50 ఏళ్ళ ‘మోసగాళ్ళకు మోసగాడు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఆగస్టు 27తో కృష్ణ ‘మోసగాళ్ళకు మోసగాడు’కు 50 ఏళ్ళు పూర్తి)
ఏ రంగంలోనైనా రాణించాలంటే మనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలి. అలా చాటుకున్నవారే ఎక్కడైనా హీరోలు. నటశేఖర కృష్ణ సినిమా రంగంలో అడుగుపెట్టే నాటికి అప్పటికే సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రకాల్లో నటించేసిన మేటి నటులు రాజ్యమేలుతున్నార. వారి చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించిన కృష్ణ ఎలాగైనా తాను వారి స్థాయికి చేరుకోవాలని కలలు కనేవారు. అందుకు ఆయన తమ్ముళ్ళు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు సైతం దన్నుగా నిలిచారు. తమకంటూ ఓ నిర్మాణ సంస్థ ఉన్నప్పుడే తమకు నచ్చిన కథలతో జనాన్ని అలరించవచ్చునని ఆ సోదరులు భావించారు. పద్మాలయా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా ‘అగ్నిపరీక్ష’ను తెరకెక్కించారు. ఆ టైటిల్ ను ఎవరు నిర్ణయించారో కానీ, నిజంగానే కృష్ణసోదరులకు ఆ సినిమా ఓ అగ్నిపరీక్ష పెట్టింది. అందులో పరాజితులయ్యారు వారు. ఆ సినిమా పరాజయం పాలయినా, ఎలాగైనా తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలని కృష్ణసోదరులు భావించారు. ఈ నేపథ్యంలో కౌబోయ్ మూవీని తెరకెక్కించాలని ఆశించారు. అప్పటి దాకా తెలుగులో ఎవరూ కౌబోయ్ సినిమాను నిర్మించలేదు. అలా కృష్ణ సోదరులు నిర్మించిన చిత్రమే ‘మోసగాళ్ళకు మోసగాడు’. 1971 ఆగస్టు 27న ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రం విడుదలై విజయఢంకా మోగించింది. ఆ సినిమాలోని మాస్ ఎలిమెంట్ జనాన్ని బాగా కట్టిపడేసింది. దాంతో కృష్ణ చిత్రాలనూ అభిమానించే గణాలు తయారయ్యాయి. అలా యాభై ఏళ్ళ క్రితం తెలుగువారి తొలి కౌబోయ్ మూవీగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ తెరకెక్కింది.
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
యన్టీఆర్ స్ఫూర్తితో…
ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ‘తేనె మనసులు’ ద్వారా ఓ హీరోగా పరిచయమయ్యారు కృష్ణ. ఆ తరువాత ‘గూఢచారి 116’ కృష్ణకు హీరోగా మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత కృష్ణ పలు చిత్రాలలో హీరోగా నటించినా, అవేవీ ఆయనకు స్టార్ డమ్ సంపాదించిపెట్టలేదు. తొలి నుంచీ యన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకున్న కృష్ణ తాను కూడా సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి, తమ అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మించాలని ఆశించారు. సాంఘికాల్లో సైతం కేవలం కుటుంబ కథా చిత్రాలలోనే కాకుండా ‘దొరికితే దొంగలు’ వంటి సైంటిఫిక్ మూవీతోనూ, ‘లక్షాధికారి’ లాంటి థ్రిల్లర్ తోనూ అలరించారు యన్టీఆర్. అందువల్ల యన్టీఆర్ టచ్ చేయని కథాంశంతో ముందుకు సాగాలని కృష్ణ సోదరులు ఆలోచించారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ లో విశేషాదరణ పొందే కౌబోయ్ మూవీస్ బాణీలో ఓ తెలుగు చిత్రాన్ని తెరకెక్కించాలని ఆశించారు. ప్రముఖ రచయిత ఆరుద్ర కొన్ని హాలీవుడ్ కౌబోయ్ మూవీస్ ఆధారంగా తెలుగు నేటివిటీకి తగ్గ కౌబోయ్ కథను రూపొందించారు. అదే ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఈ చిత్ర నిర్మాణంలో కృష్ణ సోదరులు ఏ మాత్రం రాజీపడలేదు. కథానుగుణంగా రాజస్థాన్ ఎడారిలో చిత్రీకరణ జరపడంలో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చారు. ఇక ఈ సినిమాకు ఆదినారాయణరావును సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. ఆదినారాయణరావు తన సొంత చిత్రాలకు మాత్రమే సంగీతం సమకూర్చుకొనేవారు. అయితే ఆయన నిర్మించిన ‘అమ్మకోసం’ చిత్రంలో కృష్ణ నటించడమే కాదు, నిర్మాణ వ్యవహారాల్లోనూ ఆయన సోదరులు సహాయం అందించడంతో ఆదినారాయణరావు ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రానికి సంగీతం సమకూర్చడానికి అంగీకరించారు.
పలు కౌబోయ్ మూవీస్ కలబోత…
హాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన “మెకనాస్ గోల్డ్, ద గుడ్, ద బ్యాడ్ అండ్ ది అగ్లీ, ఫర్ ఏ ఫ్యూ డాలర్స్ మోర్” చిత్రాల కలగలపుగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రకథను రూపొందించారు ఆరుద్ర. ఆయనకు చరిత్రలో మంచి పట్టు ఉండడంతో మన బొబ్బిలి సంస్థానానికి చెందిన ఓ కథను ఇందులో అనువుగా చొప్పించారు. అలా ముస్తాబయిన చిత్రమే ‘మోసగాళ్ళకు మోసగాడు’.
మన కౌబోయ్ కథ…
బొబ్బిలి యుద్ధం జరిగే సమయంలో బ్రిటిష్ వారికి దక్కకుండా జమీందారులు తమ సంపదను ఓ చోట దాస్తారు. ఆ గుట్టు తెలిసిన కొత్వాల్ ను నిధి రహస్యం చెప్పమని చంపేస్తారు. ధర్మంకోసం పోరాడే కొత్వాల్ కొడుకు కృష్ణ ప్రసాద్ ఈ విషయం తెలుసుకొని వారిని అంతమొందించడానికి పూనుకుంటాడు. అతనికి నక్కజిత్తుల నాగన్న అనే దొంగ తోడవుతాడు. రాధ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. వీరితో కలసి తన కన్నవారిని కడతేర్చిన దుండగుల వేటకు బయలు దేరతాడు. అనుకున్నట్టుగానే అందరినీ చంపుతూ ముందుకు సాగుతాడు. చివరకు నిధిని సాధిస్తారు. నక్కజిత్తుల నాగన్నను ఆఖరున ఓ చెట్టుకు వేలాడదీసి అతను చేసిన మోసానికి శిక్ష అంటారు. అయితే కృష్ణ ప్రసాదే నాగన్నను బంధ విముక్తుణ్ణి చేసి వెళ్లడంతో కథ ముగుస్తుంది. మధ్యలో పలువురు విలన్లు, వారి బారి నుండి హీరో తప్పించుకోవడం, వారిని అంతమొందించడం అన్నీ ఆసక్తికరంగా సాగాయి. ఇలా తెలుగువారి తొలి కౌబోయ్ చిత్రంగా రూపొందిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ విశేషాదరణ చూరగొంది.
ఈ చిత్రానికి రచనతో పాటు కొన్ని పాటలు కూడా ఆరుద్ర రాశారు, మిగతావి అప్పలాచార్య పలికించారు. ఆదినారాయణ రావు స్వరకల్పనలో రూపొందిన “కోరినది నెరవేరినిది…” అనే పాట డ్యూయట్ గా అలరించింది. “ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా…” పాట కామెడీతో ఆకట్టుకుంది. “కత్తిలాంటి పిల్లా…” అనే పాట కవ్విస్తుంది. “గురిని సూటిగా…” అనే పాట, “తకిట ధిమితక…” పాట కూడా అలరించాయి. ఇక ఆరుద్ర రాసిన సంభాషణలు అప్పట్లో యువతను భలేగా ఆకట్టుకున్నాయి.
యన్టీఆర్ అభినందన!
కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ఈ చిత్రంలో గుమ్మడి, నాగభూషణం, సత్యనారాయణ, ముక్కామల, ధూళిపాల, జ్యోతిలక్ష్మి, ప్రభాకర్ రెడ్ది, నగేశ్, రావు గోపాలరావు ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి వి.ఎస్.ఆర్.స్వామి ఫోటోగ్రఫి భలేగా ఆకట్టుకుంది. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో రూపొందిన తొలి కౌబోయ్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’ మాస్ ను విశేషంగా అలరించింది. ముఖ్యంగా కౌబోయ్ సినిమాలు తెలుగువారికి కొత్తగా అనిపించడంతో బాలలను విశేషంగా మురిపించింది. కృష్ణ సోదరులు పడ్డ కృషికి తగ్గ ఫలితం దక్కింది – ఈ సినిమా పెద్ద హిట్ గా నిలచింది. తొలి సినిమాతో చూసిన నష్టాలను సైతం ఈ సినిమా లాభాలు పూడ్చి వేశాయి. మాస్ మూవీస్ లో వరైటీ రోల్స్ పోషిస్తూ సాగుతున్న యన్టీఆర్ సైతం కృష్ణ సోదరుల ప్రయత్నాన్ని అభినందించారు. ఆ తరువాత కృష్ణతో ఇతర నిర్మాతలు సైతం కౌబోయ్ మూవీస్ నిర్మించడం ఆరంభించారు. దాంతో తెలుగువారి కౌబోయ్ హీరోగా కృష్ణ సక్సెస్ రూటులోసాగిపోయారు.
కృష్ణ నటవారసుడు మహేశ్ బాబు తరువాతి రోజుల్లో ‘టక్కరిదొంగ’ అనే కౌబోయ్ మూవీలో నటించాడు. ఈ చిత్రం పతాక సన్నివేశంలో కృష్ణ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆయనను ఉద్దేశించి, మహేశ్ బాబు “ఆయన మోసగాళ్లకు మోసగాడు…” అని చెప్పడం అభిమానులను ఎంతగానో ఆనందింప చేసింది. ఏది ఏమైనా తెలుగునాట కౌబోయ్ మూవీస్ కు క్రేజ్ సంపాదించిపెట్టిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ యాభై ఏళ్ల క్రితం చేసిన హంగామాను అభిమానులు ఇప్పటికీ గుర్తు పెట్టుకొనే ఉన్నారు.
తాజావార్తలు
-
PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
-
US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!