అసలే లేడీ కిలాడీలు. నేరాల్లో ఆరితేరిపోయారు. ఏ చిన్న అవకాశాన్నీ వారు వదలరు. కోట్లు విలువ చేసే హెరాయిన్ స్మగ్లింగ్ చేశారు. చాలా బాగా మేనేజ్ చేశారు. కానీ హైదరాబాద్ కస్టమ్స్ అధికారుల ముందు వారి ఆటలు సాగలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఇద్దరు మహిళా ప్రయాణీకులను అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు.
హెరాయిన్ ని తాము వెంట తెచ్చుకున్న ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచారు లేడీ కిలాడీలు. ఆ ఇద్దరిపై అనుమానం కలగడంతో అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు తమదైన రీతిలో విచారించారు. కానీ అధికారులు చేసే స్కానింగ్ కు చిక్కకుండా జాగ్రత్త పడ్డారా కిలాడీ లేడీస్. ఎయిర్‌పోర్ట్ లో 6 గంటల పాటు కస్టమ్స్ అధికారులకు చుక్కలు చూపించారు మాయలేడీలు.
చివరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు ఆ కిలాడీ స్మగ్లర్స్. ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో ప్రత్యేకించి తయారు చేయబడిన ప్యాకెట్ లో దాచి తరలించే యత్నం చేశారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బయట పడ్డ హెరాయిన్ గుట్టురట్టయింది. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 90 కోట్ల రూపాయల పైమాటే వుంటుందని వెల్లడించారు కస్టమ్స్ అధికారులు. ఇద్దరు మహిళా ప్రయాణీకుల్ని అరెస్ట్ చేసి దీని వెనుక వున్న అసలు నేరస్తుల గుట్టువిప్పే పనిలో పడ్డారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.