ఎన్నికలు వచ్చాయంటే చాలు.. రాజకీయ నేతలు ఓట్ల కోసం పడేపాట్లు అంతా ఇంత కాదు… ఎప్పటికప్పుడు వినూత్న తరహాలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.. డబ్బులు, మద్యం.. ఇలా ప్రలోభాలకు కూడా తక్కువేం కాదనే చెప్పాలి. ఇక, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. యూపీలో మరోసారి అధికారాన్ని దక్కించుకోవడానికి బీజేపీ పావులు కదుపుతుంటే.. కాంగ్రెస్ ఓవైపు.. సమాజ్‌వాది పార్టీ ఇంకో వైపు వారి ప్రయత్నాలు చేస్తున్నాయి.. అయితే, ఎస్పీ ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న ప్రయత్నమే చేస్తోంది.. ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అత్తరును విడుదల చేశారు.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ సెంటు అద్భుతాలు సృష్టిస్తుందని తెలిపారు అఖిలేష్ యాదవ్.. 22 సహజసిద్ధ సుగంధాలతో తయారు చేసిన ఆ అత్తరుకు.. ‘సమాజ్‌వాదీ అత్తరు’ అని పేరు పెట్టారు. దీనిని గాజు సీసాలలో ఉంచి, పైన సైకిలు గుర్తును ముద్రించారు. ఇక, కవరుపై అఖిలేష్ బొమ్మ కూడా ఉండేలా చర్యలు తీసుకున్నారు పార్టీ నేతలు. కాగా, యూపీలో వచ్చే ఏడాది ఆరంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.. ఈ సందర్భంగా ఎస్పీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ అత్తరును వాడినవారు దానిలోని సామ్యవాదాన్ని వాసన చూస్తారని వ్యాఖ్యానించారు.. ఈ అత్తరు 2022లో విద్వేషాన్ని తుదముట్టిస్తుందని చెప్పుకొచ్చారు. చూడాలి మరి.. సమాజ్‌వాదీ అత్తరు.. ఎన్ని ఓట్లు రాబడుతుందో.