కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు విశేషమైన ఆదరణ లభిస్తుందని అంతా భావించారు. అయితే… తెలుగులో ఒక్క ఆహా తప్పితే మరే ఓటీటీ సంస్థ తెలుగు నిర్మాతల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతోంది. గత యేడాది కరోనా సందర్భంలో అమెజాన్ ప్రైమ్ తెలుగు మార్కెట్ ను కాప్చర్ చేయాలని, తన సత్తా చాటాలనీ భావించింది. దానికి అనుగుణంగా రెండు పెద్ద చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ కోసం తీసుకుని విడుదల చేసింది. కానీ ఆశించిన స్థాయిలో వాటికి రిటర్న్స్ రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ యేడాది థియేటర్లు మూత పడిన సందర్భంగానూ మరోసారి అమెజాన్ ప్రైమ్ తెలుగు నిర్మాతల నుండి మంచి సినిమాలు తమకు లభిస్తాయని ఆశపడిందట.
Read Also : ఆసక్తికరంగా “వసంత కోకిల” టీజర్
బట్… పెద్ద చిత్రాల నిర్మాతలంతా ఆలస్యమైన థియేటర్లలోనే తమ చిత్రాలను విడుదల చేయాలని భీష్మించుకోవడంతో అమెజాన్ ప్రైమ్ ఆశలపై నీళ్ళు కుమ్మరించినట్టు అయ్యింది. అదే సమయంలో చిన్న చిత్రాల నిర్మాతలు భారీ మొత్తాలను ఆశిస్తూ, అమెజాన్ ప్రైమ్ వర్గాలతో సంప్రదింపులు జరిపారట. కానీ ఆ సినిమాలకు వచ్చే స్పందనను గ్రహించిన అమెజాన్ ప్రైమ్ వాటిని తీసుకునే విషయంలో నిర్లిప్తతను ప్రదర్శించిందని అంటున్నారు. ఇటీవల కాలంలో అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ స్ట్రయిట్ తెలుగు సినిమా అంటే ‘పచ్చీస్’ మాత్రమే స్ట్రీమింగ్ అయ్యింది. దానికీ అంతంత మాత్రమే రెస్పాన్స్ వచ్చింది. గత యేడాది లాగా ఈ సారి ఒక్క పెద్ద చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాలేదు. తెలుగులో చిన్న చిత్రాల నిర్మాతలు అత్యాశకు పోతున్నారని, పెద్ద చిత్రాల నిర్మాతలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని అమెజాన్ వర్గాలు రుసరుసలాడున్నట్టు సమాచారం. విశేషం ఏమంటే.. ఇదే సమయంలో ఆహా సంస్థ స్ట్రయిట్ తెలుగు చిన్న సినిమాలను, అనువాద చిత్రాలను విడుదల చేస్తూ తెలుగు మార్కెట్ పై తన పట్టును రోజురోజుకూ బిగిస్తోంది.