సూర్యుడు, భూమి మద్య కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది. ఇంత దూరం ఉన్నప్పటికీ సూర్యుడి నుంచి వెలువడే కాంతి, వేడి భూమిని చేరుతుంటాయి. సమ్మర్ వచ్చింది అంటే వేడిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటాం. అంతటి వేడున్న సూర్యుని వద్దకు చేరుకోవాలంటే అయ్యేపనేనా… అంటే కాదని చెప్తాం. అసాధ్యాన్ని నాసా సుసాధ్యం చేసి చూపించింది. కొన్ని నెలల క్రితం నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహం ఏప్రిల్ 28 వతేదీన సోలార్ కరోనాలోకి ప్రవేశించింది. సూర్యుని నుంచి 8.13 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న కరోనా వలయంలోకి ఎంటరైంది ప్రోబ్. డిసెంబర్ మొదట్లో 4.18 మిలియన్ మైళ్ల దూరానికి చేరుకుంది. కాగా, తాజాగా ప్రోబ్ సూర్యుని నుంచి 3.83 మినియన్ మైళ్ల దూరానికి చేరుకుంది. ఆక్కడ ఉష్ణోగ్రత 2 మిలియన్ డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉంటుంది. సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న ప్రోబ్ అక్కడి సమాచారాన్ని, ధూళి కణాలను సేకరించి డేటాను భూమి మీదకు పంపుతున్నది. సూర్యుని వాతావరణంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కరోనా వలయంలో 2 మిలియన్ల వరకు ఉన్న ఉష్ణోగ్రత, సూర్యుని ఉపరితలంపైకి వచ్చేసరికి అంతకన్నా తక్కువగా ఎందుకు ఉంటుంది అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రోబ్ పంపే సమాచారం కీలకం కానున్నది.