసులకు అతుడు ఏం సమాధానం చెప్పాడంటే..
‘దేశంలోని ప్రతీఒక్కరికి ప్రధాని నరేంద్ర మోదీ రూ.15లక్షలు వేస్తానని చెప్పారు.. అందులో భాగంగానే నాకు తొలివిడుతగా రూ.5లక్షలు వేశారు.. వాటిని నేను డ్రా చేసుకొని అవసరాలకు వాడుకున్నాను.. ఇప్పుడు తన దగ్గర చిల్లీగవ్వ కూడా లేదు’ అని పోలీసులకు తేల్చిచెప్పాడు. దీంతో అతడి నుంచి ఆ డబ్బులను ఎలా రికవరీ చేయాలో వారికి అర్థం కావడం లేదట. అయితే ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న స్థానికులు మాత్రం అతడి బుర్రే.. బుర్ర అంటూ పొగుడుతుంటం గమనార్హం.