కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇబ్బందులతో సతమతం అవుతోన్న టెలికం రంగానికి ఊరట కలిగిస్తూ.. టెలికం సంస్థల్లో వంద శాతం విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుమతిస్తూ ఇస్తూ ఇవాళ నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్.. మోడీ సర్కార్ తాజా నిర్ణయంతో ప్రైవేట్ టెలికం రంగ సంస్థలైన వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్ టెల్ వంటి సంస్థలకు ఊరట కలగనుంది.. అప్పుల్లో కూరుకుపోయిన టెలికం రంగానికి ఊరట కలిగించేలా ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించింది నరేంద్ర మోడీ సర్కార్.. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.
టెలికం రంగంలో ఒత్తిడికి ఏజీఆర్ బకాయిలు ప్రధాన కారణం అన్నారు మంత్రి అశ్వినీ వైష్ణవ్.. దీంతో.. ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. ఇకపై టెలికామేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించిన ఆయన.. ఏజీఆర్ అనేది చట్టబద్ధమైన బకాయిలచెల్లింపు కొరకు పరిగణించబడే ఆదాయాలను తెలియజేస్తుందన్నారు. లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ యూజర్ ఛార్జీలు, అన్ని రకాల ఛార్జీల చెల్లింపు విషయాలను హేతుబద్ధీకరించినట్లు తెలియజేశారు. స్పెక్ట్రం కాలవ్యవధి ఇప్పటి వరకు 20 సంవత్సరాలుగా ఉండగా ఇకపై 30 ఏళ్లకు పెంచనున్నట్టు తెలిపారు. టెలికం రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. అలాగే ఏజీఆర్, స్పెక్ట్రమ్ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం కూడా ఉంటుందని వెల్లడించారు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్.