సౌతాఫ్రికాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ పర్యటనలో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఆడాల్సిన మూడు టీ20ల సిరీస్‌ను వాయిదా వేస్తున్నామని… ఆ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
Read Also: ముంబై టెస్టులో విరాట్ కోహ్లీ చెత్త రికార్డు
కాగా డిసెంబర్ 17 నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. అయితే ఇటీవల దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన బీసీసీఐ సమావేశంలో భారత జట్టు యథావిధిగా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టులకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను రహానె స్థానంలో రోహిత్ శర్మకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.