ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు శపథం చేసి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ప్రెస్‌మీట్‌లో కంటతడి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. రెండున్నరేళ్లుగా అన్ని విధాలా అవమానిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. నేను ప్రజల కోసమే పోరాటం చేశా. ఓడిపోయినపుడు కుంగిపోలేదు…గెలిచినపుడు రెచ్చిపోలేదు. ప్రతిపక్ష నేతలను నేనెప్పుడూ అగౌరవపరచలేదన్నారు చంద్రబాబు. తాను సీఎంగానే మళ్ళీ అడుగుపెడతానని శపథం చేశారు చంద్రబాబు. మరి ఏపీ రాజకీయాలు భవిష్యత్తులో ఎలా మారతాయో చూడాలి.
ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైంది మొదలు టీడీపీతో పాటు పార్టీ అధినేతపై దూషణల పర్వానికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమయం వెచ్చిస్తున్నారు. ఒకవైపు మంత్రి కొడాలి నాని.. చంద్రబాబును ‘లుచ్ఛా’ అంటూ నోటికి పని చెప్పారు. మరోవైపు మంత్రి కన్నబాబు, ఇతర ఎమ్మెల్యేలు తమదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును పదే పదే అవమానపరుస్తూ మాట్లాడటమే కాకుండా ఆయన కుటుంబంలోని మహిళలపై సైతం నోరు పారేసుకున్నారు. ఆయన భార్యతో పాటు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన చంద్రబాబు కంటతడి పెట్టారు. అనంతరం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అదే అవమానం జరిగింది. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుకు అదే పరిస్థితి వచ్చింది. చరిత్ర రిపీట్ అవుతుందని ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అనిపించకమానదు. గతంలో వైఎస్సార్సీపీ పలుమార్లు ఏపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.
స్పీకర్ తీరుపై వైఎస్ జగన్ తన పార్టీ నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేసేవారు. బడ్జెట్‌పై మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయటం వంటి ఘటనలు జరిగాయి. సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం లేని సభ తనకు అవసరం లేదంటూ… 2015, మార్చి 19న వైఎస్ జగన్ అసెంబ్లీని బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పాదయాత్ర చేపట్టి.. ప్రజాదరణ పొంది 30మే 2019గా ప్రమాణం స్వీకారం చేసి 175కి గానూ 151 గెలిచి సీఎంగా అడుగుపెట్టారు.