ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. పోలవరం నిధులు, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రధానికి వినతిపత్రం ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ పనుల కోసం 2 వేల 900 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వీటిని కేంద్రం రియంబర్స్ చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాల్సి ఉంది. టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయం 55వేల 548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరనున్నారు. చేసిన పనులకు 15 రోజుల్లోగా రీయింబర్స్ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించనున్నారు సీఎం జగన్. మరోవైపు, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన 6,756 కోట్ల రూపాయల బకాయిల అంశాన్ని సైతం సీఎం జగన్.. ప్రధాని మోడీ దగ్గర ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక 8 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న విభజన హామీలను అమలు చేయాలని కోరనున్నారు. ప్రధానికి ఇచ్చే రిప్రజెంటేషన్‌లో ప్రత్యేక హోదా అంశం కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. మెడికల్ కాలేజీలకు అనుమతి, కడప ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయింపు వంటి అంశాలు ప్రధానికి విజ్ఞప్తి చేసే అంశాల్లో ఉండనున్నట్లు సమాచారం.
కేంద్రం ఆదేశాలు.. గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు..
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఈ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.. దీనిపై ఏపీ ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ మాట్లాడుతూ.. కేంద్రం ఆదేశాల మేరకే గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నామని స్పష్టం చేశారు.. ఆర్డీఎస్ఎస్ స్కీములో భాగంగా మార్చి 2025 నాటికి అన్ని చోట్లా స్మార్ట్ మీటర్లు పెట్టాలని కేంద్రం స్పష్టం చేసిందని.. 2019లోనే స్మార్ట్ మీటర్లకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని 2020 డిస్ట్రిబ్యూటర్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిందన్నారు విజయనంద్.. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల బిగింపు ఖర్చును మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని.. గృహ, పరిశ్రమలు, వాణిజ్య విద్యుత్ కనెక్షన్ల బిగింపు ఖర్చులను సోషలైజ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.. రాష్ట్రంలోని 18.56 లక్షల వ్యవసాయ కనెక్షన్లను స్మార్ట్ మీటర్లు పెట్టనున్నాం. రియల్ టైమ్ డేటా తీసుకునేందుకు స్మార్ట్ మీటర్లు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. స్మార్ట్ మీటర్లపై అపోహలొద్దు.. అంతా పారదర్శకంగానే సాగుతోందని వెల్లడించారు ఏపీ ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయానంద్.
పవన్‌తో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో.. బావతో తిరిగే పవన్ బావమరిదితో తిరిగితే తప్పేంటి..?
నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్-2 షో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది.. ఇక, తాజాగా ఈ షోలో పాల్గొన్నారు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా బాలయ్యతో పాటు పవన్ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు.. ఇక, పవన్‌ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగారు..? జనసేనాని సమాధానాలు ఏంటి? ఇటు సినిమా, అటు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్‌పై బాలయ్య ఎలాంటి ప్రశ్నలు సంధించారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఇదే సమయంలో.. ఈ టాక్ షోపై సెటైర్లు పేలుతున్నాయి.. బాలయ్య, పవన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు పవన్ కల్యాణ్ వెళ్లడంపై స్పందిస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.. బావ(చంద్రబాబు నాయుడు)తో తిరిగే పవన్ కల్యాణ్.. బావమరిది (నందమూరి బాలకృష్ణ)తో తిరిగితే తప్పేముంది? అంటూ ఎద్దేవా చేశారు. ఇక, అన్‌స్టాపబుల్ షో.. పేమెంట్ ప్రోగ్రాం.. ఇద్దరికీ డబ్బులు ఇస్తారు అని వ్యాఖ్యానించిన పేర్నినాని.. ఎవరి డైలాగులు వాళ్లకు ముందే ఇస్తారు అని చెప్పుకొచ్చారు.. మరోవైపు బావ (చంద్రబాబు) కోసం బావమరిది (బాలకృష్ణ) ప్రయత్నం చేస్తున్నారని కామెంట్ చేసిన ఆయన.. బావ కోసం పని చేయటానికి బాలయ్యకు మరో అవకాశం వచ్చిందన్నారు.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ లో ఎన్టీఆర్ కొడుకు అయి ఉండి కూడా చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు అంటూ బాలయ్యపై మండిపడ్డారు పేర్నినాని.
రేపటి నుంచి పదో విడత రైతు బంధు
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రైతు బంధు పథకం కొనసాగుతోంది. అయితే.. తాజాగా పదో విడత రైతుబంధు నిధులు విడుదలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. మంగళవారం ఎంపీపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణికర్‌రావు, చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్‌తో కలిసి సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభించి, లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని జమచేసి, అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీలా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇండ్లను చూశారా అని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రావాలంటే లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. త్వరలోనే స్థలాలున్న వారికి ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. రూ.5.60కోట్ల వ్యయంతో కోహిర్‌లో 88 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు మంత్రి హరీష్ రావు.
ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కారుకు ప్రమాదం
ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ మైసూరులోని ఎస్‌జే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటకలోని బందిపురా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మైసూరు సమీపంలో ప్రహ్లాద్ మోడీ కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో ఆయనతో పాటు భార్య, కొడుకు, కోడలు, మనవడు కారులో ఉన్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. ప్రహ్లాద్ మోడీ తన కుటుంబ సభ్యులతో మంగళవారం కర్ణాటకలోని బందిపురాకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. మైసూరు శివారులో కడ్కోళ్ల అనే ప్రాంతానికి చేరుకున్న అనంతరం కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోడీకి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు.
తైవాన్ సంచలన నిర్ణయం
పొరుగుదేశాలపై చైనా కవ్వింపు చర్యలు ఆగడం లేదు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోకి చొరబడడానికి ప్రయత్నించిన చైనా సేనలు.. రెండు రోజులుగా తైవాన్‌ను భయపెట్టేలా భారీస్థాయిలో యుద్ధ విమానాలను బరిలోకి దింపాయి. ఏకంగా 71 విమానాలు తైవాన్ జలసంధి మీదుగా దూసుకుపోయాయి. వీటికి తోడు మరో ఏడు యుద్ధ నౌకలూ రంగంలోకి దిగాయి. క్షిపణి వ్యవస్థలతో ఈ కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించామని, తమ గగనతలంలో చైనా వైమానికదళం చేసిన అతి పెద్ద చొరబాటు ఇదేనని తైవాన్ సైన్యం పేర్కొంది. తైవాన్‌పై దాడి చేసి, ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు చైనా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. తైవాన్‌పై చైనా ఎప్పుడైనా దాడి చేయొచ్చు. ఈ నేపథ్యంలో తైవాన్ అప్రమత్తమవుతోంది. చైనాను ఎదుర్కొనేందుకు తైవాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని ప్రతి ఒక్కరూ సైన్యంలో కనీసం ఏడాది పాటు తప్పనిసరిగా పని చేసేలా చట్టం తీసుకురానుంది. గతంలో కూడా ఆ దేశంలో ఈ చట్టం అమలులో ఉండేది. అయితే, కొంతకాలం క్రితం దీన్ని నాలుగు నెలలకు తగ్గించారు. అంటే ప్రతి ఒక్కరూ సైన్యంలో కనీసం నాలుగు నెలలు పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయం చాలా తక్కువని అక్కడ చాలా మంది అంటున్నారు. పైగా చైనా నుంచి దాడి ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదిపాటు సైన్యంలో పని చేసేలా చట్టం రూపొందిస్తోంది.
అమెరికాను వదలని బాంబ్ సైక్లోన్
మంచు తుఫాన్ ధాటికి అమెరికా అల్లకల్లోలం అవుతోంది. అమెరికాతో పాటు కెనడా కూడా మంచు తుపాన్ ధాటికి వణుకుతోంది. విపరీతమైన చల్లగాలులు వీస్తున్నాయి. ఈ శీతల గాలుల ప్రభావంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు అనారోగ్యాలకు గురవుతున్నారు. రోడ్డుపై మంచుపేరుకుపోవడంతో ప్రమాదాలు జరగుతున్నాయి. ఈ మంచు తుఫాను ప్రారంభమైన దగ్గర నుంచి శీతల గాలుల వల్ల, అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల ఇప్పటి వరకు దాదాపు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్‌లోనే 30 మందిని మంచు తుఫాను బలి తీసుకుంది. అక్కడ ఉష్ణోగ్రత చాలా ప్రాంతాల్లో మైనస్ 45 డిగ్రీలకు పడిపోయింది. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని మంచు, చలిని అమెరికన్లు చూస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో 40 శాతం జనాభా అనగా దాదాపు 20 కోట్ల మంది ప్రజలు ఈ తుఫాను వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా వాతావరణ పరిస్థితుల వల్ల తొమ్మిది రాష్ట్రాల్లో విస్తృతంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.
పుష్ప రాజ్ ను బిగి కౌగిలిలో బంధించిన ఈ అందగత్తె ఎవరో తెలుసా..?
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. గతేడాది పుష్పతో వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన బన్నీ.. వచ్చే ఏడాది పుష్ప 2 తో మరోసారి టాలీవుడ్ ను పాన్ ఇండియా లెవల్లో నివలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక పెళ్లి తరువాత బన్నీ లైఫ్ మొత్తం మారిపోయింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకు కారణం బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు ముత్యాలాంటి బిడ్డలు. పెళ్ళికి ముందు అల్లు అర్జున్ పార్టీలు అంటూ తిరిగినా పెళ్లి తరువాత కనీసం హీరోయిన్లతో ముద్దు కూడా వద్దు అని చెప్పేశాడు. అంతలా అతడిని మార్చేసింది స్నేహ. ఆమె అందం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. హీరోయిన్లకు ధీటుగా ఉండే అందం ఆమె సొంతం. ఈ జంట ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు ఒక సినిమా చేయండి అని అడిగేవారే. ఇక నిత్యం స్నేహ సోషల్ మీడియాలో తన ఫొటోలతో పాటు భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బన్నీతో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. బన్నీని తన బిగి కౌగిలిలో బంధించి సెల్ఫీ తీసుకుంది స్నేహ. ఇక అల్లు అర్జున్ బ్యాక్ లుక్ చూస్తుంటే పుష్ప రాజ్ లుక్ లా అనిపిస్తోంది. గుబురు జుట్టు, మాసిపోయిన షర్ట్.. పుష్ప షూటింగ్ నుంచి డైరెక్ట్ గా వచ్చిన భర్తను కౌగిలించుకొని స్నేహ సెల్ఫీ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు సూపర్ పెయిర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
వారితో మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్న రష్మీ
అందాల యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అమాయకత్వం, మానవత్వం అన్ని కలగలిపిన రూపం రష్మీ. జంతువులకు ఏదైనా జరిగితే రష్మీ గుండె విలవిలలాడుతుంటుంది. మూగ జీవుల కోసం ఆమె ఎంతో పోరాడుతోంది. ఇక రష్మీ కొద్దిగా సమయం చిక్కినా తన స్నేహితురాళ్లతో కలిసి ఛిల్ల్ అవుతూ ఉంటుంది. మొన్ననే తన ఫ్రెండ్స్ బ్యాచ్ తో కలిసి మాల్దీవులు వెకేషన్ కు వెళ్లివచ్చింది. అక్కడ ముద్దుగుమ్మ అందాల ఆరబోతను తట్టుకోవడం కష్టమనే చెప్పాలి. ఇక తాజాగా రష్మీ న్యూయర్ పార్టీని ఎంజాయ్ చేసింది. తానకు దగ్గర స్నేహితురాళ్లు అయిన దీపికా పిల్లి, మరొకరితో కలిసి అమ్మడు వైన్ పుచ్చుకుంది. ఈ వీడియోను రష్మీ పోస్ట్ చేస్తూ .. లాస్ట్ నైట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే రష్మీ ప్రస్తుతం యాంకర్ గా కంటిన్యూ చేస్తూనే హీరోయిన్ గా కూడా అలరిస్తోంది. ఇటీవలే బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన రష్మీ ప్రస్తుతం మంచి కథల కోసం ఎదురుచూస్తోందట. మరి రష్మీ హీరోయిన్ గా హిట్ అందుకుంటుందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.