Andhra Pradesh Liquor Licence: అసలే ఆదాయం లేక అప్పులతో నెట్టుకొస్తోందనే విమర్శల్ని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బార్‌ల రూపంలో భారీ ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త బార్ల లైసెన్స్‌ల జారీకి దరఖాస్తులను ఆహ్వానించగా మద్యం వ్యాపారుల నుంచి మస్తు స్పందన వచ్చింది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 840 బార్‌లకు ఒక్కో అప్లికేషన్ చొప్పున వస్తుందని అధికారులు అనుకోగా వాళ్ల అంచనాలు తలకిందులయ్యాయి.
అనూహ్యంగా 1672 దరఖాస్తులు వచ్చాయి. స్థానిక జనాభాను బట్టి ఆయా బార్‌లను ముఖ్యంగా మూడు కేటగిరీలుగా విభజించారు. 50 వేల లోపు జనాభా ఉంటే రూ.5 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ.7.5 లక్షలు, 5 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉంటే రూ.10 లక్షలుగా అప్లికేషన్ ఫీజులను నిర్ణయించారు. ఇవి నాన్-రిఫండబుల్. ఈ నేపథ్యంలో దాఖలైన మొత్తం దరఖాస్తుల ద్వారానే కనీసం 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.
read also: Business Headlines: మన దేశంలో ‘యాపిల్’ మరింత లేటు
ఇప్పటికే 1,308 మంది అప్లికేషన్ ఫీజు కట్టేందుకు చలాన్లు తీసుకున్నారు. 834 మంది లైసెన్స్ అప్లికేషన్ ఫీజు పే చేశారు. 1672 మందిలో కనీసం 1300 మంది రుసుము చెల్లించినా పెద్దమొత్తంలోనే జమవుతుందని పేర్కొంటున్నారు. దరఖాస్తులే ఈ రేంజ్‌లో వచ్చాయంటే ఇక వేలంలో పోటీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు. బార్ల కోసం కాంపిటీషన్ తీవ్రంగా ఉంది కాబట్టి చివరికి భారీగానే ఆదాయం వస్తుందని లెక్కలేస్తున్నారు.
గతంలో ఒక్కసారి బార్ లైసెన్స్ తీసుకున్నాక దాన్ని ఏటా రెన్యువల్ చేసుకుంటే సరిపోయేది. కానీ జగన్ సర్కారు కొత్తగా లైసెన్స్‌ల జారీ కసరత్తును మొదలుపెట్టింది. దీనికోసం ఇ-వేలం విధానాన్ని అనుసరిస్తోంది. వైఎస్సార్సీపీ గవర్నమెంట్ నూతన బార్ పాలసీని మూడేళ్ల కాలానికి ప్రకటించటం, దీంతోపాటు ఎన్నికల సమయంలో సంపూర్ణ మద్యపాన నిషేధ హామీ కూడా ఇచ్చింది. బార్‌ల లైసెన్సుల ఫీజును పెంచింది. మరోవైపు మద్యం షాపులను తన అధీనంలోకి తీసుకుంది.
దీంతో మద్యం వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన వస్తుందా రాదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ మద్యం వ్యాపారులు ఉత్సాహంగా ముందుకొచ్చారు. మద్యం షాపులు తమ చేతిలో లేకపోవటంతో వాళ్లు ఖాళీగా ఉన్నారు. బార్ ఏర్పాటు ఖరీదైన వ్యవహారం అయినా బిజినెస్ బాగా జరుగుతుందనే ఆశాభావంతో బార్ లైసెన్స్ అప్లికేషన్ల దాఖలు విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు.
ఎక్సైజ్ శాఖ వెబ్‌సైట్‌ని దరఖాస్తులతో ముంచెత్తారు. బార్లను చేజిక్కించుకునేందుకు విపరీతంగా పోటీపడ్డారు. కొత్త బార్‌లకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే గడువు బుధవారంతో ముగిసింది. అప్లికేషన్ల ద్వారా ఇంత డబ్బు వస్తుందని ప్రభుత్వం అస్సలు అనుకోలేదు. నిధుల కొరతతో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కాస్త ఊరట కలిగించే అంశమేనని చెప్పొచ్చు.