ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరైంది. పట్టాభికి బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. సదరు పిటిషన్‌పై శనివారం మధ్యాహ్నం విచారణ జరిగింది. పట్టాభి అరెస్టుకు సంబంధించి పోలీసులు సరైన విధానం పాటించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ముందుకు అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని కోర్టు నిలదీసింది. ఈ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు హైకోర్టు సమయం ఇచ్చింది. అనంతరం పట్టాభికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు వెల్లడించింది.
Read Also: టీడీపీ కార్యాలయానికి పోలీసుల నోటీసులు
కాగా టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ సమయంలో సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో రెండు రోజుల కిందట పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేసి విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో పట్టాభికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సమయంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని పట్టాభి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు.