కాంగ్రెస్ సీనియర్లకు మల్లు రవి కౌంటర్..
కాంగ్రెస్ సీనియర్లకు కౌంటర్ ఇచ్చారు మరో సీనియర్ నేత మల్లు రవి.. ఏ కమిటీల్లో ఎవరి సంఖ్య ఏ స్థాయిలో ఉందే చెప్పుకొచ్చారు మల్లు రవి.. 22 మందితో ఉన్న పీఏసీ కమిటీలో రేవంత్‌రెడ్డి మినహా టీడీపీ నుండి వచ్చినవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేసిన ఆయన.. ఇక, 40 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇద్దరే టీడీపీ నుండి వచ్చినవాళ్లు ఉన్నారు.. ఉపాధ్యక్ష పదవిలో 24 మందిలో ఐదుగురు టీడీపీ నుండి వచ్చినవాళ్లు ఉన్నారని.. 84 మంది ప్రధాన కార్యదర్శుల్లో ఐదుగురు టీడీపీ నుండి వచ్చినవాళ్లకు చోటు కల్పించారి.. డీసీసీ అధ్యక్షుల్లో అసలు ఒక్కరు కూడా టీడీపీ నుండి వచ్చినవాళ్లు లేరని స్పష్టం చేశారు.. ఇక, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కమిటీలో 68 శాతం అవకాశాలు కల్పించారని.. ఓసీలు 32 శాతం ఉన్నారని చెప్పుకొచ్చారు. మొత్తంగా కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చినవాళ్లకు అవకాశం కల్పించడాన్ని పేర్కొంటూ.. సీనియర్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మల్లు రవి.
చాలా దురదృష్టకరం.. తీవ్రంగా కలచివేసింది-బల్కసుమన్
తెలంగాణ.. మంచిర్యాల జిల్లాలో అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. అర్థరాత్రి ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఇలా జరిగింది. మందమర్రి మండలం.. గుడిపల్లి వెంకటాపూర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. అయితే.. ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్. చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మృతుల కుటుంబ సభ్యులను బాల్క సుమన్ పరామర్శించారు. మృతుల్లో వెంకటాపూర్ గ్రామస్తులు ఇంటి యజమాని మాసు శివయ్య, ఆయన భార్య రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ, రాజ్యలక్ష్మి అక్క కూతురు కోటపల్లి మండలం కొండంపేట్ గ్రామానికి చెందిన మౌనిక, మౌనిక ఇద్దరు పిల్లలు స్వీటీ, హిమబిందు, సింగరేణి కార్మికుడు శాంతయ్య మొత్తం 6 గురు మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని తమని తీవ్రంగా కలచివేసిందన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బాల్క సుమన్ విచారణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
రోహిత్ రెడ్డికి ఇంకో గెస్ట్ హౌస్ ఉంది…
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడంపై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. నాకు నోటీస్ లు ఎందుకు ఇచ్చారో తెలియదు… నోటీస్ లో ఏమి లేదని అంటున్నాడు రోహిత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు రఘునందన్ రావు. ఎన్నికల అఫిడవిట్‌లో రోహిత్ రెడ్డి వేర్వేరు సమాచారాలను ఇచ్చారని, 2009 లో ఇచ్చిన అఫిడవిట్ లో B.TECH స్వీడన్ లో చేశాను అని చెప్పాడని రఘునందన్ రావు వెల్లడించారు. 2018 లో ఇచ్చిన అఫిడవిట్ లో కమర్షియల్ లైసెన్స్ , ఇంటర్ పాస్ అయ్యాను అని చెప్పాడని రఘునందన్ రావు తెలిపారు. బెంగుళూర్ డ్రగ్ కేసు విచారణ వేగవంతం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారన్నారు. కేటీఆర్, హరీష్ రావు, రోహిత్ రెడ్డి కి నోటీస్ లు ఇవ్వాలని ఎక్కడ చెప్పలేదని, రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ దళితులకు అసైన్డ్ చేసిన భూములలో ఉందన్నారు. ఇంకో గెస్ట్ హౌస్ ఉంది ఆయనకు… ఆ గెస్ట్ హౌస్ లలో సినిమా వాళ్ళు వస్తుంటారని ఆయన వ్యాఖ్యానించారు. సర్పాన్ పల్లి ఫార్మ్ హౌస్ లో జరుగుతుంది ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ప్రముఖ సినీ నటుడు తో కలిసి 200 ఎకరాలు ఏమో చేస్తున్నావు అట కదా.. నందు , సింహయజి లు నీకు తెలీదా.. వాళ్ళ టెలిఫోన్ కాల్ డేటా మమ్మల్ని బయట పెట్టమంటారా… మీ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన బెంగుళూర్ గోవిందా పూర్ పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్ళారా లేదా. మీరు ఏ ఇన్నోవాలో వెళ్లారో , ఎవరిని తీసుకెళ్ళావో బయటకు పెడతాం.. నాకు డ్రగ్స్ తో సంబంధాలు లేవు, డ్రగ్స్ తీసుకో లేదు అని ఎందుకు ప్రమాణం చేయలేదు… ఎంఐఎం నేతలతో కలిసి విద్యా వికాస్ సమితి పేరు తో మీరు కబ్జా చేయాలని అనుకుంటున్న 200 కోట్ల రూపాయల భూమి విషయం ఈడి కి సమాధానం చెప్పాలి. తప్పుడు అఫిడవిట్ ల పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాము’ అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు..
స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిల రక్షణకు ప్రత్యేక చట్టం..
చిన్నారులు, యువతులు అనే తేడా లేకుండా.. చదువుకునే ప్రాంతంలోనూ లైంగిక వేధింపులకు గురవుతున్నారు.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే పాడుబుద్ధి చూపిస్తున్నారు.. బోధనేతర సిబ్బంది కూడా చిన్నారులపై లాంగిక దాడులకు పాల్పడిన ఘటనలు ఎన్నో.. అయితే, వీటిపై దృష్టిసారించిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీబీ ఆనంద్ వెల్లడించారు.. చిన్నారులు, యువతుల రక్షణపై హైదరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు.. స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిల మీద అఘాయిత్యాలపై ప్రత్యేక చట్టం వస్తుందని.. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తుందని పేర్కొన్నారు.. ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో “నార్కోటిక్స్ ఫ్రీ క్యాంపస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తుంది.. మేనేజ్‌మెంట్‌ను బాధ్యతగా చేస్తూ చట్టం వస్తుందని.. డీఏవీ స్కూలులో ఘటన తర్వాత చట్టంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీల్లో చిన్నారులు, యువతులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. యాంటీ డ్రగ్స్ కమిటీల మాదిరే ఈ చట్టం పనిచేస్తుందని వెల్లడించారు.
జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
విద్యావ్యవస్థలో సంస్కరణలు చేయడంతో పాటు అందరికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా.. విద్యార్థులు విద్యకు దూరం కావొద్దని అనేక పథకాలను తీసుకొచ్చారు. పేదవారికి ఆర్థికపరంగా విద్య దూరం కాకూడదని.. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా తయారు చేసేందుకు బడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాజా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కళాశాలలకు మాత్రమే పరిమితమైన సెమిస్టర్ విధానాన్ని ఇక మీదట పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని తీసుకొస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
అల్లుడి పేరు యోగి.. బుల్డోజర్ కట్నంగా ఇచ్చిన మామ..
ఓ తండ్రి.. తన కూతురుకి పెళ్లి కానుకగా ఓ బుల్డోజర్‌ను కొనిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.. ఇక్కడో ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది.. ఏంటంటే.. పెళ్లి కుమారుడి పేరు యోగి.. కట్నం కింద వచ్చింది బుల్డోజర్.. అసలే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చి యోగి ఆదిత్యానాథ్ సీఎం అయిన తర్వాత బుల్డోజర్ హల్‌చల్ చేస్తున్న విషయం విదితమే. ఇక, పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హమీర్‌పూర్ జిల్లాలోని సుమెర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్‌గావ్‌లో నివసిస్తున్న రిటైర్డ్ జవాన్ పరశురామ్ ప్రజాపతి.. తాజాగా, తన కుమార్తె నేహాకు నౌకాదళంలో పనిచేస్తున్న సౌఖర్ గ్రామానికి చెందిన యోగేంద్ర అలియాస్ యోగి ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు.. ఈ నెల 15వ తేదీన ఘనంగా వివాహం జరిగింది.. అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు.. ఈ సమయంలో.. అక్కడికి బుల్డోజర్ ఎట్రీ ఇచ్చింది.. అంతా ఆశ్చర్యపోయారు.. విషయం ఏంటంటే.. తన కుమార్తె నేహాకు కట్నంగా బుల్డోజర్‌ను ఇచ్చాడు పరశురామ్.. ఇక్కడ అల్లుడి పేరు యోగి.. బుల్డోజర్ కానుకగా ఇవ్వడంతో ఇప్పుడా వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారిపోయాయి.. అయితే, ఓ వరుడికి బుల్‌డోజర్ కట్నం రావడం ఇదే తొలిసారి కావొచ్చు మరి.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యూపీ బుల్డోజర్లపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.. బుల్డోజర్లకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఇప్పుడు కానకగా ఇవ్వడం వైరల్‌గా మారిపోయింది.. అయితే, లగ్జరీ కారు కాకుండా కట్నంలో బుల్డోజర్ ఎందుకు ఇచ్చారు? అని పెళ్లి కూతురు తండ్రిని అడిగితే.. తన కూతురు ప్రస్తుతం యూపీఎస్సీకి సిద్ధమవుతోందని పరశురామ్ ప్రజాపతి చెప్పారు. ఆమెకు ఉద్యోగం రాకపోతే, బుల్డోజర్ ఆమెకు డబ్బులు సంపాదించడానికి సహాయం చేస్తుందని చెప్పుకొచ్చాడు.. ఇక్కడ తండ్రి లాజిక్ కూడా బాగుంది.. మరోవైపు, యోగికి కట్నంగా బుల్డోజర్ పొందడం చర్చనీయాంశంగా మారింది. తనది వ్యవసాయ కుటుంబమని యోగి చెప్పారు. తాను కట్నం తీసుకోవడానికి నిరాకరించానని, ఎలాంటి డిమాండ్ చేయలేదని, అయితే మామగారు బుల్డోజర్ ను సర్‌ప్రైజ్‌గా బహుమతిగా ఇచ్చారని చెప్పాడు.. పెళ్లిలో బుల్డోజర్ కానుకగా ఇచ్చారన్న వార్త వైరల్‌గా మారడంతో జనాలు దాని గురించి చర్చించుకోవడం ప్రారంభించారు. బుల్డోజర్‌ను చూసేందుకు ప్రజలు యోగి ఇంటికి చేరుకుంటున్నారు.
విజయానికి చేరువలో భారత్
ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ 272 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది. రేపు చివరి రోజు బంగ్లాదేశ్ విజయానికి 241 పరుగులు అవసరం కాగా.. భారత్ 4 వికెట్లు తీస్తే గెలుపు ఖాయమవుతుంది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి షకీబ్ అల్ హసన్ (40*), మెహిదీ హసన్ మిరాజ్(9*) క్రీజులో ఉన్నారు. ఆతిథ్య జట్టు నజ్ముల్ హొస్సేన్ శాంటో, యాసిర్ అలీ, లిట్టన్ దాస్, జకీర్ హసన్, ముష్ఫికర్ రహీమ్, నూరుల్ హసన్‌ల వికెట్లను కోల్పోయింది. అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.
నిజంగా అన్‌స్టాపబులే..
నటసింహ నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘ఆహా’లోని ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథిగా పాల్గొనడం విశేషాలకే విశేషంగా మారింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పటికే రెండు ‘గ్లింప్స్’ వచ్చేసి అభిమానులకు ఆనందం పంచాయి. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ప్రోమో కూడా అలా వచ్చిందో లేదో ఇలా అభిమానులను అలరించేస్తూ ముందుకు సాగుతోంది. ‘బాహుబలి’ మీట్స్ బాలయ్య- అంటూ రూపొందిన ఈ ప్రోమో శనివారం సాయంత్రం విడుదలయింది. ఈ ప్రోమో ఆరంభంలోనే బాలకృష్ణ, ప్రభాస్ ను ఆహ్వానించిన తీరు ఆకట్టుకుంటుంది. “కాశ్యపేయస గోత్రోద్భవస్య ఉప్పలపాటి ప్రభాస్ రాజ్ నామధ్యేయస్య…” అంటూ పిలవడం అక్కడున్నవారినే కాదు, ప్రభాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. ప్రభాస్ తనకు ఇష్టమైన వారిని ‘డార్లింగ్…’ అంటూ పిలవడం అందరికీ తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని బాలయ్య ‘సభాముఖంగా అడుగుతున్నా… నన్ను కూడా డార్లింగ్.. అనే పిలవాలి’ అంటూ కోరారు. దానికి ప్రభాస్ ‘అలాగే… డార్లింగ్ సర్…’ అనడంతో వినోదం పండింది.
రజనీకాంత్ క్రియేట్ చేసిన రికార్డులను తిరగరాసిన ఆర్ఆర్ఆర్
అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి తీసిన ట్రిపుల్ఆర్ సినిమా విడుదలై 8నెలలైనా దాని ప్రభంజనం ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది విడుదలైన సినిమా ఎన్నో రికార్డులను నెలకొల్పుతూనే ఉంది. ఇక అవార్డులైతే లెక్కేలేదు. మొన్న రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు.. నిన్న గోల్డెన్ గ్లోబ్స్‌కు నామినేషన్స్.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది ఈ చిత్రం. ఒకటి రెండు కాదు.. 25 ఏళ్ల కింద రజనీకాంత్ క్రియేట్ చేసిన రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా జపాన్‌లో హైయ్యస్ట్ ఇండియన్ గ్రాసర్‌గా నిలిచింది. 25 ఏళ్లుగా ఈ రికార్డు రజినీకాంత్ పేరు మీదే ఉంది. ఆయన ముత్తు సినిమా పాతికేళ్ల కింద ఈ రికార్డు సెట్ చేసింది. 25 ఏళ్లుగా ఎన్ని సినిమాలు వచ్చినా.. ముత్తు కలెక్షన్స్ ను క్రాస్ చేయలేకపోయాయి. తాజాగా ట్రిపుల్ ఆర్ 55 రోజుల్లోనే 2 లక్షల 71 వేల ఫుట్ ఫాల్స్‌తో పాటు.. 410 జపనీస్ మిలియన్ యెన్స్ వసూలు చేసింది. ట్రిపుల్ఆర్‌ను జపాన్ లో బాగా ప్రమోట్ చేసింది టీం. రాజమౌళితో పాటు చరణ్, తారక్ సైతం జపాన్ వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. అందుకే ముత్తు 25 రికార్డు బ్రేక్ చేయగలిగింది. 400 జపనీస్ మిలియన్లు యెన్స్‌తో ముత్తు రెండో స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో 300 మిలియన్లతో బాహుబలి ఉంది.
‘పఠాన్’పై మరో వివాదం
వరసగా వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది బాలీవుడ్ బాద్షా లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’ పాట వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ పై హిందూ సంఘాలు, బీజేపీ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తోంది. దీపికా పదుకొణె ధరించిన కాషాయ రంగు బికినీపై హిందూ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాట చిత్రీకరణ ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని లేకుంటే సినిమాను బ్యాన్ చేస్తామని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరిక పంపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ముస్లిం బోర్డు కూడా అభ్యంతర వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ ఉలేమా బోర్డు కూడా బేషరమ్ రంగ్ పాటలో అసభ్యత ఎక్కువగా ఉందని.. సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సినిమాను విడుదల చేయవద్దని బోర్డు అధ్యక్షుడు సయ్యద్ అనాస్ అలీ కోరారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాల గురించి మాకు కాల్స్ వస్తున్నాయని, దీనిపై పలువురు ఫిర్యాదు చేశారని, ఇస్లాం మతాన్ని తప్పుడు విధానంతో ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. షారుఖ్ ఖాన్ హీరోగా పఠాన్ సినిమా తీశారు.. తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ సయ్యద్ అనాస్ అలీ మండిపడ్డారు. ఈ సినిమాపై ఆల్ ఇండియా ముస్లిం ఫెస్టివల్ కమిటీ సినిమాను బహిష్కరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాను చూడవద్దని మేము ప్రజలను, యువకులకు విజ్ఞప్తి చేశారు. ఇస్లాం మతంపై రాజీపడకపోవడం మన హక్కు అని .. ఎవరైనా ఇస్లాం గురించి తప్పుగా చూపిస్తే సరిదిద్దాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ సినిమా తప్పుడు సందేశం పంపించడంతో పాటు శాంతికి భంగం కలిగిస్తుందని హెచ్చరించారు. ఈ సినిమాతో ముస్లిం మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. పఠాన్‌లు ఎంతో గౌరవించబడే సమాజం అయితే వారిని చాలా తప్పుగా చిత్రీకరించారని అన్నారు.