నేడు చెన్నైకు ఏపీ సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ( మార్చ్ 28) చెన్నై వెళ్లనున్నారు. అడయార్‌లోని ‘మద్రాస్ ఐఐటీ’లో ఉదయం 11 గంటలకు జరుగనున్న ‘ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025’లో పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది. ఈ పర్యటన కోసం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10.30 గంటలకు వెళ్లబోతున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు రెడీ అవుతున్నారు. కాగా, మీనంబాక్కంలోని ఓల్డ్ ఎయిర్ పోర్టులో 6వ నెంబరు గేట్ నుంచి చంద్రబాబు బయటకు వస్తారు. అయితే, ఇదిలా ఉండగా నాలుగోసారి సీఎం అయ్యాక తొలిసారి చెన్నై వస్తున్న చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులంతా తరలి రావాలని చెన్నై తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు మద్రాస్ ఐఐటీ నుంచి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి విజయవాడ బయలుదేరి రానున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం తప్పిదం వల్లే ప్రజా సమస్యలు ఏర్పడ్డాయి..
అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలం బోరెడ్డిగారి పల్లెలో తన నివాసం దగ్గర రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా దర్బార్ కు స్థానిక ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఇక, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు మంత్రి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం.. గత వైసీపీ ప్రభుత్వం తప్పిదం వల్లే ప్రజా సమస్యలు ఏర్పడ్డాయి.. రాబోయే రోజులలో గ్రామాలను సమస్యల రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతాం.. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు. ఇక, రాష్ట్ర ప్రజల సమస్యలను త్వరలోనే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి.. తానూ ఆత్మహత్యాయత్నం..
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. తల్లి ముగ్గురు చిన్నారులను అన్నంలో విషం కలిపి తినిపించింది. తాను ఆహారం ద్వారా విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు చిన్నారులు పిల్లలు సాయి కృష్ణ (12), మధుప్రియా (10), గౌతమ్ (8) మృతిచెందారు. తల్లి రజిత తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రజిత భర్త రాత్రి డ్యూటీకి వెళ్లగా, ఉదయం ఇంటికి వచ్చి ఈ భయంకర దృశ్యాన్ని చూశాడు. స్థానికుల సహాయంతో వెంటనే బీరంగూడ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పిల్లల్ని చంపడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఎలాంటి కుటుంబ కలహాలు ఉన్నాయా, లేదా ఆర్థిక సమస్యలున్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
ఆర్థిక సమస్యలతో 14 రోజుల పసికందుని చంపేసిన తల్లి..
నవ మాసాలు మోసి కన్న బిడ్డను తన చేతులతో కడతేర్చింది. మైలార్ దేవ్ పల్లి ఆలీ నగర్ లో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 15 రోజుల పసికందుని తల్లి చంపేసింది. పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా క్రియేట్ చేసింది. స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని నాటకమాడింది. 14 రోజుల పసికందుని తల్లి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆర్థిక సమస్యలతోనే పసికందుని చంపినట్లుగా గుర్తించారు. భర్తకు రెండు కిడ్నీలు చెడిపోవడం, కుటుంబ పోషణ భారంగా మారడంతో పసికందు హత్య చేసింది. ఈ మనీ, విజ్జు దంపతులు తమిళనాడుకు చెందిన వాళ్లు. పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చారు. ఆమె కాటేదాన్ లోని ఓ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తోంది. భర్తకు చికిత్స చేయించ లేక, కుటుంబం పోషించ లేక తల్లడిల్లింది భార్య విజ్జి. భర్త మణికి డయాలిసీస్ చేసుకోవడం, అప్పుడే పండండి బిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఏమి చేయాలో తోచక కన్న పేగును హతమార్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
అమెరికాతో పాత సంబంధం ముగిసింది.. తేల్చిచెప్పిన కెనడా ప్రధాని
అమెరికాతో పాత సంబంధం ముగిసిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. కెనడాపై అమెరికా అధిక సుంకాలను విధించిన నేపథ్యంలో కార్నీ ఈ విధంగా స్పందించారు. అమెరికాతో ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాలు మొత్తం ముగిసినట్లుగా పేర్కొన్నారు. వాహనాల దిగుమతులపై అమెరికా విధించిన 25 శాతం సుంకం వచ్చే వారం నుంచి అమల్లోకి రానుంది. వాహనాలపై అమెరికా సుంకాలు విధించడం అన్యాయం అని కార్నీ ధ్వజమెత్తారు. అమెరికా తీరు కారణంగా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయన్నారు. కెనడాపై అమెరికా అధిక స్థాయిలో సుంకాలను విధించింది. అంతేకాకుండా కెనడాను అమెరికాలో ఒక రాష్ట్రంగా చేస్తానంటూ ట్రంప్ ప్రకటించడంతో మార్క్ కార్నీ.. ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఏప్రిల్ 28న కెనడాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. బలమైన ప్రభుత్వంతో అమెరికాను ఎదుర్కొంటామని ఇటీవల మార్క్ కార్నీ పేర్కొన్నారు.
ఆస్పత్రిలో చేరి కింగ్ చార్లెస్.. కేన్సర్‌తో బాధపడుతున్న యూకే రాజు
యునైటెడ్ కింగ్‌డమ్ రాజు చార్లెస్ (76) ఆస్పత్రిలో చేరారు. కేన్సర్ చికిత్సలో భాగంగా ఆస్పత్రిలో చేరినట్లుగా బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం ప్రకటించింది. కేన్సర్ చికిత్స కారణంగా ఏర్పడిన దుష్పరిణామాల నేపథ్యంలో ఆస్పత్రిలో చేరినట్లుగా పేర్కొంది. ప్రస్తుతం లండన్ ఆస్పత్రిలో వైద్యులు చార్లెస్‌కు వైద్యం అందిస్తున్నారు. చార్లెస్‌ను వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లుగా డాక్టర్లు తెలిపారు. ఇదిలా ఉంటే కింగ్ చార్లెస్ ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. 2024, ఫిబ్రవరిలో కింగ్ చార్లెస్‌కు కేన్సర్ నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆ మధ్య బెంగళూరు కూడా వచ్చి చికిత్స తీసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. చార్లెస్ త్వరగా కోలుకుని ప్రజా విధుల్లో పాల్గొనాలని బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది. ఇదిలా ఉంటే చార్లెస్ ఏ విధమైన కేన్సర్‌తో బాధపడుతున్నారో మాత్రం ప్యాలెస్ పేర్కొనలేదు.
రాబిన్ హుడ్ ఓవర్సీస్ ప్రీమియర్ టాక్
నితిన్ రాబిన్ హీరోగా నటించితిన లేటెస్ట్ సినిమా రాబిన్ హుడ్. వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న ఈ యంగ్ హీరో గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములను నమ్ముకున్నాడు. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదలయింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ నుండి వస్తున్న టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం రండి. రాబిన్ హుడ్ ఫస్ట్ హాఫ్ కొంత వరకు ఒకే. కొత్తదనం ఏమీ లేకుండా రొటీన్ కమర్షియల్ టెంప్లేట్‌ను ఫాలో అవుతూ కథ నడిపాడు. కామెడీ కొన్ని చోట్ల క్లిక్ బాగా వర్కౌట్ అయింది. కానీ సినిమా ఫ్లో కాస్త గందరగోళంగాఉందని అలాగే ఇంటర్వెల్ ఫైట్ స్టైలిష్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇక సెకండ్ హాఫ్ ఆకట్టుకుంది. శ్రీలీల రోల్ కాస్త ఇరిటేట్ చేసింది. ఇక వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ ఎప్పటిలాగే తమదైన శైలిలో నవ్వించారు. కథలో మరికాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. ఎంతో హైప్ ఇచ్చిన డేవిడ్ వార్నర్ చివరి ఐదు నిముషాలు మాత్రమే కనిపించి సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చాడు. సంగీతం ఈ సినిమాకు బాగా మైనస్ ఒక్క పాట కూడా గుర్తుండవు. మొత్తానికి రాబిన్ ఓకేయిష్ సినిమాగా నిలుస్తుందని ఓవర్సీస్ నుండి వస్తున్న టాక్.
మ్యాడ్ స్క్వేర్ ఓవర్శీస్ ప్రీమియర్ టాక్
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం 2023లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది మ్యాడ్. గతేడాది ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ని తీసుకువచ్చారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ హిట్ కావడం, ట్రైలర్, సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో ఆడియెన్స్ లో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఓవర్సీస్ ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం. మేకర్స్ ముందునుండి చెప్తున్నట్టు ఈ సినిమాలో కథ అని ఏమి ఉండదు. ఉండేదల్లా నాలుగు కామెడీ సీన్స్, నాలుగు పాటలు, చిన్న చిన్న పంచ్ లు. ఇవే మ్యాడ్ సినిమాను సూపర్ హాట్ కావడానికి దోహదం చేసాయి. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ లోను అంటె కథ ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే లడ్డు పెళ్లి ఎపిసోడ్ హిలేరియస్ గా సాగింది. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ కామెడీ నవ్వించింది. కానీ సెకండ్ హాఫ్ లో ఆ కామెడీ కాస్త నెమ్మదించడంతో పాటు ఫోర్స్డ్ గా అనిపించింది. స్వాతి రెడ్డి సాంగ్ మాస్ అదనపు ఆకర్షణ. లీడ్ క్యారెక్టర్స్ తమ తమ పరిధిలో మెప్పించారు. మొత్తానికి మ్యాడ్ స్క్వేర్ ఒక సరదాగా కాసేపు నవ్వుకునే సినిమా అని ఓవర్సీస్ నుండి వినిపిస్తున్న టాక్.
చెన్నైతో బెంగళూరు ఢీ.. 17 ఏళ్ల నుంచి ఆర్సీబీకి విజయమే లేదు!
ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. 18వ సీజన్‌ను చెన్నై, ఆర్సీబీలు విజయాలతో ఆరంభించాయి. కోల్‌కతాపై బెంగళూరు, ముంబైపై చెన్నై గెలిచాయి. అదే జోరు కొనసాగించాలని రెండు జట్లూ చూస్తున్నాయి. అయితే చెన్నై కోటను బెంగళూరు బద్దలు కొట్టేనా? అనే అనుమానం అందరిలో నెలకొంది. ఇందుకు కారణం చెపాక్ గణాంకాలే. ఐపీఎల్ మొదలై 18 ఏళ్లు అవుతోంది. గత 17 ఏళ్ల నుంచి చెన్నైలో బెంగళూరు గెలవలేదు. ఐపీఎల్ తొలి సీజన్ 2008లో చివరిగా చెపాక్‌లో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. 2009 నుంచి చెపాక్‌లో ఆడిన బెంగళూరుకు నిరాశే మిగులుతోంది. 2008-24 మధ్య చెపాక్‌లో చెన్నై, బెంగళూరు మధ్య 9 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో చెన్నై 8సార్లు, ఆర్సీబీ ఒక మ్యాచ్ గెలిచింది. అలానే ఓవరాల్‌గా కూడా ఆర్సీబీపై సీఎస్కేకు మంచి రికార్డే ఉంది. ఇరు జట్ల మధ్య 33 మ్యాచ్‌లు జరగగా చెన్నై 21 మ్యాచ్‌లలో గెలిచింది. ఈ రికార్డ్స్ చెన్నైకి అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ సీజన్‌లో అయినా చెన్నై కోటను బెంగళూరు బద్దలు కొడుతుందో లేదో చూడాలి.