(జూలై 16తో ‘శ్రీమంతుడు’కు 50 ఏళ్ళు)
విశ్వభారతి ప్రొడక్షన్స్ పతాకంపై కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో నటసమ్రాట్ ఏయన్నార్, జమున జంటగా రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు’. ప్రత్యగాత్మ, ఏయన్నార్ కాంబినేషన్ లో పలు చిత్రాలు రూపొంది, మంచి విజయం సాధించాయి. అదే తీరున ‘శ్రీమంతుడు’ కూడా పాటలతో అలరిస్తూ ఆదరణ పొందింది. 1971 జూలై 16న విడుదలయిన ఈ చిత్రం టాక్ బాగానే ఉన్నా, అప్పటి ఏయన్నార్ రంగుల చిత్రాల హవా ముందు నిలవలేకపోయిందనే చెప్పాలి.
కథేమిటంటే…
‘శ్రీమంతుడు’ కథ విషయానికి వస్తే – శేఖరం అనే ఆఫీసర్ కు చలపతి అనే స్నేహితుడుంటాడు. చలపతి తాగుబోతు అయినా, ఎంతో తెలివైన వాడు. శేఖరం కూతురు రాధకు, చలపతి కొడుకు రాజాకు చిన్నప్పటినుంచీ జోడీ అంటకడుతుంటారు. శేఖరం చలువతో చలపతికి ఓ ఐదెకరాల భూమి లభిస్తుంది. అందులో మైకా గని పడుతుంది. అందుకోసం శేఖరం తన ఆస్తిని పెట్టి, డబ్బు ఇస్తాడు. చలపతి కోటీశ్వరుడవుతాడు. ఓ ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో చలపతి అక్క కాసులమ్మ దురాలోచనతో రాజా పెంపకం బాధ్యత తీసుకొని, ఆస్తి తమదేనని బుకాయిస్తుంది. దాంతో శేఖరం తన ఆస్తి అమ్మి అప్పులు తీర్చి ఊరు వదలి వెళతాడు. కాసులమ్మ తన మేనల్లుడిని తాగుబోతుగా మారుస్తుంది. అతణ్ని వెదుక్కుంటూ పెద్దయ్యాక రాధ వస్తుంది. అతణ్ణి మారుస్తుంది. రాజా తమ చేయిదాటి పోయాడని, ఓ ప్లాన్ ప్రకారం అతణ్ణి అంతమొందించాలని కాసులమ్మ ఎత్తు వేస్తుంది. రాజా కారు లోయలో పడుతుంది. కానీ, రాజా తిరిగి వస్తాడు. తానే రాజానని చెప్పినా ఎవరూ నమ్మరు. చివరకు రాధ కూడా నమ్మలేదు. అయితే రాజా కారును ఓ దొంగ ఎత్తుకుపోయి, ప్రమాదం వశాన లోయలో పడి ఉంటాడు. అప్పటికే రాజా తన ఆస్తి మొత్తాన్నీ రాధ పేరిట రాసి ఉండడంతో, కాసులమ్మ, ఆమె మేనేజర్ కిష్టయ్య కలసి రాధను బంధిస్తారు. రాజా వచ్చి విడిపించి, దోషులను చట్టానికి పట్టిస్తాడు. ఆస్తి తనకు దక్కక పోవడంతో కాసులమ్మ పిచ్చిదై పోతుంది. ఆమెతో పాటు, కిష్టయ్యను పోలీసులు పట్టుకు పోతారు.
వాస్తవ సంఘటన స్ఫూర్తి…
ముంబైలో జరిగిన ఓ సంఘటనలో చనిపోయాడనుకున్న మనిషి తిరిగి వచ్చాడు. అతని కారును వేరొకరు తీసుకుపోయి మరణించడంతో అందరూ అతనే చనిపోయాడని భావించారు. ఆ సంఘటన అప్పట్లో చర్చనీయాంశమయింది. దీని ఆధారంగానే ‘శ్రీమంతుడు’ చిత్రం తెరకెక్కింది. ముళ్ళపూడి తనదైన చమక్కులతో కథను మరింతగా రక్తి కట్టించారు. ‘శ్రీమంతుడు’ చిత్రంలో గుమ్మడి, రమణారెడ్డి, రాజబాబు, రావి కొండలరావు, సాక్షి రంగారావు, సూర్యకాంతం, ఝాన్సీ, జయకుమారి, బేబీ శ్రీదేవి, మాస్టర్ ఆదినారాయణరావు ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి ముళ్ళపూడి వెంకట రమణ కథ, మాటలు సమకూర్చారు. దాశరథి, కొసరాజు, నారాయణరెడ్డి, ఆరుద్ర పాటలు రాశారు. ఈ సినిమాకు టి.చలపతిరావు స్వరకల్పన ఓ ఎస్సెట్ అని చెప్పాలి. ఈ చిత్రానికి జి.రాధాకృష్ణమూర్తి నిర్మాత.
అలరించిన పాటలు
ఇందులోని ఎనిమిది పాటలూ రంజింప చేశాయి. “చిట్టిపొట్టి బొమ్మలు…” పాటలో చిన్నారి శ్రీదేవి అభినయం ఆకట్టుకుంటుంది. “మొదటి పెగ్గులో మజా…”, “ఎంతో చిన్నది జీవితం…”, “చల్లని వెన్నెలలో…”, “హరిలో రంగ హరీ…”, “ఆహా! ఏమందమూ…”, “కొంటె చూపులెందుకు లేరా… జుంటి తేనెలందిస్తారా…” వంటి పాటలు భలేగా అలరించాయి. ఈ సినిమా పాటల్లో “బులి బులి ఎర్రని బుగ్గలదానా…” పాట హైలైట్ అని చెప్పొచ్చు. సినిమాలో చివరగా వచ్చే ఈ పాటకు ఏయన్నార్ వేసిన స్టెప్స్ అభిమానులను భలేగా ఆకట్టుకున్నాయి. ఈ పాట రాగానే థియేటర్లలో కేరింతలు మోగేవి.
ఏయన్నార్ ప్లేస్ లో కమల్ హాసన్!
ఈ సినిమాకు తంగప్ప, పసుమర్తి, సుందరం నృత్యాలు సమకూర్చారు. తంగప్ప వద్ద అప్పట్లో కమల్ హాసన్ అసిస్టెంట్ గా పనిచేసేవారు. “మొదటి పెగ్గులో మజా…”, “ఎంతో చిన్నది జీవితం…” పాటలకు తంగప్ప నేతృత్వంలో డాన్స్ కంపోజ్ చేసింది కమల్ హాసనే. ఈ సినిమాలో హీరో ఎంట్రీ సీన్ లో ఏయన్నార్ కు బదులుగా కమల్ హాసన్ పడకపై పడుకుని నటించారు కూడా. చుట్టూ అమ్మాయిలు ఉంటారు, మధ్యలో పడుకున్నది కమల్ హాసన్. తరువాత క్లోజ్ లో ఏయన్నార్ ను చూపిస్తారు. ఈ చిత్రం ఫస్ట్ రిలీజ్ కంటే రిపీట్ రన్స్ లో మంచి ఆదరణ పొందింది.