సీనియర్ ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టు షాక్..
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. పీఎస్సార్ ఆంజనేయులు దాఖలుచేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో అవకతవకల కేసులో పీఎస్సార్, ధాత్రి మధు.. దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. పీఎస్సార్ ఆంజనేయులుతో పాటు ధాత్రి మధు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది.. అయితే, అనారోగ్య కారణాలు ఉంటే.. రెండు వారాల మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పీఎస్సార్ ఆంజనేయులుకు సూచించింది ఏపీ హైకోర్టు..
‘పుష్ప’ సినిమా తరహాలో స్మగ్లింగ్.. మంచాలుగా మార్చి..!
అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీప్రాంతం సీలేరు నుండి గోకవరం వెళ్లే ఆర్టీసీ బస్సులో రోజ్ వుడ్ కలప మంచాలను పుష్ప సినిమా తరహాలో తరలించేందుకు స్కెచ్ వేశారు.. అందులో భాంగా పుష్ప సినిమా తరహాలో విలువైన కలపను తరలించారు.. ఈ సమాచారం అందుకుని మారేడుమిల్లి వద్ద ఆర్టీసీ బస్సులో అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న రోజు వుడ్ మంచాలను పట్టుకుని అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. రెండు లక్షలకు పైగా విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా మారేడుమిల్లి అటవీ ప్రాంతాల నుంచి చాప కింద నీరుల అక్రమ కలప రవాణా సాగుతుంది. అటవీ సిబ్బంది ఎన్ని చెక్ పోస్ట్ లు పెట్టినా ఫారెస్ట్ అధికారుల కళ్ళు కప్పి లక్షలాది రూపాయలు విలువైన కలప తరలిస్తున్నారు. మరోపక్క అక్రమ కలప రవాణా పై ఉక్కు పాదం వేస్తామని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏపీలో ఉక్కపోత.. ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు.. అక్కడ వర్షాలు..
నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా.. వాటి మందగమనంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.. కొన్ని ప్రాంతాల్లో వర్షలు.. మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. ఇక, ఏపీలో మరో రెండు రోజుల పాటు ఉక్కపోత, గరిష్ట ఉష్ణోగ్రతలు.. మరోవైపు వర్షాలు తప్పువు అని హెచ్చరిస్తోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. రేపు విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 41- 42.5°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. మరోవైపు, ఎల్లుండి అంటే బుధవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 40- 41.5°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.. మరోవైపు అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రంగంపేట, మన్యం జిల్లా గంగన్నదొరవలస, కృష్ణా జిల్లా పెనుమల్లి, ప్రకాశం జిల్లా మాలెపాడులో 40.9°C ఉష్ణోగ్రత నమోదైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది..
రేపు నిరసన కార్యక్రమాలకు వైసీపీ మహిళా విభాగం పిలుపు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకుంది.. ఈ నేపథ్యంలో, వైసీపీ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు విఫలం అయ్యారని.. మాట ఇచ్చి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ పేరుతో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు, వైసీపీ మహిళా విభాగం కీలక నిర్ణయం తీసుకుంది.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ మహిళా విభాగం.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆరోపిస్తోంది.. అందుకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం..
గౌడ్‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుంది.. 40 లక్షల తాటి మొక్కలు సిద్ధం!
గౌడ్‌ల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే.. 40 లక్షల తాటి మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. గీత కార్మిక బిడ్డగా తాను మంత్రిగా పని చేస్తున్నా అని, రాబోయే కాలంలో అందరూ ఉన్నత స్థానంలో కొనసాగేలా కష్ట పడండని సూచించారు. కుల వృత్తి పరంగా చేసేవారు చేయండని, కానీ పిల్లలకు చదువే ప్రధానంగా ఉండేలా చదివించాలన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులాలకు అవకాశం ఇచ్చిందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణంకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు శంకుస్థాపన చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ‘గౌడ్‌లకు సంబంధించి కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని నన్ను, మహేష్ కుమార్ గౌడ్‌ను బాలసాని లక్ష్మీ నారాయణ కలిశారు. ప్రభుత్వం గౌడ్‌ల సంక్షేమం కోసం పని చేస్తుంది. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మంత్రుల వద్ద మాట తీసుకున్నా. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కాంట్రిబ్యూషన్ ఎక్కువ తీసుకుంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. 6 కోట్లతో తెలంగాణలో రెండవ స్థానంలో నేను నిర్మించిన గౌడ భవన్ ఉంటుంది. వేములవాడలో 45 రూమ్‌లతో సత్రం కడుతున్నాం. కుల వృత్తి పరంగా చేసేవాళ్లు చేయండి కానీ.. పిల్లలకు చదువే ప్రధానంగా ఉండేలా చదివించాలి’ అని అన్నారు.
ప్రతి మహిళా ఎస్‌హెచ్‌జీలో ఉండాలి.. కలెక్టర్లకు మంత్రి సీతక్క ఆదేశాలు!
అంగన్వాడీలు ఈనెల 11న తెరుచుకోనున్నాయని, అంగన్వాడీల్లో చిన్నారులు చేరేలా చర్యలు చేపట్టండని కలెక్టర్లకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. శిధిలావస్తలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని ఖాళీ ప్రభుత్వ భవనాల్లోకి మార్చండని సూచించారు. కొత్తగా వెయ్యి అంగన్వాడీ భవనాలు నిర్మించబోతున్నామని, వాటికి కావాల్సిన స్థలాలను సేకరించండని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యునిఫామ్‌లను మహిళా సంఘాలచే కుట్టిస్తున్నామని, పాఠశాల తెరిచే రోజు విద్యార్థులందరికి యునిఫామ్‌లు పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. సచివాలయంలో మంత్రి సీతక్క, సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా సంఘాలచే సోలార్ ప్లాంట్స్-పెట్రోల్ బంక్స్ ఏర్పాటు, నూతన మహిళ సభ్యుల గుర్తింపు, కిశోర బాలికలు-దివ్యాంగులు-వయోధిక మహిళా సంఘాల ఏర్పాటు, ఇందిరమ్మ మహిళా శక్తి భవనాల నిర్మాణ పనుల పురోగతి, మహిళా సంఘాలచే ప్రభుత్వ పాఠశాలల స్కూల్ యునిఫామ్‌ల సరఫరా తదితర అంశాలపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహిచారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… ‘కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేసే లక్షంతో కలెక్టర్లు పనిచేయాలి. తెలంగాణ రైజింగ్ 2047 సాకారం కావాలంటే మహిళా సంఘాలను బలోపేతం చేయాలి. మహిళా సంఘాలచే సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించేలా కలెక్టర్లు కృషి చేయాలి. అక్టోబర్ 2న సోలర్ ప్లాంట్లు ప్రారంభించే లక్ష్యంతో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి. ఇప్పటికే జిల్లాల వారిగా సోలార్ ఇనస్టాలేషన్ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. వారితో సమన్వయం చేసుకుని సోలార్ ప్లాంట్ల పనులు ప్రారంభించాలి’ అని అన్నారు.
శర్మిష్ఠ పనోలిపై ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ అరెస్టు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలిపై ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. మతపరమైన భావాలను రెచ్చగొట్టడం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం వంటి ఆరోపణలు వజాహత్‌పై వెల్లువెత్తాయి. జూన్ 1 నుంచి అతను పరారీలో ఉన్నాడని, పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అతను హాజరు కాలేదని చెబుతున్నారు. దీని తరువాత, పోలీసులు గార్డెన్ రీచ్ ప్రాంతంలోని అతని ఇంటికి వెళ్లి గాలించారు. చివరకు అతన్ని అరెస్టు చేశారు. గోల్ఫ్ గ్రీన్ పోలీస్ స్టేషన్‌లో వాజాహత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హిందూ మతం, దేవతలు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా దుర్వినియోగం, రెచ్చగొట్టే, అసభ్యకరమైన భాషను ఉపయోగించి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పోస్ట్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ‘శ్రీ రామ్ స్వాభిమాన్ పరిషత్’ అనే సంస్థ జూన్ 2న వాజాహత్‌పై అధికారిక ఫిర్యాదు చేసింది. అంతకుముందు, శర్మిష్ఠ పనోలిని మే 30న గురుగ్రామ్ లో కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీనిలో కొంతమంది ముస్లిం బాలీవుడ్ తారలు ‘ఆపరేషన్ సింధూర్’ గురించి మౌనంగా ఉండటం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.
స్టార్‌లింక్ అపరిమిత డేటా ప్లాన్ నెలకు రూ. 3000..! త్వరలో సేవలు ప్రారంభం
శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ భారత్ లో అపరిమిత డేటా ప్లాన్‌లను అందించాలని యోచిస్తోంది. సీఎన్ బీసీ ఆవాజ్ నివేదికల ప్రకారం, కంపెనీ ప్లాన్ నెలకు రూ. 3000 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ రిసీవర్ కోసం కంపెనీ రూ. 33,000 వన్‌టైమ్ ఫీజును కూడా వసూలు చేస్తుందని నివేదిక పేర్కొంది. టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ నుండి లైసెన్స్ పొందిన కొన్ని రోజుల తర్వాత స్టార్‌లింక్ గురించి ఈ సమాచారం వచ్చింది. భారతదేశంలో స్టార్‌లింక్ ప్లాన్ ధర బంగ్లాదేశ్‌లో ఉన్నట్లే ఉంటుంది, అక్కడ ఇది ఇప్పటికే ఉపగ్రహ ఇంటర్నెట్‌ను అందిస్తోంది. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) గత వారం ఎలాన్ మస్క్ కంపెనీకి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ (GMPCS) అనుమతిని మంజూరు చేసింది. దేశంలో ఈ అనుమతిని పొందిన మూడవ కంపెనీ స్టార్‌లింక్. గతంలో, భారతీ ఎయిర్‌టెల్, వన్‌వెబ్, రిలయన్స్ జియో ఈ అనుమతిని పొందాయి. భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్‌ను ప్రారంభించడానికి ఎయిర్‌టెల్, జియో రెండూ లైసెన్స్ కలిగి ఉన్నాయి. భారత్ లో తన సేవలను ప్రారంభించడానికి స్టార్‌లింక్‌కు IN-SPACe (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్), స్పెక్ట్రమ్, గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి అనుమతి అవసరం. ప్రస్తుతం, భారత్ లోని ఏ టెలికాం కంపెనీకి స్పెక్ట్రమ్, ఉపగ్రహ ఇంటర్నెట్ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు.
అఖండ 2 టీజర్ రివ్యూ.. గూస్ బంప్స్ అంతే..
ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన అఖండ-2 టీజర్ వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో సినిమా ఇది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ భారీ హిట్ అవడంతో.. పార్ట్-2 తీస్తున్నారు. రామ్ ఆచంట, గోపీ ఆచంటతో కలిసి బాలయ్య కుమార్తె తేజస్విని నిర్మించిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించాడు. తాజాగా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఫ్యాన్స్ డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని కట్ చేశారు. మంచులో తీసిన ఫైట్ సీన్ తో టీజర్ మొదలు పెట్టారు. ఇందులో బాలయ్య లుక్ ఊరమాస్ గా ఉంది. నాగసాధు పాత్రలో ఆయన లుక్ అమోఘం. భారీ గడ్డం, జుంపాలతో నిలవెల్లా నాగసాధు లక్షణాలు ఉట్టిపడేలా ఉన్నారు. టీజర్ ఫైట్ సీన్ తోనే స్టార్ట్ అయింది. ‘నా శివుడి ఆజ్ఞ లేనిదే యముడైనా కన్నెత్తి చూడడు.. అలాంటిది నువ్వు చూస్తావా’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ బాగుంది. ఈ డైలాగ్ తోనే అధర్మం మీద నాగసాధుగా బాలయ్య చేసే పోరాటాన్ని సినిమాలో చూపిస్తున్నట్టు చెప్పేశారు. విలన్లను బాలయ్య తన త్రిషూలంతో అంతం చేసే సీన్ మాస్ ఫ్యాన్స్ ను కట్టిపడేస్తోంది. ‘వేదాలు చదివిన స్వరం యుద్ధానికి ఎదిగింది’ అంటూ విలన్ చెప్పే డైలాగ్ బాలయ్యకు ఎలివేషన్ ఇచ్చేసింది. ఇందులో బాలయ్య పాత్రను మాత్రమే చూపించారు. ఆయన నాగసాధు పాత్రను చూపిస్తూ టీజర్ ను కట్ చేశారు. మాస్, హిందూత్వం కలబోసినట్టు తీశారు. సనాతన ధర్మం గొప్పతనం ఉట్టిపడేలా.. ధర్మాన్ని కాపాడే నాగసాధువుగా బాలయ్య ఇందులో కనిపించారు. యాక్షన్ సీన్లకు తగ్గట్టు తమన్ ఇచ్చిన బీజీఎం అదిరిపోయింది.
కొత్త బ్రాండ్ ఐడెంటిటీతో వస్తున్న జీ5..
ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 కొత్త బ్రాండ్ ఐడెంటిటీతో రాబోతోంది. ZEE5 డెవలప్‌మెంట్‌లో ఇదే కీలకం కాబోతోంది. ‘మన భాష – మన కథలు’ అనే పున: ప్రారంభంతో భారతీయ సంస్కృతిలోని బోలెడు కథలను అన్ని భాషల వారికి అర్థమయ్యే విధంగా చెప్పేందుకు ఇంపార్టెన్స్ ఇస్తూ టెక్నికల్ మార్పులు చేస్తోంది జీ5. కొత్త విజువల్ ఐడెంటిటీ, ప్రొడక్ట్‌ను ఎక్స్ పీరియన్స్ తో అన్ని భాషల్లో విజువలైజ్ చేయబోతున్నారు. అన్ని భాషల్లో ఉండే లోకల్ మేడ్ కంటెంట్ తో వస్తున్నామని జీ5 ప్రకటించింది. జీ5 ప్రెసిడెంట్ అమిత్ గోయెంకా మాట్లాడుతూ ‘‘మా కొత్త బ్రాండ్ ఐడెంటిటీ సంస్థను మరింత బలోపేతం చేస్తుంది. అన్ని భాషల వారికి అర్థమయ్యే విధంగా లోకల్ కంటెంట్ ను ప్రోత్సహించేందుకు రెడీ అయ్యాం. పురాణాలు, ప్రాంతీయ కథల ఆధారంగా కంటెంట్ ను రూపొందిస్తాం. ప్రేక్షకులు ఎక్కువగా కోరుకునే కథల ఆధారంగా కంటెంట్ ను రెడీ చేస్తాం. టెక్నికల్ గా వాళ్లకు అనుకూలమైన ఏఐ ఆధారిత ప్రాసెస్ ను ఫాలో అవుతున్నాం అంటూ తెలిపారు.
అవన్నీ అవాస్తవం.. రిలీజ్ డేట్ పై ‘వీరమల్లు’ క్లారిటీ
పవన్ కల్యాణ్ నటించిన హరిమర వీరమల్లు మూవీ జూన్ 26న రిలీజ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. ఏకంగా పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. అఫీషియల్ టీమ్ నుంచి వచ్చినట్టే పోస్టర్లు ఉండటంతో ఫ్యాన్స్ నిజమా కాదా అని కన్ ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో మూవీ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిలీజ్ డేట్స్ అన్నీ నిజం కాదని తేల్చి చెప్పింది. మూవీ రిలీజ్ డేట్ ను తామే స్వయంగా ప్రకటిస్తామని చెప్పింది. అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి వచ్చే వాటినే నమ్మాలని.. సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చింది. రిలీజ్ డేట్ ను త్వరలోనే తాము ప్రకటిస్తామని.. అప్పటి వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాలని కోరింది. వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. చివరకు వాయిదా వేశారు. కానీ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తుండటంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి మూవీ కావడంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.