ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా అప్డేట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. మరి ముఖ్యంగా సంక్రాంతి వసూళ్లను వదులుకోవడానికి ఏ హీరో కూడా తగ్గేదే లే అన్నట్లుగా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఇదివరకు వారాల్లో ఉంటే పోటీ, ఇప్పుడు ఒకటి, రెండు రోజుల్లోనే స్టార్ హీరోల సినిమాలు రావటం ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు జనవరి 13, 2022 ను ‘సర్కారు వారి పాట’తో కబ్జా చేస్తే, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తరువాతి రోజు జనవరి 14, 2022న ‘రాధే శ్యామ్’ తో వచ్చేస్తున్నాడు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని, ‘అయ్యపనుమ్ కోషియుమ్’ రీమేక్ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపింది. జనవరి 12, 2022న థియేటర్లోకి తీసుకురానున్నట్లుగా తాజాగా అధికారిక ప్రకటన చేశారు. అంతేకాదు, ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోందని.. మొదటి పాటను త్వరలోనే విడుదల చేస్తామని వీడియో ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పర్యవేక్షణ బాధ్యతలు ప్రతిసారి కనిపిస్తూనే వున్నాయి. నిజానికి ఈ సినిమా పట్ల త్రివిక్రమ్, పవన్ కోసం ఎక్కువ ఇన్వాల్ అవుతున్నట్లు అర్ధమైపోతుంది. ఇక పవన్ తో పాటుగా రానా పాత్ర ఈ సినిమాలో ప్రత్యేకంగా నిలుస్తోందని చిత్రబృందం భావిస్తోంది. కాగా ఇటీవలే విడుదలైన పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర భీమ్లా నాయక్ పోస్టర్ కి మంచి అదరణ లభించింది. అయితే ఈ సినిమా టైటిల్ ను ఇంకా సస్పెన్స్ చేస్తూనే వున్నారు.