దేశంలో మాదకద్రవ్యాల సరఫరాపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అనుమానం వచ్చిన ప్రతిచోట తనిఖీలు చేపట్టి మాదకద్రవ్యాల స్మగ్లర్లకు చెక్ పెడుతున్నారు. అయితే తాజాగా గుజురాత్ తీరంలో భారీగా హెరాయిన్ పట్టుబడటం కలకలం రేపుతోంది. భారత రక్షణ దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా గుజరాత్ తీరంలో ఆపరేషన్ నిర్వహించాయి.
దీంతో భారత జలాల్లో పాకిస్తాన్‌కు చెందిన ఫిషింగ్ బోట్‌ను అధికారులు సీజ్ చేశారు. బోట్‌లో రూ.400 కోట్లు విలువ చేసే 77 కిలోల హెరాయిన్ గుర్తించి అధికారులు సీజ్ చేశారు. దీంతో పాటు హెరాయిన్‌తో తరలిస్తున్న 6గురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితులను విచారిస్తున్నారు.