(సెప్టెంబర్ 23న ‘దూకుడు’కు పదేళ్ళు)
పది సంవత్సరాల క్రితం మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘దూకుడు’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విదేశాలలోనూ విజయదుందుభి మోగించింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మహదానందం పంచింది. ఈ చిత్రంతో మహేశ్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి కలసి పనిచేశారు. ఈ సినిమాలోనే మహేశ్ తో సమంత మొదటి సారి జోడీ కట్టి అలరించింది. ఇలా పలు విశేషాలకు వేదికగా నిలచింది ‘దూకుడు’. ఈ చిత్రానికి ముందు మహేశ్ బాబు బ్లాక్ బస్టర్ ‘పోకిరి’ 2006లో పలు రికార్డులు నెలకొల్పింది. ప్లాటినమ్ జూబ్లీ జరుపుకుంది. దాంతో మహేశ్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ తరువాత మహేశ్ నటించిన “సైనికుడు, అతిథి” ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. మహేశ్ మళ్ళీ బిగ్ స్క్రీన్ పై కనిపించడానికి రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నారు. 2008, 2009లో మహేశ్ హీరోగా నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. ఆ సమయంలో ఆయన యాడ్స్ లో బిజీగా ఉన్నారు. అభిమానులు మాత్రం తమ హీరో సినిమాల్లో అలరించాలని ఆశించారు. 2010లో మహేశ్ హీరోగా వచ్చిన ‘ఖలేజా’ అభిమానులకు నిరాశ కలిగించింది. అంటే ‘పోకిరి’ తరువాత మహేశ్ నటించిన మూడు చిత్రాలూ ఫ్యాన్స్ ను నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో 2011 సెప్టెంబర్ 23న విడుదలయిన ‘దూకుడు’ బాక్సాఫీస్ వద్ద కూడా దూసుకు పోయింది.
‘దూకుడు’ కథ విషయానికి వస్తే- యన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శంకర్ నారాయణ్ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటాడు. పేదవారి కోసం పాటుపడే నాయకుడు శంకర్. అందరూ అభిమానంగా శంకరన్న అంటూ పిలుస్తుంటారు. నమ్మినవారే ఓ పథకం ప్రకారం శంకర్ ను అంతం చేయాలని చూస్తారు. అయితే అతను దుండగుల దాడిలో తలకు గాయమై కోమాలో ఉంటాడు. ఆ దాడిలో అతని తమ్ముడు మరణించి ఉంటాడు. అతని కుటుంబ సభ్యులు శంకర్ నారాయణ్ కు రహస్యంగా చికిత్స చేయిస్తూ ఉంటారు. శంకర్ నారాయణ కొడుకు అజయ్ పోలీసాఫీసర్ అవుతాడు. అతను కూడా దుండగులను ఏరేస్తూ ఉంటాడు. అజయ్ తన పై అధికారి కూతురును ప్రేమిస్తాడు. అనుకోకుండా శంకర్ నారాయణకు స్పృహ వస్తుంది. అతను మళ్ళీ కోమాలోకి వెళ్ళకుండా ఉండాలంటే అతనికి షాక్ కలిగించే విషయాలేవీ చెప్పవద్దని డాక్టర్లు చెబుతారు. దాంతో అజయ్, అతని మిత్రులు కలసి నాటకం ఆడతారు. అందులో యన్టీఆర్ ప్రధాన మంత్రి అయ్యారనీ చెప్పిస్తారు. శంకర్ నారాయణను చంపాలనుకున్నవారిని అజయ్ తన తెలివితేటలతో మట్టు పెడుతూ ఉంటాడు. ఓ రోజు పేపర్ లో తన తమ్ముడి వర్ధంతి యాడ్ ను చూస్తాడు శంకర్ నారాయణ. తరువాత అజయ్ తండ్రికి ఏం జరిగిందో చెబుతాడు. అసలు విషయం తెలుసుకున్న శంకర్ నారాయణ తనపై కొడుకుకు గల ప్రేమకు కరిగిపోతాడు. దాంతో కథ సుఖాంతమవుతుంది.
‘దూకుడు’ చిత్రానికి 2003లో విడుదలైన జర్మన్ మూవీ ‘గుడ్ బై, లెనిన్’ ఆధారం. అందులో భర్త వెస్ట్ జర్మనీకి వెళ్ళగా, ఈస్ట్ జర్మనీలోనే తన పిల్లలతో ఉంటూ క్రిస్టెనా అనే తల్లి సోషలిస్ట్ యూనిటీ పార్టీ ప్రచారంలో పాలు పంచుకుంటూ ఉంటుంది. ఆమె తనయుడు అలెక్స్ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాడు. అతణ్ణి అరెస్ట్ చేస్తారు. అరెస్టయిన తనయుణ్ణి చూసి ఆ తల్లి తట్టుకోలేదు. గుండెపోటుకు గురై కోమాలోకి పోతుంది. ఆమె కోమాలో ఉండగా బెర్లిన్ గోడ కూలిపోయి, ఈస్ట్, వెస్ట్ జర్మనీలు కలసి పోతాయి. కొన్నాళ్ళకు కోమానుండి అలెక్స్ తల్లి కోలుకుంటుంది. ఆమెకు షాక్ కలిగించే విషయాలు చెబితే చాలా ప్రమాదం అని చెబుతారు డాక్టర్లు. దాంతో ఆమె సంతోషం కోసం అలెక్స్ ఈస్ట్ జర్మనీ అంతకు ముందుఎలా ఉందో అలా చూపించడానికి పలు పాట్లు పడతాడు. ఇవన్నీ తమాషాగా ఉంటాయి. వెస్ట్ కు వెళ్ళిన అలెక్స్ తండ్రి అక్కడ మరో ఆవిడను పెళ్ళాడి ఉంటాడు. అలెక్స్ తండ్రిని కలసి, తల్లిని చూడటానికి రమ్మంటాడు. వారు వచ్చే లోగా కూతురు ద్వారా జర్మనీ రాజకీయ పరిణామాలు తెలుసుకున్న క్రిస్టెనా కన్నుమూస్తుంది. ఆమె దహన సంస్కారలయ్యాక బూడిదను టాయ్ రాకెట్ ద్వారా గాల్లో కలుపుతారు. చిన్నప్పుడు అలెక్స్, అతని తండ్రి కలసి ఆ టాయ్ రాకెట్ ను తయారు చేసి ఉంటారు. ఈ కథ విచారంతో ముగుస్తుంది. దీనికి మెరుగులు దిద్ది ‘దూకుడు’ను సుఖాంతం చేశారు మనవాళ్ళు.
ఇందులో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, సోనూ సూద్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, నాజర్, సుమన్, సయాజీ షిండే, ప్రగతి, షఫీ, వెన్నెల కిశోర్, నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటించారు. “పువ్వాయ్ పువ్వాయ్…” పాటలో పార్వతీ మెల్టన్, “నీ దూకుడు…” సాంగ్ లో మీనాక్షి దీక్షిత్ ఐటమ్ గాళ్స్ గా అలరించారు.
ఈ చిత్రానికి కోన వెంకట్, గోపీ మోహన్ తో కలసి శ్రీను వైట్ల రచన చేశారు. ఇందులోని కామెడీ సీన్స్ జనాన్ని భలేగా కట్టి పడేశాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు. ఇందులోని “నీ దూకుడు…” పాటను విశ్వ రాయగా, “ఇటు రాయె… ఇటు రాయె…” పాటను భాస్కరభట్ల పలికించారు. మిగిలిన నాలుగు పాటలను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ గానే కాదు, మ్యూజికల్ హిట్ గానూ నిలచి అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ’14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్’ పతాకంపై నిర్మించారు. నిర్మాతలకు ‘దూకుడు’ భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
‘దూకుడు’ సినిమా యాభైకి పైగా కేంద్రాలలో శతదినోత్సవాలు చూసింది. విదేశాలలోనూ రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా తరువాత నుంచీ అబ్రాడ్ లో మహేశ్ సినిమాలకు ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రం అనేక కేంద్రాలలో ఆరు గంటల ఆటతోనే ఆరంభమై మహేశ్ బాబు కెరీర్ లో ఓ స్పెషల్ గా నిలచింది. అంతకు ముందు ‘మగధీర’, ‘సింహా’ నెలకొల్పిన ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఈ సినిమా అధిగమించింది. ఆ రోజుల్లో 57 కోట్ల రూపాయలు వసూలు చేసిన చిత్రంగా ‘దూకుడు’ నిలచింది. ఈ చిత్రం బెంగాలీలో ‘ఛాలెంజ్-2’గానూ, కన్నడలో ‘పవర్’గానూ రీమేక్ అయి అక్కడివారినీ అలరించింది. ఈ చిత్రం అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఏడు నంది అవార్డులనూ అందుకోవడం విశేషం. ఉత్తమ వినోదభరిత చిత్రంగా నందిని అందుకుంది. ఈ సినిమాద్వారా మహేశ్ బాబు ఉత్తమ నటునిగా నందిని సొంతం చేసుకున్నారు. ఉత్తమ సహాయనటునిగా ప్రకాశ్ రాజ్, ఉత్తమ హాస్యనటునిగా ఎమ్మెస్ నారాయణ, ఉత్తమ ఎడిటర్ గా ఎమ్.ఆర్.వర్మ, ఉత్తమ ఫైట్ మాస్టర్ గా విజయన్, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా శ్రీను వైట్ల కూడా నంది అవార్డులు దక్కించుకున్నారు.
ఇప్పటికీ బుల్లితెరపై ‘దూకుడు’ కనిపిస్తే చాలు జనం ఆసక్తిగాచూస్తూ ఉంటారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి 9 గంటలకు హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.లో స్పెషల్ షో ప్రదర్శించనున్నారు.