పవన్ కల్యాణ్ అంటే నాకు అభిమానం..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కల్యాణ్ మా వాడు.. అభిమానం ఉందన్న ఆయన.. మా సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ మీద మాకు అభిమానం ఉండదా..? అని ఎదురు ప్రశ్నించారు.. అయితే, పవన్ చేష్టల వల్ల కాపుల పరువు తీస్తున్నాడనే బాధ మాకుందన్నారు.. ఇక, సీఎం.. సీఎం.. అంటూ పవన్ కల్యాణ్‌ను చూసి నినాదాలు చేస్తున్నవారికి ఆయన అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.. మరోవైపు.. కాపులు ముఖ్యమంత్రి కావాలనే కోరిక నాకు లేదని స్పష్టం చేశారు.. పవన్ వెనక తిరిగే వారికి మాత్రమే పవన్ సీఎం కావాలనే కోరిక ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై స్పందిస్తూ.. చంద్రబాబుతో పవన్ పొత్తు అపవిత్ర కలయికగా పేర్కొన్నారు.
మంత్రి పదవి పోవడమే మంచిదైంది..
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తొలి కేబినెట్‌లో మంత్రి పదవి పొందిన అనిల్ కుమార్ యాదవ్.. రెండో కేబినెట్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు.. సీఎం జగన్ ముందుగా ప్రకటించిన ప్రకారమే.. మంత్రులను మార్చేశారు.. అయితే, తనను మంత్రి పదవి నుంచి తొలగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి చేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్… నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పదవి పోయిన తర్వాత సాయంత్రమే కొందరు నన్ను వీడారని.. కొంత కాలం తర్వాత మరికొందరు వదిలి పెట్టారన్నారు. ఈ పరిణామంతో సొంతం ఎవరు అనే విషయం తనకు తెలిసిందన్నారు. గతంలో మేయర్ తో పాటు పలువురు కార్పొరేటర్లు నన్ను వీడినా.. 2019 ఎన్నికల్లో 8 మంది కార్పొరేటర్లు తన వెంటవున్నా తాను గెలుపొందనని గుర్తుచేసుకున్నారు అనిల్..
‘యువశక్తి’ కాకుండా ‘నారా శక్తి’ అని పెట్టుకో..!
యువశక్తి పేరుతో కార్యక్రమానికి నిర్వహించేందుకు సిద్ధమైంది జనసేన పార్టీ.. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భేటీపై సెటైర్లు వేశారు మంత్రి విడదల రజిని.. ఇక, పవన్ కల్యాణ్ తన కార్యక్రమానికి యువశక్తి అని కాకుండా నారా శక్తి అని పేరుపెట్టుకుoటే బాగుండేదని ఎద్దేవా చేశారు.. చంద్రబాబుని ఏవిధంగా కుర్చీలో కూర్చోబెట్టాలి అన్న అజెండా తప్ప పవన్ కల్యాణ్‌కు ఇంకో అజెండా లేదని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏ రోజు ప్రజలకు మంచి చేసిన పరిస్థితి లేదు.. ఇప్పుడు మేం మంచి చేస్తుంటే ఏడవడం ఆయన నైజంగా మారిందని ఫైర్ అయ్యారు. మేం చేపట్టిన ఉద్దానం ప్రాంత పర్యటనలో ఏ రాజకీయం లేదు.. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మంచి చేయాలన్న లక్ష్యంతోనే ఇక్కడి పరిస్థితులు తెలుసుకోడానికి పర్యటించామన్నారు.. ఉద్దానం ప్రాంత ప్రజలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.. సీఎం జగనన్న ఏం చేశారో ధైర్యంగా మేం చెప్పగలం.. ప్రజలు కూడా చెబుతారని వ్యాఖ్యానించారు మంత్రి విడదల రజినీ..
కథ, స్క్రీన్ ప్లే అంతా వారిదే.. పవన్ కేవలం రేటు తీసుకున్న యాక్టర్ మాత్రమే..!
మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పవన్ ఓ వెర్రిబాగులోడు అంటూ పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు.. నారాలోకేష్ యువగళం.. పవన్ యువశక్తి అని పేర్లు పెట్టారంటే.. కథ, స్క్రీన్ ప్లే అంతా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే సిద్ధం అవుతుంది.. పవన్ కల్యాణ్ కేవలం రేటు తీసుకున్న యాక్టర్ మాత్రమే నంటూ సంచలన ఆరోపణలు చేశారు.. పవన్ కల్యాణ్, చద్రబాబు కలవడం వెనుక ప్యాకేజీ మాటలే ఉంటాయి.. తప్ప ప్రజా సమస్యలు వారికి పట్టవని ఆరోపించారు. ఇక, నాదేండ్ల మనోహార్ ఓ పనికిమాలినవ్యక్తి అని విమర్శించారు.. ఉద్దానం ప్రజలకు ఏం కావాలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి స్పష్టతవుంది.. కిడ్నీ రోగులకు అన్ని విధాల జగన్ ప్రభుత్వం ఆదుకుందన్న ఆయన.. జగన్ సంకల్పం గురించి మాట్లాడేంత స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదన్నారు.. మత్స్యకారుల భరోసా గురించి మాట్లాడుతున్న పవన్., నాదేండ్ల మనోహార్ కు అసలు అవగాహనేలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ పరిహారం అందలేని.. మత్స్యకారులు, కిడ్నీరోగులకు అన్నివిధాల తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.
రూ.10 నాణేలతో ఏకంగా రూ.1.65 లక్షల విలువైన బైక్ కొనేశాడు..
10 రూపాయల నాణేలు చెల్లడంలేదని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.. ఈ దెబ్బతో బయట ఎక్కడా 10 రూపాయల కైన్ ఇచ్చినా ఎవరూ తీసుకోవడం లేదు.. ఇచ్చేవారు ఉన్నా పుచ్చుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు.. అంతలా 10 రూపాయల నాణెంపై ఓ ముద్ర పడిపోయింది.. అలాంటి ఏమీలేదో మొర్రో అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్లారిటీ ఇచ్చినా.. కిందిస్థాయిలో మాత్రం.. 10 కైన్‌పై చిన్నచూపే ఉంది.. చివరకు బిక్షాటన చేసేవారు సైతం ఆ నాణెలు తీసుకోవడం లేదంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అయితే, ఇలాంటి అసత్యప్రచారాన్ని పటాపంచలు చేశాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు.. మొత్తం 10 రూపాయల నాణేలు సేకరించి.. తనకు ఇష్టమైన బైక్‌ను కొనుగోలు చేసి ఔరా..! అనిపించాడు.. 10 రూపాయల కైన్స్‌తో బైక్‌ను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు.. ఏపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన బొబ్బిలి రాఘవేంద్ర అనే యువకుడు.. కేవలం 10 రూపాయల నాణేలను సేకరించి వాటితోనే బైక్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు.. ఏకంగా రూ. 1.65 లక్షల విలువ చేసే 10 రూపాయల నాణేలు సేకరించాడంటే.. దాని వెనుక ఆ యువకుడి కష్టం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, ఆ నాణేలతో షోరూమ్‌కు వెళ్లి రాఘవేంద్ర. తన దగ్గర మొత్తం 10 రూపాయల కైన్స్ ఉన్నాయని.. వాటితోనే బైక్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్టు షోరూమ్ నిర్వహకులు తెలిపారు.. వారు కూడా వెంటనే అంగీకరించారు.. అయితే, రూ. 10 నాణేలు మార్కెట్‌లో చెల్లుబాటు కావడం లేదనే తరచూ వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని, ఈ అపోహలు తొలగించేందుకు 10 రూపాయల నాణేలతోనే బైక్ కొనుగోలు చేయాలని అనుకున్నాను.. అదే చేశానని వెల్లడించాడు రాఘవేంద్ర.
నేడు నుమాయిష్‌లోకి మహిళలకు మాత్రమే ఎంట్రీ
దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ గా పేరున్న హైదరాబాద్ నుమాయిష్.. షురూ అయింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఫిబ్రవరి 15 వరకు జరగనుంది. ఈ 46 రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్(నుమాయిష్ )లో దేశ, విదేశాలకు చెందిన 2400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు సాగుతుంది. అయితే.. హైదరాబాద్‌లోని ప్రముఖ వార్షిక వాణిజ్య ప్రదర్శన నుమాయిష్ మంగళవారం (జనవరి 10) మహిళల కోసం ప్రత్యేకంగా తెరవబడుతుంది. ‘లేడీస్ డే’ అని పిలువబడే రోజులో, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు మరియు అబ్బాయిలను నుమాయిష్‌లోకి అనుమతించరు. 1940లో, హైదరాబాద్‌లోని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. గతంలో ప్రతి మంగళవారం మహిళా దినోత్సవం జరిగేది. అయితే, పగటిపూట సందర్శకుల సంఖ్య తగ్గడం చూసి, మొత్తం వార్షిక ప్రదర్శనలో ఒక రోజు మాత్రమే కేటాయించాలని నిర్ణయించారు. నిర్వాహకులు ఈ ఏడాది ప్రవేశ రుసుమును రూ.30 నుంచి రూ.40కి పెంచారు. గ్రౌండ్ అంతటా ఉచిత Wi-Fi అందించడానికి, సొసైటీ BSNLతో జతకట్టింది.
బోరుబావిలో నాలుగేళ్ల బాలుడు.. సేఫ్‌గా బయటకు..
నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి అకస్మాత్తుగా 40 అడుగుల లోతు గల బోరుబావిలో పడిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో చోటుచేసుకుంది. హాపూర్‌లోని కోట్లా సాదత్ ప్రాంతంలో బోరుబావిలో పడిపోయిన నాలుగేళ్ల బాలుడిని 5 గంటల ఆపరేషన్ తర్వాత సురక్షితంగా బయటకు తీశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం బాలుడిని విజయవంతంగా రక్షించిందని.. అతను వైద్య పరిశీలనలో ఉన్నాడని.. సరైన చికిత్త అందిస్తున్నారని ఎస్పీ దీపక్ భుకర్ విలేకరులతో వెల్లడించారు. హాపూర్‌లోని కోట్లా సాదత్ ప్రాంతానికి చెందిన మోశిన్ కుమారుడు మావియా ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పిల్లాడిని రక్షించేందుకు ప్రయత్నించారు. బాలుడికి ఊపిరి ఆడేందుకు వీలుగా బోరుబావిలోకి ఆక్సిజన్‌ను పంపించారు. కొన్ని గంటలు శ్రమించి ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ బోరుబావిని 35 ఏళ్ల క్రితం మున్సిపాలిటీ అధికారులు తవ్వారు. గత 10 ఏళ్లుగా ఈ బోరుబావి నిరుపయోగంగా ఉందని స్థానికులు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం బాలుడిని బయటకు తీయడంతో స్థానికులు చప్పట్లతో వారికి అభినందనలు తెలిపారు.
ధిక్కార కేసులో ఇమ్రాన్‌కు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ
ధిక్కార కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆయన పార్టీకి చెందిన ఇతర అగ్రనేతలకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికిందర్ సుల్తాన్ రాజాపై పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అగ్రనేతలు జారీ చేసిన ప్రకటనల ఆధారంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిసార్ దుర్రానీ నేతృత్వంలోని నలుగురు సభ్యుల పాకిస్తాన్ ఎన్నికల సంఘం బెంచ్.. ఇమ్రాన్ ఖాన్, ఆయన సన్నిహితులు ఫవాద్ చౌదరి, అసద్ ఉమర్‌లపై వారెంట్లు జారీ చేసింది. తమ పక్షపాత విధానమని, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్‌ను, రాజాను పీటీఐ నేతలు పదే పదే దూషించడంతో ఎన్నికల నిఘా సంస్థ గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ధిక్కార అధికారాలను వినియోగించుకుని వారిపై నోటీసులు జారీ చేసింది. మునుపటి విచారణలో ఎన్నికల సంఘం పీటీఐ నాయకులకు తన ముందు హాజరయ్యేందుకు చివరి అవకాశం ఇచ్చింది.
ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీ రెమ్యూనిరేషన్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..?
ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి అప్పుడే ఏడాదికి దగ్గరవుతోంది. ఇంకా ఎన్టీఆర్ 30 మాత్రం మొదలవ్వలేదు. కథలో మార్పులు అని కొన్ని రోజులు, ఎన్టీఆర్ మేకోవర్ అని మరికొన్ని రోజులు ఆలస్యం చేస్తూ వచ్చారు. ఇక కొత్త ఏడాదిలో మాత్రం ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపి అభిమానులకు చల్లని వార్తను అందించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కానుంది. కాగా, సినిమా క్యాస్టింగ్ పనుల్లో మేకర్స్ బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి వారసురాలు జాన్వీ కపూర్ నటిస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. మేకర్స్ ఆమెతో చర్చించడం, ఆమె ఓకే కూడా అనడం జరిగిపోయాయట. ఒక మంచి రోజు చూసుకొని ఆమె పేరును అధికారికంగా రివీల్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఈ సినిమా కోసం జాన్వీ గట్తిగానే పారితోషికం అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జాన్వీ మొదటి తెలుగు సినిమా, అందులోనూ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా అంటే మాటలు కాదు. అయినా అమ్మడు రెమ్యూనిరేషన్ లో మాత్రం ఎక్కడా మొహమాటమే లేదని చెప్పిందట. మొదటి సినిమా హీరోయిన్ గా కాకుండా స్టార్ హీరోయిన్ లా కోటికి పైనే డిమాండ్ చేసిందని టాక్. ఇక జాన్వీ కోసం మేకర్స్ ఆమె చెప్పినంత ఇవ్వడానికి సిద్దపడ్డారట. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
స్టార్ హీరోల సినిమాలకి స్పెషల్ పర్మిషన్స్… ఇక షో వేసుకోవచ్చు
సంక్రాంతి సీజన్ లో కాస్త ముందుగానే మొదలుపెడుతూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకి వస్తున్నారు. జనవరి 12న బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో థియేటర్స్ లోకి వస్తుంటే ఒక్క రోజు గ్యాప్ తో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. వింటేజ్ వైబ్స్ ఇస్తున్న ఈ రెండు సినిమాలపై తెలుగు రాష్ట్రాల్లో భారి అంచనాలు ఉన్నాయి. చిరు, బాలయ్యల సినిమా రిలీజ్ అంటేనే ఆ హంగామా ఉండడం మామూలే కానీ ఈసారి చిరు-బాలయ్యల మధ్య పోటీ ఉంది కాబట్టి 2023 సంక్రాంతి మరింత స్పెషల్ గా మారింది. మూడు దశాబ్దాలుగా జరుగుతున్న ఈ బాక్సాఫీస్ వార్ ని ఎంజాయ్ చెయ్యడానికి సినీ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఈ జోష్ ని మరింత పెంచుతూ స్పెషల్ షోకి పర్మిషన్స్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ఈ రెండు సినిమాలకి ఎర్లీ మార్నింగ్ 4కి షోస్ వేసుకోవచ్చు అని తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం G.O విడుదల చేసింది. దీంతో సంక్రాంతి సినిమాల సందడి మరింత ఎక్కువ అయ్యింది. టికెట్ రేట్స్ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలకి రేట్ పెంచుకునే వెసలుబాటు ఉంది. టికెట్ రేట్స్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు కానీ దాదాపు 50 రూపాయల వరకూ టికెట్ రేట్స్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి వెసలుబాటుని కల్పిస్తే మన సినిమాలకి మరింత కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాల విడుదలకి ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి జగన్ ప్రభుత్వం స్పెషల్ షోస్, టికెట్ రేట్స్ విషయంలో మంచి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటుందేమో చూడాలి.