భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం దిగ్విజయంగా ఆరో రోజుకు చేరింది. కార్తీక మాసాన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం వేలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండువగా జరుగుతోంది. ఆరోరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు.
ఈరోజు కార్యక్రమంలో ముందుగా శంఖారావం పూరించిన తర్వాత హైదరాబాద్ రామకృష్ణమఠానికి చెందిన శ్రీశితికంఠానంద స్వామి, రాజమహేంద్రవరం రామకృష్ణమఠానికి చెందిన శ్రీవినిశ్చలానంద స్వామి, తిరుపతి రామకృష్ణమఠానికి చెందిన శ్రీసుకృతానందస్వామి ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం జరిగింది. అనంతరం బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారి ఆధ్వర్యంలో భక్తులు ప్రవచనామృతం విని తరించారు. అనంతరం కాజీపేట గణపతికి కోటి గరికార్చన, గణపతి విగ్రహాలకు గరికార్చన కార్యక్రమాలను వేదపండితులు నిర్వహించారు.
అనంతరం ఈరోజు కార్యక్రమానికే హైలెట్‌గా శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి కల్యాణం కన్నులపండువగా, అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవాన్ని కోటి దీపోత్సవం వేదికపై వేదమంత్రోచ్ఛరణల నడుమ వేదపండితులు ఘనంగా జరిపించారు. అనంతరం మూషిక వాహనంపై స్వామివారిని భక్తులను ఆశీర్వదించేందుకు వేదిక ప్రాంగణమంతా ఊరేగించారు.
కాణిపాకం వరసిద్ధి వినాయకుడి కల్యాణ మహోత్సవం సందర్భంగా శివనామస్మరణలతో యావత్తు వేదిక ప్రాంగణం మార్మోగింది. అనంతరం కోటి దీపోత్సవానికి తరలివచ్చిన భక్తజనం కోటి దీపార్చన నిర్వహించారు. ఇక చివర్లో లింగోద్భవ ఘట్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంగారు లింగోద్భవం సన్నివేశాన్ని కన్నులారా చూసి తరించడమే తప్ప చెప్పడం వీలుకాదు.