ఏపీలో అమరావతి ఎప్పడూ హాట్ టాపిక్కే. తాజాగా అమరావతిని కార్పోరేషన్ గా చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా రాజధాని గ్రామాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది. అమరావతి కాపిటల్ సిటీ ప్రభుత్వ ప్రతిపాదనకు రైతులు, గ్రామాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కురగల్లు, మందడం, నీరు కొండ ప్రాంతాల్లో రాజధాని గ్రామాలను విలీనం చేస్తున్నామని అధికారులు ప్రతిపాదన పెట్టారు. సీఆర్‌డీఏ…చట్టాల ప్రకారం రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని…కార్పొరేషన్ సిటీకి వ్యతిరేమంగా ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. దీంతో రాజధాని ప్రాంతంలో మరో వివాదం రాజుకుంటోంది.
అమరావతి రాజధాని ప్రాంతంలోని 19 గ్రామాలను కార్పొరేషన్‌గా మార్చాలన్న…ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని మూడు గ్రామాలు కలపాలని సంకల్పించారు. అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి గ్రామస్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2014లో సీఆర్‌డీఏ చట్టాల ప్రకారం…ప్రభుత్వం తమ భూములు తీసుకుందని అంటున్నారు. అదే చట్టాలను అమలు పరచి సీఆర్‌డీఏ పరిధిలో వచ్చే పూర్తి స్థాయి బెనిఫిట్స్ అందించిన తర్వాత… గ్రామాల విలీన ప్రతిపాదన సంగతి చూడాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు రైతులు.
కేవలం గ్రామాలతో కార్పొరేషన్ సిటీ అంటూ ప్రభుత్వం రైతుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని 19 గ్రామాలను ఒకే రాజధానిగా ఒకే కార్పొరేషన్‌గా కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో రాజధాని ప్రాంతాన్ని మార్చాలని ప్రభుత్వం ఆలోచన చేస్తే కోర్టులకు వెళ్లి రాజధానిని కాపాడుకున్నామంటున్నారు. అమరావతే ఏకైక రాజధాని అంటూ పాదయాత్ర చేసి దేశం దృష్టికి తమ ఇబ్బందులు తెచ్చామంటున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి రైతులకు అన్యాయం చేయాలని చూస్తే మరోసారి న్యాయస్థానం ద్వారా ప్రభుత్వానికి బుద్ది చెబుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.
కురగల్లు,నీరుకొండ, మందడం తదితర గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించిన అధికారులు ప్రభుత్వం ప్రతిపాదనకు ఎవరైనా అనుకూలంగా ఉంటే అభిప్రాయం చెప్పాలని కోరారు. కానీ ఆయా గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు రైతులు. ప్రతిసారీ ఏదో ఒక కొత్త స్కీంలతో రాజధాని ప్రాంతాన్ని వివాదాస్పద ప్రాంతంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ అంటూ గ్రామాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రైతులు అంటున్నారు. మొత్తం మీద అమరావతి కార్పోరేషన్ రగడ ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.