(అక్టోబర్ 4న ‘డాడీ’కి ఇరవై ఏళ్ళు పూర్తి)
మెగాస్టార్ చిరంజీవికి 2001వ సంవత్సరం నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఆ యేడాది ఆయన నటించిన ‘మృగరాజు’ చేదు అనుభవాన్ని మిగల్చగా, ‘శ్రీమంజునాథ’ కూడా ఆశించిన స్థాయిలో అలరించలేదు. అయితే ‘డాడీ’ చిత్రం మాత్రం నటునిగా ఆయనకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది. ఈ చిత్రంలోనే అల్లు అర్జున్ తొలిసారి తెరపై నర్తిస్తూ కనిపించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ‘డాడీ’ చిత్రానికి సురేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. 2001 అక్టోబర్ 4న ‘డాడీ’ జనం ముందు నిలచింది.
‘డాడీ’ కథ విషయానికి వస్తే – ఇందులో కథానాయకుడు రాజ్ ఓ ఆడియో కంపెనీ ఓనర్. అలాగే ఆయనకు ఓ మోడరన్ డాన్స్ స్కూల్ కూడా ఉంటుంది. అందరికీ సాయం అందించాలనే తపన ఉన్న మనిషి. మిత్రులంటే ప్రాణం. శాంతిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. వారికి అక్షయ అనే అమ్మాయి పుడుతుంది. ఓ సారి తన మిత్రునికి సాక్షి సంతకం పెట్టడంతో అతను మోసం చేస్తే, రాజ్ డబ్బు కట్టాల్సి వస్తుంది. అదే సమయంలో బిడ్డకు ప్రమాదం జరుగుతుంది. ఆ పాపను ఆసుపత్రిలో చేరుస్తారు. డబ్బు అవసరమవుతుంది. ఫ్రెండ్స్ ఆదుకోరు. తన బ్యాంకులో ఉన్న సొమ్ము తీసుకువస్తూండగా, తన డాన్స్ స్కూల్ స్టూడెంట్ కు ఆక్సిడెంట్ జరుగుతుంది. అతణ్ణి ఆదుకోవడానికి డబ్బు కడతాడు. కన్నకూతురుకు డబ్బు కట్టడానికి కుదరదు. దాంతో పాప ప్రాణం పోతుంది. అందువల్ల శాంతి, భర్తను వదలి పోతుంది. అప్పటికే ఆమె గర్భవతి. రెండో కూతురు కూడా అచ్చు అవే పోలికలతో పుడుతుంది. ఆరేళ్ళ తరువాత ఆ పాపను రాజ్ చూడటం జరుగుతుంది. శాంతితో ఆ పాపను చూడగానే తన కూతురే అని తెలుస్తుంది. ఈ రెండో పాప పేరు ఐశ్వర్య. ఆమెకు దగ్గర కావడానికి రాజ్ తపిస్తాడు. అందుకు అతని దగ్గర ఉన్నవారు సహకరిస్తారు. రాజ్ ను ఐశ్వర్య ‘ఫ్రెండ్’ అని పిలుస్తూ ఉంటుంది. ఐశ్వర్యకు కూడా స్కూల్ లో ఓ ప్రమాదం సంభవిస్తుంది. ఆసుపత్రిలో చేరుస్తారు. అది రాజ్ తన కూతురు ‘అక్షయ’ పేరుతో నెలకొల్పిన హాస్పిటల్. రాజ్ అక్షయను ఎంతగా ప్రేమించాడో ప్రసాద్ అనే మిత్రుడు శాంతికి వివరించి చెబుతాడు. దాంతో ఆమె పశ్చాత్తాపం చెందుతుంది. చివరకు పాప కోలుకోవడం, రాజ్, శాంతి ఒకటవ్వడంతో కథ ముగుస్తుంది.
కథలో మంచి పట్టు ఉంది. చైల్డ్ సెంటిమెంట్ కూడా ఆకట్టుకొనేలా తెరకెక్కించారు దర్శకుడు సురేశ్ కృష్ణ. భూపతిరాజా రాసిన ఈ కథకు సత్యానంద్ సంభాషణలు సమకూర్చారు. ఎస్.ఏ. రాజ్ కుమార్ బాణీలకు సిరివెన్నెల, భువనచంద్ర, చంద్రబోస్, శ్రీనివాస్ పాటలు రాశారు. “మందార బుగ్గల్లోకి…” అంటూ సాగే పాటను రాసిన శ్రీనివాస్ కు ఇదే తొలి పాట కావడం విశేషం. తరువాత అతను ‘డాడీ’ శ్రీనివాస్ పేరుతో కొన్ని చిత్రాలకు పాటలు రాశారు. “ఆడు ఆడించు…”, “వానా వానా వెన్నెల వానా…”, “గుమ్మాడీ గుమ్మాడీ ఆడిందంటే…”, “నా ప్రాణమా…”, “దూరంగా పోకే…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో రాజ్ గా చిరంజీవి, శాంతిగా సిమ్రాన్ నటించారు. అక్షయ, ఐశ్వర్య పాత్రల్లో చిన్నారి అనుష్క మల్‌హోత్ర అభినయం ఆకట్టుకుంది. ఆషీమా భల్లా, రాజేంద్రప్రసాద్, శరత్ బాబు, కోట శ్రీనివాసరావు, అల్లు అర్జున్, అచ్యుత్, ఎమ్.ఎస్.నారాయణ, ఉత్తేజ్ ఇతర పాత్రల్లో కనిపించారు.
‘డాడీ’ చిత్రం విడుదలయిన రోజునే మంచి టాక్ సంపాదించింది. ఆ యేడాది జనవరిలో సంక్రాంతి కానుకగా వచ్చిన చిరంజీవి ‘మృగరాజు’ ఘోరపరాజయం చవిచూసింది. దాంతో గుడ్ టాక్ సంపాదించిన ‘డాడీ’ని అభిమానులు విపరీతంగా చూశారు. 97 కేంద్రాలలో ఈ సినిమా అర్ధశతదినోత్సవం జరుపుకుంది. అయితే తరువాత నుంచీ బాగా డౌన్ అయింది. దాంతో కేవలం 15 కేంద్రాలలోనే వంద రోజులు చూసింది. ఈ సినిమా అభిమానులను నిరాశ పరచినా, నటునిగా చిరంజీవికి మంచి మార్కులే సంపాదించి పెట్టింది. ఆ రోజుల్లో టాప్ హీరోయిన్ గా సాగిన సిమ్రాన్ అందం ఇందులోనూ పులకింప చేసింది. ఆర్ట్ డైరెక్టర్ కె.అశోక్ కు ఈ సినిమా ద్వారా ఉత్తమ కళాదర్శకునిగా నంది అవార్డు లభించింది.