మహిళా జెడ్పీ చైర్పర్సన్పై హత్యాయత్నానికి ప్రయత్నించిన వారే సైకోలు..
కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ- వైసీపీ పోటా పోటీ సభలు పెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పేర్నినాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం.. వినలేని విధంగా జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పల హారికను పచ్చి బూతులు తిట్టారని పేర్కొన్నారు. హారికకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కారు దిగమని ఒత్తిడి చేశారు.. కారు నుంచి కిందకు దింపి చంపేయాలి అనుకున్నారా అని ప్రశ్నించారు. గుడివాడలో పోలీసులు ఘోరంగా పని చేస్తున్నారు.. పోలీసులు అంటే ధైర్యం ఇవ్వాలి కానీ చంపేయడానికి రౌడీ మూకలకు అండగా ఉంటె ఎవరికి చెప్పుకోవాలని పేర్నినాని అడిగారు. అయితే, ఆడవాళ్ళ మీద దాడి చేయడం అంటే సైకో పరిపాలన కాదా అని మాజీమంత్రి పేర్నినాని క్వశ్చన్ చేశారు. ఉప్పల హారిక మీద దాడి చేసి, గాయపర్చిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పల హారికను హత్యాయత్నం చేసి తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ఆమె కారుపై దాడి జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఇక, కొడాలి నాని చెక్ అప్ షెడ్యూల్ ఉంది అందుకే పోలీస్ స్టేషన్ లో సంతకం చేసి హైదరాబాద్ కు వెళ్లారు.. కే కన్వెన్షన్ లో జరిగే మీటింగ్ కు నాతో సహా స్థానిక ఇంచార్జీలు అంత గుడివాడ వెళ్ళాల్సి ఉండగా.. లా అండ్ ఆర్డర్ పరిస్థితులు సరిగ్గా లేవని పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారని పేర్నినాని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు మాటలు నమ్మి వైసీపీ కార్యకర్తలు కూడా కూటమికి ఓట్లేశారు..
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. కూటమి ఏడాది పాలన సుపరిపాలన కాదు.. మోసపు పరిపాలన అని మేం అంటున్నాం.. ఇచ్చిన హామీలు మొత్తం ఒక్క సంవత్సరంలో పూర్తి చేస్తే శబాష్ అని అనే వాళ్ళం.. తల్లికి వందనం ఎప్పుడు ఇచ్చారు.. సంవత్సరం గడిచాక ఇచ్చారని ఆరోపించారు. జగన్ ఒక్కరికే ఇచ్చారని అన్నారు.. మీరు ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తాం అన్నారు.. మొదటి సంవత్సరం ఇవ్వలేదు.. రెండో సంవత్సరం ఇచ్చారు.. కొంత మంది ఖాతాల్లో మాత్రమే డబ్బులు పడ్డాయి.. ఒక పిల్లవాడికి రూ. 13 వేలు.. మరో పిల్ల వాడికి రూ. 10 మూడో వాడికి రూ. 5 వేలు మాత్రమే పడ్డాయి.. అలాగే, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు.. ఒక్కటే ఇచ్చారు.. ఇంతటితో సూపర్ సిక్స్ అయిపోయిందన్నారని అంబాటి రాంబాబు తెలిపారు. అయితే, తల్లికి వందనం ఆలోచన లోకేష్ కి పుట్టిందన్నాడు చంద్రబాబు.. పప్పు లోకేష్ కి ఎలా వచ్చింది ఈ ఆలోచన.. ఇది జగన్ పెట్టిన అమ్మ ఒడి కార్యక్రమం.. మీరు కాపీ కొట్టారు అని అంబాటి రాంబాబు ఆరోపించారు. ఇంకా నయం ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్య శ్రీ కూడా నేనే పెట్టానని చంద్రబాబు అంటాడేమో.. 14 ఏళ్ళు సీఎంగా పని చేసిన చంద్రబాబు అమ్మ వడి లాంటి పథకాలు ఎందుకు పెట్టలేదు..? అని ప్రశ్నించారు. 2014లో రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.. దీంతో చంద్రబాబు మాటలు నమ్మి వైసీపీ కార్యకర్తలు కూడా ఓట్లు వేస్తే.. అందరిని ముంచాడని ఎద్దేవా చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్..
ఫీజు రియంబర్స్ మెంట్ కోసం 600 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేశామని ఉన్నత విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మొదటి విడతగా ఫీజు రియంబర్స్ మెంట్ కు సుమారు రూ. 788 కోట్లు చెల్లించామని సర్కార్ పేర్కొన్నారు. త్వరలో మరో రూ. 400 కోట్లు విడుదల చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఇక, దశల వారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దని వెల్లడించింది. విద్యార్థులను ఇబ్బంది పెడితే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అందుకే రేవంత్‌రెడ్డికి సీఎం పదవి ఇచ్చారు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు..
కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా రేవంత్‌రెడ్డిని ప్రకటించినప్పుడు తాము తీసుకున్న నిర్ణయాలను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు( Podcast With NTV Telugu)లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మంత్రి వివరణ ఆయన మాటల్లోనే.. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు మేము అందరం నడుస్తాం. ఆ క్రమంలో ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం పార్టీ పక్ష నేతగా రేవంత్‌రెడ్డిని నిర్ణయించినప్పుడు అందరం కలిసి పని చేయాలని ఆ నాయకుడికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ఆలోచించాం. అందరం కలిసి ముందుకు వెళ్తున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి మంచి నాయకుడు. ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపనతో ఉన్నాడు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి తరువాత మరొకటి పూరించే కార్యక్రమంతో పాటు తెలంగాణాను అభివృద్ధి చేయాలని.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యం ఉంది.
మందు బాబులకు అలర్ట్.. రెండ్రోజుల పాటు వైన్స్ బంద్
ఆశాడ మాసం ప్రారంభం అయితే చాలు తెలంగాణలో బోనాల పండగ సందడి అంతా ఇంతా కాదు. పల్లె పట్నం అనే తేడా లేకుండా బోనాల సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇక హైదరాబాద్ లో ఉజ్జయిని, గోల్కోండ, లష్కర్ బోనాల పండగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా రెండ్రోజుల పాటు వైన్ షాపులు మూతపడనన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వైన్స్ షాపులు మూసి వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు సెంట్రల్ ఈస్ట్, నార్త్, హైదరాబాద్ లోని మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మద్యం దుకాణాలు క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఎయిర్ ఇండియా ప్రమాదం.. “సెకన్ టూ సెకన్” ఏం జరిగిందంటే..?
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, భారతదేశ వైమానిక రంగంలోనే అత్యంత దారుణమైన దుర్ఘటనగా మిగిలిపోయింది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లే బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే కుప్పకూలింది. విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు నేలపై ఉన్న పలువురితో కలిపి 270 మంది వరకు మరణించారు. అయితే, దీనిపై తాజాగా ప్రభుత్వం ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల తప్పిదంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
సైనిక ప్రభుత్వం దిశగా పాకిస్తాన్, షహబాజ్ షరీఫ్‌కు ఆసిమ్ మునీర్ చెక్..
పాకిస్తాన్‌లో రాజకీయ అస్థిరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ యాక్టివ్‌గా మారారు. పౌర ప్రభుత్వాన్ని కాదని ఆయనే అన్ని దేశాల పర్యటకు వెళ్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అసలు నిజమైన పాలకుడా..? కాదా..? అనే సందేహాలు వస్తున్నాయి. ఇటీవల, షరీఫ్‌ని పక్కన పెట్టేందుకు మునీర్ ప్రయత్నిస్తు్న్నాడనే వాదనలు కూడా ఊపందుకున్నాయి. ఇదే జరిగితే, మరోసారి పాకిస్తాన్ సైనిక ప్రభుత్వ కిందకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణించబడుతున్నారు. సాధారణంగా ఇతర దేశాలతో సంబంధాల విషయంలో ప్రధాని నేతృత్వంలోని బృందం చర్చల్ని నిర్వహిస్తుంది. కానీ, పాకిస్తాన్‌లో మాత్రం ఆసిమ్ మునీర్ పలు దేశాల పర్యటనలకు వెళ్లడం, ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించడం జరుగుతోంది.
చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట కేసు.. తాజా నివేదికలో సంచలన విషయాలు..
బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట కేసులో జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. విక్టరీ పరేడ్ తొక్కిసలాటకు కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంని కమిషన్ నిర్ధారించింది. తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అస్సోసియేషన్(KSCA), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని నివేదికలో వెల్లడించింది. నివేదికను సీఎం సిద్దరామయ్యకు అందించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం జూన్ నాలుగవ తేదీన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. వేల మంది అభిమానులు గేటు బద్దలు కొట్టి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది.
దారుణంగా మోసపోయిన అనసూయ.. పోస్టు వైరల్
హాట్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనసూయ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తాను దారుణంగా మోసపోయానని చెప్పింది అనసూయ. ఇప్పుడు అంతా ఆన్ లైన్ షాపింగ్స్ అని తెలిసిందే. ఏదైనా సరే ముందే డబ్బులు చెల్లించి వస్తువు కోసం వెయిట్ చేస్తే.. చివరకు అది రావట్లేదు. ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. తాజాగా అనసూయకు కూడా ఇలాంటిదే ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. నెల క్రితం ట్రఫుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్‌సైట్‌లో కొన్ని దుస్తుల్ని ఆర్డర్ పెట్టిందంట. ముందే పే మెంట్ చేసేశానని.. నెల రోజులు అవుతున్నా సరే డ్రెస్సులు మాత్రం రాలేదని తెలిపింది. చివరకు రీ ఫండ్ కూడా రాలేదని.. ఇలాంటి వాటి వల్ల ఎంతో మంది మోసపోతున్నారంటూ తెలిపింది. ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. రీసెంట్ గానే కొత్త విల్లాలోకి అడుగు పెట్టిన అనసూయ.. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. పుష్ప సినిమాతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దాంతో వరుసగా పెద్ద మూవీల్లో ఆఫర్లు వస్తున్నాయి ఈ భామకు. ఇక అనసూయ ట్రెండీ వేర్స్ డ్రెస్సులు వేస్తూ నిత్యం హాట్ హాట్ ఫొటోషూట్లు కూడా చేస్తోంది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ.
రజినీపై ఆర్జీవీ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన సూపర్ స్టార్..
సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరిపై అయినా కామెంట్ ఈజీగా చేసేయడంలో ఆయన తర్వాత ఎవరైనా. అవి కాంట్రవర్సీ అయినా ఆయన పట్టించుకోడు. రీసెంట్ గా ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజినీకాంత్ మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు. రజినీకాంత్ స్లో మోషన్ వాకింగ్ లేకుండా హీరోగా కొనసాగలేడు అన్నాడు. దానికి తాజాగా రజినీకాంత్ కౌంటర్ ఇచ్చారు. ‘వేల్పరి’ అనే బుక్ తమిళనాట బాగా పాపులర్ అయింది. ఈ బుక్ రాసిన రచయితకు అభినందన సభ ఏర్పాటు చేయగా.. దానికి డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథులుగా వచ్చారు. ఇందులో రజినీకాంత్ మాట్లాడుతూ తన మీద తానే సెటైర్లు వేసుకున్నారు. ఇలాంటి సభలకు కమల్ హాసన్ లేదా శివరాజ్ కుమార్ లాంటి వారిని పిలవాలి. నేను అంత మేథావిని కాదు. 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్లో మోషన్లో నడిచే నన్ను ఎందుకు పిలిచారో అర్థం కావట్లేదు అనడంతో సభలో నవ్వులు పూశాయి. ఇందులో రజినీకాంత్ తన మీద తానే సెటైర్ వేసుకున్నట్టు కనిపించినా.. ఈ వ్యాఖ్యలను ఒకసారి గమనిస్తే డైరెక్టర్ ఆర్జీవీకి కౌంటర్ లాగానే ఉన్నాయి. ఎందుకంటే ఆర్జీవీ కూడా ఇలాంటి కామెంట్లే రజినీకాంత్ మీద చేశాడు. అంటే తాను స్లో మోషన్ తోనే హీరోగా కొనసాగుతున్నానా అని ఇక్కడ రజినీకాంత్ చెప్పాడన్నమాట. ఏదేమైనా రజినీకాంత్ చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. ఇక వేల్పరి బుక్ ను తాను 25 శాతం చదివానని.. మిగతా మొత్తం తాను రిటైర్ అయిన తర్వాత చదువుతానని చెప్పాడు రజినీకాంత్.