హైదరాబాద్‌లో పేలుడు కలకలం..
హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్దనున్న జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో కాగితాలు ఏరుకునే తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుండగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రతి డంపింగ్ యార్డులో తండ్రి చంద్రన్న(45), సురేశ్(14) చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. యథావిధిగా గురువారం చెత్త ఏరుతుండగా.. పెయింట్ డబ్బాలను కదిలించారు. దీంతో పేలుడు సంభవించి చంద్రన్న తలకు గాయంకాగా.. కుమారుడు సురేశ్‌కు చేయి విరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్‌టీం అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించింది. పేలుడు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెయింట్‌లో ఉండే టర్బెంట్ ఆయిల్‌తో పేలుడు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో కూడా భారీగా పెయింట్స్ డబ్బాలు ఉండటం పోలీసుల అనుమానాలకు బలం చేకూరుస్తుంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని డాగ్‌స్క్వాడ్‌తో నిశితంగా పరిశీలించారు.
కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాల్సిందే..
సమయం ఆసన్నమైంది.. కేసీఆర్ పాలనకు గుడ్‌బై చెప్పాల్సిందేనంటూ పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ‘అవినీతి, అరాచక, ప్రజా వ్యతిరేక’ ప్రభుత్వం.. కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాల్సిందేనని పిలుపునిచ్చారు.. సబ్ కా సాత్.. సబ్ కా విశ్వాస్ అన్నది మోడీ పాలనలోనే జరిగింది.. ఎస్టీ మహిళ దేశ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా అనుకున్నారా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి జాతీయ రహదారుల కింద భారీ ఎత్తున నిధులు మంజూరు చేశామన్న ఆయన.. జల్ జీవన్ మిషన్ కింద భారీగా నిధులు ఇచ్చాం.. కానీ, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చాడు.. కేసీఆర్ పాలనలో రూ.3.29 లక్షల కోట్ల అప్పుల కుప్పగా రాష్ట్రం మారిందని ఆరోపించారు. కేసీఆర్ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్టుంది అని ఎద్దేవా చేశారు.. టీఆర్ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన కేసీఆర్ పార్టీకి నెక్స్ట్ బీఆర్‌ఎస్ తప్పదని జోస్యం చెప్పారు.. దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్.. ఆ హామీని నిలబెట్టుకున్నాడా? అని నిలదీశారు జేపీ నడ్డా.
వచ్చేవారమే తేలిపోతోంది..
మైలవరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో పంచాయితీ హాట్‌టాపిక్ అయ్యింది.. చివరకు అది సీఎం వైఎస్ జగన్‌వరకు చేరింది.. మంత్రి జోగి రమేష్, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడిచింది.. చివరకు అది వైసీపీ అధిష్టానం వరకు వెళ్లింది.. అయితే, ఇవాళ ఆ నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం సమావేశం అయ్యారు.. ఆ తర్వాత ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. చిన్న చిన్న విబేధాలు ఉంటే సర్దుకుని గత ఎన్నికల్లో వచ్చిన దాని కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచి రావాలని చెప్పారని వెల్లడించారు.. ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకోవాలని చెప్పారు.. కార్యకర్తల మధ్య సమన్వయ లోపాలు ఉంటే పరిష్కరిస్తాం అన్నారు.. నా స్థాయిలో నేను కూర్చో బెట్టి మాట్లాడతాను అని సీఎం తెలిపారన్న ఆయన.. మంత్రి జోగి రమేష్‌కు, నీకు మధ్య విబేధాలు ఉంటే వారం రోజుల్లో నా దగ్గరకు రండి అని సీఎం జగన్ అన్నారు.. ఇద్దరూ కలిసి వస్తే కప్పు కాఫీ తాగి.. వెళ్లండి అని అన్నారని పేర్కొన్నారు.. కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి… అన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.. వచ్చే వారంలో కూర్చుంటాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయమే శిరోధార్యం అని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. కాగా, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వంసత కృష్ణ ప్రసాద్ మధ్య నడుస్తోన్న ఈ వార్.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలోనే ముగియనుందా? పార్టీ అధినేత సమక్షంలో ఎలాంటి చర్చ సాగనుంది అనేది ఆసక్తికరంగా మారింది.
కేసు విచారణకు కోర్టు నో
మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన రింకీ, పింకీ అనే ఇద్దరు కవల అక్కా చెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ట్రావెల్ ఏజెన్సీ నడుపుతోన్న అతుల్‌ను వారు పెళ్లి చేసుకున్నారు. అయితే, వీళ్ల పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతోన్న వీడియో ఆధారంగా ఆ యువకుడిపై కొందరు ఈ పెళ్లికి చట్టబద్ధత, నైతికత లేదంటూ కంప్లైంట్ చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఐపీసీ సెక్షన్ 494 ప్రకారం నాన్ కాగ్నిజబుల్ నేరం కింద ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని షోలాపూర్ కోర్టును అశ్రయించారు. అయితే, కోర్టులో వాళ్లకు చుక్కెదురైంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 198 ప్రకారం కేసు విచారణకు కోర్టు అనుమతి నిరాకరించింది. అతడిపై విచారణకు ఆదేశించలేం. ఫిర్యాదు చేసిన మూడో వ్యక్తి అటు పెళ్లి కొడుకు లేదా ఇటు పెళ్లికూతురు తరఫు వాడు కాదు. వాళ్ల పెళ్లి వల్ల ఇతనిపై ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించింది.
వరుసగా ఏడో సంవత్సరం బిర్యానీయే టాప్..
భారతీయులు ఈ ఏడాది బిర్యానీని భారీ స్థాయిలో ఆరగించేశారు. 2022 ఏడాదిలో కేవలం స్విగ్గీ ద్వారా నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది.. గత ఏడాదితో పోలిస్తే.. ఇది ఎక్కువ.. ఎందుకంటే.. 2021లో ఈ సంఖ్య 115గా ఉంటే.. అది ఇప్పుడు 2.28 శాతం పెరిగి 137కు చేరింది.. బిర్యానీతో పాటు క్లాసిక్ మసాలా దోశను కూడా అధికంగా ఆర్డర్ చేసినట్లు తేలింది. స్నాక్స్ విభాగంలో సమోసాను ఎక్కువగా ఆర్డర్ చేశారని.. సమోసా కోసమే 40 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ వెల్లడించింది.. ఇక, రాత్రి 10 గంటల తర్వాత దాదాపు 20 లక్షల ఆర్డర్లకు పైగా పాప్ కార్న్ కోసం వచ్చినట్టు స్విగ్గీ పేర్కొంది.. స్వీట్ ప్రియులైతే.. గులాబ్ జామ్ కోసం 27 లక్షల ఆర్డర్లు, రస్‌మలై కోసం 16 లక్షలు, చాకో లావా కేక్ కోసం 10 లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ వెల్లడించింది. మొత్తంగా.. 2022లో స్విగ్గీలో వరుసగా ఏడవ సంవత్సరం కూడా అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్‌లో బిర్యానీ నిలిచింది.. భారతీయ ఆహారోత్పత్తుల రుచి ప్రొఫైల్‌లలో మార్పును కూడా పేర్కొంది స్విగ్గీ.. సుషీ, మెక్సికన్ బౌల్స్, కొరియన్ స్పైసీ రామెన్ మరియు ఇటాలియన్ పాస్తా యొక్క ఆర్డర్‌లు కూడా గట్టిగానే ఉన్నాయని తెలిపింది.. మరోవైపు, స్విగ్గీ మెంబర్‌షిప్ ప్రోడక్ట్‌తో అత్యధికంగా ఆదా చేసిన సిటీగా బెంగళూరు నిలిచింది. బెంగుళూరులోని సభ్యులు అత్యధిక ప్రయోజనాలను పొందడం ద్వారా రూ. 100 కోట్లకు పైగా ఆదా చేశారు. ముంబై, హైదరాబాద్ మరియు ఢిల్లీ ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు..
టెస్ట్ కెప్టెన్సీకి కేన్ విలియమ్సన్ గుడ్‌బై
న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. వర్క్ లోడ్ కారణంగా తాను టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కేన్ వెల్లడించాడు. అయితే.. వన్డే, టీ20 ఫార్మాట్‌లలో కెప్టెన్‌గా కొనసాగుతూ, టెస్ట్ సభ్యుడిగా ఉంటానని తెలిపాడు. కేన్ టెస్ట్ కెప్టెన్‌గా తప్పుకున్న నేపథ్యంలో.. అతని స్థానంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ (ఎన్‌జెడ్‌సీబీ) టిమ్ సౌథీని టెస్ట్ జట్టు కెప్టెన్‌గా నియమించింది. ఈ నెల 26వ తేదీ నుంచి పాకిస్తాన్‌తో ప్రారంభమయ్యే 2 టెస్ట్‌ల సిరీస్‌కు సౌథీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని స్పష్టం చేసింది. కాగా.. ఆరేళ్ల పాటు కివీస్ సారథ్య బాధ్యతలు మోసిన విలియమ్సన్, ఇప్పుడు సడెన్‌గా టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతని హయాంలో కివీస్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్‌తో పాటు మరెన్నో విజయాలను నమోదు చేసింది. 2016లో బ్రెండన్ మెకల్లమ్ తర్వాత కేన్ విలియమ్సన్.. న్యూజిలాండ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతని సారథ్యంలో న్యూజిలాండ్ మొత్తం 38 టెస్టు మ్యాచ్‌లు ఆడి, 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
బాగా నిద్రపోతే రూ.30వేల జీతం..
రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలని వైద్యులు చెబుతారు. అప్పుడే ఆరోగ్యం బాగా ఉంటుందని చెబుతుంటారు. అలా అని మరీ ఎక్కువ గంటలు నిద్రపోకూడదు. ఎక్కువ నిద్ర కూడా అనారోగ్యానికి గురి చేస్తుంది. బాగా నిద్రపోతే గ్లామర్ కూడా పెరుగుతుందని కొంత మంది వాదన. ఈ క్రమంలో జపాన్‌లోని ఓ కంపెనీ నిద్ర ప్రియుల కోసం వెతుకుతోంది. కాల్బీ అనే కంపెనీ నిద్రకు సంబంధించిన పరిశోధనలు చేసేందుకు నిద్ర బాగా పోయే వారి కోసం వెతుకుతోంది. స్లీప్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ అని పిలువబడే పరిశోధన కార్యక్రమంలో పాల్గొనేవారికి జీతం కూడా చెల్లిస్తామంటోంది. నెలవారీ జీతం కూడా భారీగా ముట్టజెప్పుతామంటోంది. అది కూడా 50,000 యెన్ లేదా మన రూపాయల్లో 30,452 అందుకుంటారు. నిద్ర నాణ్యత పెరిగితే జీతం పెరుగుతుందని కంపెనీ పేర్కొంది. పరిశోధనలో భాగమైన వారు తమ ఇళ్లలో పడుకోవచ్చు. ప్రతి రోజు పరిశోధకులు నిద్రపోతున్నప్పుడు వారి మెదడు తరంగాలను రికార్డ్ చేశారు. ఈ డేటా ప్రకారం సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. కాల్బీ అనేది న్యూమిన్ అనే స్లీప్ ఎయిడ్ పిల్‌ను అభివృద్ధి చేసిన సంస్థ. కోవిడ్ -19 తర్వాత నిద్రలేమి మరియు ఆందోళనతో బాధపడేవారికి దాని మాత్ర ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అక్టోబర్‌లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనంలో, కోవిడ్ తర్వాత ప్రజలలో నిద్రలేమి మరియు ఆందోళన పెరిగాయని పేర్కొంది. పదహారు దేశాలకు చెందిన 13000 మందిపై జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
అన్ స్టాపబుల్‌కి పవన్ కల్యాణ్..
కథలేకుండానే కనికట్టు చేయగల సత్తా ఉన్న స్టార్స్ ఎవరంటే ఒకరు నటసింహ బాలకృష్ణ, మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని టాలీవుడ్ జనం అంటూ ఉంటారు. అలాంటి ఇద్దరు పవర్ ఫుల్ స్టార్స్ ఒకే వేదికపై కలుసుకోవడం నిస్సందేహంగా వారిద్దరి ఫ్యాన్స్ కు కన్నుల పండగే! ‘ఆహా’లో బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారని అప్పట్లో వినిపించింది. ఇప్పుడు అది సాకారం కాబోతోంది. త్వరలోనే బాలయ్య నిర్వహించే టాక్ షోలో పవన్ కళ్యాణ్ గెస్ట్ గా పాల్గొనబోతున్నారని రూఢీగా తెలుస్తోంది. మిగతా హీరోలకు లేని ప్రత్యేకతలు ఈ ఇద్దరు హీరోలకు ఉన్నాయి. ఇద్దరూ మాస్ లో తమదైన బాణీ పలికించిన వారే! యన్టీఆర్ నటవారసునిగా బాలయ్య జయకేతనం ఎగురవేస్తే, చిరంజీవి తమ్మునిగా అభిమానులను విశేషంగా మురిపించారు పవన్. 2001లో బాలకృష్ణ ‘నరసింహనాయుడు’, పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ జనాన్ని ఎంతగా అలరించాయో చెప్పక్కర్లేదు. ఆ రెండు చిత్రాలు ఈ ఇద్దరు హీరోల కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిలిచాయి. ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వార్ లో తక్కువసార్లు పాలుపంచుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. బాలకృష్ణ హిందూపురం శాసనసభ్యునిగా తనదైన బాణీ పలికిస్తోంటే, ‘జనసేనాని’గా పవన్ తనకంటూ ఓ స్పెషల్ రూటులో సాగుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పొత్తు ఉంటుందని విశేషంగా వినిపిస్తోంది.