నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బ్లాక్ బస్టర్ మూవీస్ ‘సింహా, లెజెండ్’ తర్వాత ముచ్చటగా మూడోసారి బాలకృష్ణను ‘అఖండ’ తో డైరెక్టర్ చేస్తున్నారు బోయపాటి శ్రీను. ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి రాజీపడకుండా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. తమన్ స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమా సంగీత సంబరాలు శనివారం సాయంత్రం మొదలయ్యాయి.
‘అఖండ’ చిత్రంలోని ‘అడిగా… అడిగా… పంచప్రాణాలు నీ రాణిగా’ అనే మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. కళ్యాణ చక్రవర్తి రాసిన ఈ పాటను ఎస్.పి. చరణ్ తో కలిసి ఎం.ఎల్. శ్రుతి గానం చేశారు. వీనుల విందుగా సాగే ఈ గీతం కన్నుల పండువగా కూడా ఉండటం విశేషం. సినిమాలోని భారీతనమంతా ఈ పాటలో కనిపిస్తూ ఉంది. గతంలో బాలకృష్ణ ‘డిక్టేటర్’ మూవీకి తమన్ స్వరాలు అందించాడు. అలానే బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘సరైనోడు’కూ తమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు. ఆ రకంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీనుతో తమన్ వర్క్ చేయడం ఇది రెండో సారి. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ‘అఖండ’ విడుదల విషయంలో నిర్మాతలు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.