పేకాటకు అనుమతి ఇవ్వాలని పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
పేకాట అనుమతి కోసం పిటిషన్లు వేసిన మూడు క్లబ్‌లకు షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. 13 కార్డ్స్‌కు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్, లార్డ్ హోర్డింగ్ హాల్ టౌన్ క్లబ్, నర్సాపురం యూత్ క్లబ్.. అయితే, విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.. డబ్బులు పందెంగా పెట్టి కార్డ్స్ ఆడటం చట్ట విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేస్తూ, క్లబ్‌ల విజ్ఞప్తిని తిరస్కరించింది. క్లబ్‌ల తరఫు న్యాయవాది సుప్రీం కోర్టు తీర్పుల ఆధారంగా 13 కార్డ్స్ రమ్మీకి అనుమతి ఇవ్వాలని వాదనలు వినిపించారు. అయితే, విచారణ అనంతరం హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డబ్బులకు పేకాట ఆడటానికి వీల్లేదని, అలా ఆడితే అది గాంబ్లింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 కింద చట్టవిరుద్ధ చర్యగా పరిగణించి కేసులు నమోదు చేయాల్సిందే అని తెలిపింది. ఇటీవల కూడా ఇలాంటి కేసుల్లో ఇదే తరహా ఆదేశాలు ఇచ్చాం అని బెంచ్ గుర్తుచేసింది. ఇప్పటికే నూజివీడు మాంగో బే క్లబ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా హైకోర్టు గతంలో స్పష్టత ఇచ్చింది. 13 కార్డ్స్ రమ్మీని డబ్బులకు ఆడొద్దు, ఆడితే గాంబ్లింగ్ యాక్ట్ 3, 4 కింద చర్యలు తీసుకోవాలి అని జిల్లా పోలీస్, యంత్రాంగానికి అప్పుడే ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టు పేర్కొంది. నేటి విచారణలోనూ ఈ మూడు క్లబ్‌ల పిటిషన్ల విషయంలో కూడా అదే చట్టపరమైన నియమాలు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో పేకాటను డబ్బులకు ఆడేందుకు చట్టబద్ధత ఇవ్వాలని చూసిన ప్రయత్నానికి బ్రేక్ పడింది. దీంతో ఇకపై క్లబ్‌లు, వ్యక్తులు ఎవరైనా డబ్బులు పెట్టి 13 కార్డ్స్ లేదా రమ్మీ ఆడితే అది గ్యాంబ్లింగ్ కింద నేరమే అవుతుందని హైకోర్టు మరోసారి తేల్చి చెప్పింది.
రెండో దశ ల్యాండ్ పూలింగ్.. ఆ 7 గ్రామాల్లో రేపటి నుంచే..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ రాజధాని అమరావతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా పనులు జరుగుతున్నాయి.. ఇక, రాజధాని ప్రాంతం అమరావతిలో రేపటి (జనవరి 7) నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ దశలో గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలోని 7 గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) భూ సమీకరణకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో దశలో మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించనున్న ప్రభుత్వం, రాజధానిలో కీలక మౌలిక వసతుల నిర్మాణానికి ఈ భూసేకరణ చేపడుతోంది. ఇందులో: పట్టా భూమి: 16,562 ఎకరాలు కాగా.. అసైన్డ్ భూమి: 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి: 3,828 ఎకరాలుగా ఉండనుంది.. అయితే, మొదటి దశలో ఇప్పటికే 34,400 ఎకరాల భూమిని విజయవంతంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించింది ప్రభుత్వం, ఇప్పుడు రెండో దశను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈసారి భూసేకరణను ప్రాజెక్టుల వారీగా విభజించి నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధానిలో నిర్మించబోయే ప్రధాన ప్రాజెక్టుల కోసం భూ సమీకరణ జరుగుతోంది. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం, కొత్త రైల్వే లైన్ అభివృద్ధి, ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇన్‌ఫ్రా కారిడార్ అనుసంధాన పనుల కోసం ఈ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు.. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఇకపై ప్రతి అభివృద్ధి ప్రాజెక్టుకు అవసరమైన భూములను ప్రత్యేకంగా గుర్తించి సమీకరించనున్నారు. భూసేకరణ ప్రక్రియలో గ్రామస్థులకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శక విధానం పాటిస్తామని అధికారులు పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, రెండో దశ ల్యాండ్ పూలింగ్ రాజధాని మౌలిక వసతుల కలను మరింత ముందుకు తీసుకెళ్లే కీలక అడుగుగా నిలవనుంది.
గ్యాస్ బ్లోఅవుట్.. జిల్లా కలెక్టర్, ఓఎన్జీసీ కీలక ప్రకటన.. మరో ఐదు రోజులు..!
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ బ్లోఅవుట్‌పై కీలక ప్రకటన చేశారు జిల్లా కలెక్టర్, ఓఎన్జీసీ.. ఇరుసుమండ ప్రాంతంలో కొనసాగుతున్న గ్యాస్ బ్లోఅవుట్ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఓఎన్జీసీ టెక్నికల్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో… బ్లోఅవుట్ కట్టడి చర్యలు, భద్రతా పరిస్థితులపై స్పష్టత ఇచ్చారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కోనసీమలోని గ్యాస్ బ్లోఅవుట్ మరో ఐదు రోజులు పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే ఇప్పటికే 95 శాతం బ్లోఅవుట్‌ను విజయవంతంగా కట్టడి చేశామని, మిగిలిన గ్యాస్‌ను క్యాపింగ్ చేసేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.. అయితే, బ్లోఅవుట్ కొనసాగినా ఎలాంటి ప్రాణహాని, ప్రమాదం ఉండదని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని విక్రమ్ సక్సేనా తెలిపారు. గ్యాస్ లీక్ ప్రాంతంలో ప్రస్తుతం వాటర్ అంబ్రెల్లా భద్రతా విధానం అమలు చేస్తున్నామని, ఐదు వైపులా నిరంతరం నీరు చిమ్ముతూ మంటలు చెలరేగకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. భూభాగంలో మిగిలిన గ్యాస్‌ను పూర్తిగా నియంత్రించేందుకు రోజుకు అనేక టెక్నికల్ పరిశీలనలు, నిపుణుల సూచనలతో క్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇక, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఒక్క ప్రాణి కూడా ప్రమాదానికి గురికాలేదని అధికారులు ధృవీకరించారు. బ్లోఅవుట్ కారణంగా కాలిపోయిన కొబ్బరి చెట్లు, దెబ్బతిన్న పంట భూములకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, మరో ఏడు రోజులు పాటు Water Umbrella విధానంలో ఐదు వైపులా నీటిని చిమ్మే రక్షణ చర్యలు కొనసాగుతాయని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. బ్లోఅవుట్ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు జిల్లా యంత్రాంగం, ఓఎన్జీసీ నిపుణులు, కేంద్ర–రాష్ట్ర విభాగాలు నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం 95% కట్టడి కావడంతో ప్రమాద తీవ్రత గణనీయంగా తగ్గిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు అధికారులు..
లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కోర్టుకు చేరిన FSL రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితుల మొబైల్ ఫోన్లకు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) నివేదిక కోర్టుకు చేరింది.. ఫోన్లలోని డేటా, కాల్ రికార్డులు, డిలీట్ చేసిన ఫైల్స్, ఇతర డిజిటల్ ఆధారాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ పూర్తి చేసి నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు.. కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కోర్టు నుంచి ఈ FSL రిపోర్టును రేపు అధికారికంగా తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోర్టు అనుమతితో SIT బృందం నివేదిక కాపీని స్వీకరించి, అందులోని కీలక అంశాల ఆధారంగా తదుపరి విచారణను వేగవంతం చేయనుంది. అయితే, లిక్కర్ స్కాం బయటపడిన వెంటనే నిందితులు తమ మొబైల్ ఫోన్లను ధ్వంసం (destroy) చేసినట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది. అయితే, FSL నిపుణులు అధునాతన టెక్నాలజీతో ఫోన్లలోని చిప్స్, స్టోరేజ్ భాగాల నుంచి డేటాను రికవరీ చేసి విశ్లేషణ చేసినట్లు సమాచారం. దీంతో, స్కామ్‌లో జరిగిన కమ్యూనికేషన్, లావాదేవీల డిజిటల్ ఆధారాలు బయటపడే అవకాశం మరింత పెరిగింది. FSL రిపోర్ట్ SIT చేతికి అందితే.. స్కాం వెనక ఉన్న నెట్‌వర్క్, నిందితుల మధ్య జరిగిన చాట్స్, కాల్స్, డిలీట్ చేసిన డాక్యుమెంట్లు, డిజిటల్ లావాదేవీల వివరాలు, కీలక వ్యక్తుల పాత్ర వంటి అంశాలు బయటపడే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ ఆధారాలు కేసు దర్యాప్తులో గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశముందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోర్టు నుంచి FSL రిపోర్టును రేపు SIT బృందం తీసుకోనుండటంతో, దర్యాప్తు మరింత కీలక దశకు చేరింది. నివేదికలోని వివరాల ఆధారంగా సిట్ కొత్త నోటీసులు, విచారణలు, అవసరమైతే అదనపు అరెస్టులపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది.
శ్రీవాణి దర్శన టిక్కెట్ల జారీ విధానంలో కీలక సంస్కరణలు..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు ఎక్కువగా వినియోగించే శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. తిరుమలలో ఆఫ్‌లైన్ ప్రక్రియ ద్వారా రోజూ జారీ చేస్తున్న 800 టికెట్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు TTD ప్రకటించింది. ఇప్పటివరకు ప్రతిరోజూ తిరుమలలో ఆఫ్‌లైన్ ద్వారా విడుదలయ్యే 800 శ్రీవాణి దర్శన టికెట్లు ఇకపై ఆన్‌లైన్ విధానంలోనే విడుదల చేయనున్నారు. భక్తులు ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు TTD అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. టికెట్ పొందిన భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రేణిగుంట విమానాశ్రయంలో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేసే శ్రీవాణి దర్శన టికెట్ల విధానాన్ని మాత్రం కొనసాగించనున్నట్లు TTD స్పష్టం చేసింది. అక్కడ టికెట్ల జారీ, భద్రతా పరిశీలన, దర్శన సమయాల కేటాయింపు గత మాదిరిగానే కొనసాగుతాయి. అదే సమయంలో, భక్తులు ముందస్తుగా దర్శనం ప్లాన్ చేసుకునేలా TTD అమలు చేస్తున్న మూడు నెలలు ముందుగా ఆన్‌లైన్‌లో విడుదల చేసే 500 టికెట్ల శ్రీవాణి కోటా విధానం కూడా యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.
అసెంబ్లీ గౌరవ సభలా లేదు.. కౌరవ సభ లా ఉంది..
వరంగల్ జిల్లా జనగామ వేదికగా జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ తన ప్రసంగంతో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, “కాలం వచ్చినప్పుడు కసిదీర కాటేయాలే” అనే మాటకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఉద్ఘాటించారు. పార్టీలో ఎటువంటి కీలక పాత్ర లేకపోయినా, కేవలం గౌరవంతో కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని, కానీ ఆయన తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం ద్రోహం చేసి రేవంత్ రెడ్డి చెంతకు చేరారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత స్థాయిలో తీవ్ర విమర్శలు చేస్తూ, ఆయనకు కనీస భౌగోళిక అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరిపై ఉందో, కృష్ణాపై ఉందో తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని, బక్రా నంగల్ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియనివాడు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్ల పాలనలో సిగ్గులేని మాటలు, రోత కోతలు తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు.
ఆధార్ వినియోగదారులకు అలెర్ట్.. ఆధార్ PVC కార్డ్ ధర పెంపు..!
ఆధార్ వినియోగదారులకు కీలకమైన సమాచారం. ఆధార్ PVC కార్డ్ పొందేందుకు చెల్లించాల్సిన ధరను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) పెంచింది. జనవరి 2026 నుంచి ఆధార్ PVC కార్డ్ ఫీజు రూ.50 నుంచి రూ.75కి పెరిగినట్లు UIDAI అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ధర myAadhaar వెబ్‌సైట్ లేదా mAadhaar మొబైల్ యాప్ ద్వారా చేసే అన్ని కొత్త అభ్యర్థనలకు వర్తిస్తుంది. UIDAI విడుదల చేసిన మెమోరాండం ప్రకారం.. జనవరి 1, 2026 నుంచి బుక్ చేసే ఆధార్ PVC కార్డ్ ఆర్డర్లకు ఈ సవరించిన ధర అమల్లోకి వచ్చింది. ఈ రూ.75 ఫీజులో పన్నులు, హోం డెలివరీ ఛార్జీలు కూడా కలిపే ఉన్నాయి. 2020లో ఆధార్ PVC కార్డ్ సేవ ప్రారంభమైనప్పటి నుంచి మొదటిసారిగా ధరను పెంచారు. ఆధార్ PVC కార్డ్ అంటే ఏమిటంటే.. ఇది ప్లాస్టిక్‌తో తయారు చేసిన చిన్న పరిమాణంలోని ఆధార్ కార్డ్. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ సైజ్‌లో ఉండే ఈ కార్డ్, సాధారణ కాగితపు ఆధార్ కార్డుతో పోలిస్తే మరింత బలంగా, సులభంగా తీసుకెళ్లేలా రూపొందించారు. అదనపు సెక్యూరిటీ ఫీచర్లతో ఇది వస్తుంది. ఫార్మాట్ వేరు అయినప్పటికీ, దీనికి సాధారణ ఆధార్ లేదా ఈ-ఆధార్‌తో సమానమైన చట్టపరమైన విలువ ఉంటుంది.
“వెనిజులా మాదిరిగా పీఓకేపై దాడి చేయండి”.. మోడీకి లేఖ..
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)పై దాడి చేయాలని ప్రధాని నరేంద్రమోడీకి పీఓకే శరణార్థులు లేఖ రాశారు. ఇటీవల వెనిజులాపై అమెరికా దాడి చేసినట్లే, పీఓకేకు విముక్తి కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. పీఓకే నుంచి నిరాశ్రయులైన వ్యక్తులు, పీఓకే ప్రాంతంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై నిర్ణయాత్మక, సాహసోపేత దాడిని ప్రారంభించాలని ప్రధానిని కోరారు. పీఓకే శరణార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న SOS ఇంటర్నేషనల్ సంస్థ ప్రధాని మోడీకి ఈ లేఖ రాసింది. పీఓకే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేసి హిజ్బుల్ ముజాహీదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌ను పట్టుకోవడానికి సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆ సంస్థ చైర్మన్ రాజీవ్ చుని అన్నారు. వెనిజులాలో అమెరికా ఆపరేషన్, అధ్యక్షుడు నికోలస్ మదురోను ఉదాహరణగా చూపుతూ, భారత దళాలు సలావుద్దీన్‌ను పట్టుకుని, బంధించి, భారతదేశానికి తీసుకురావాలని తాను కోరుకుంటున్నానని చుని అన్నారు. పీఓకేను ఉగ్రవాదులు, డ్రగ్స్, ఆయుధాలకు లాంచ్ ప్యాడ్స్‌గా ఉపయోగిస్తున్నారని, ఇది భారత భద్రతకు ముప్పుగా ఉందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సమస్యల కన్నా జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఓకేను విముక్తి చేసి, దానిని భారత్‌లో కలపాలని లేఖలో కోరారు.
ఇరాన్‌పై దాడికి యూఎస్, ఇజ్రాయిల్ ప్లాన్: రిపోర్ట్స్..
వెనిజులా సైనిక చర్య నేపథ్యంలో, అమెరికా ఇరాన్‌లో ఏదైనా సైనిక చర్య చేపడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే, ఇరాన్ వ్యాప్తంగా ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, ప్రభుత్వంపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నారు. ఇప్పటికే, ఈ అల్లర్లలో 30 మందికి పైగా చనిపోయారు. మరోవైపు, బలవంతంగా ఇరాన్ ప్రభుత్వం, నిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఇరాన్‌లోని 31 ప్రావిన్సుల్లో 27 ప్రావిన్సుల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఇదిలా ఉంటే, ఇరాన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. జెరూసలెం పోస్ట్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. అమెరికా, ఇజ్రాయిల్ అధికారులు కలిసి ఇరాన్‌పై ఏం చేయాలనే మార్గాలను అన్వేషిస్తున్నాయని చెప్పింది. 2022లో మహ్సా అమిని ‘‘హిజాబ్’’ హత్య తర్వాత మరోసారి ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రియాల్ దారుణంగా పడిపోవడంతో ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదు. దీంతో ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి ఆందోళన రూపంలో బయటకు వచ్చాయి. ఈ ఆందోళనల్లో ఇరాన్ అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. మరోవైపు, ఈ అల్లర్లను అణిచివేసేందుకు సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
‘‘దమ్ముంటే మదురోలా నన్ను పట్టుకెళ్లు’’.. ట్రంప్‌కు మరో దేశాధినేత సవాల్..
గత శనివారం వెనిజులాపై అమెరికా దాడులు చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికాకు బందీలుగా పట్టుకెళ్లారు. వీరిద్దరిపై నార్కో టెర్రరిజం, అక్రమ ఆయుధాల కేసుల్ని మోపింది. మదురో డ్రగ్స్ ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని ట్రంప్ ప్రధాన ఆరోపణ. యూఎస్‌లోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని యూఎస్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే, వెనిజులాలో ఉండే చమురు, అదరుదైన ఖనిజాల కోసంమే ట్రంప్ ఈ కుట్రకు తెరదీశాడని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఒక కార్యక్రమంలో మదురో మాట్లాడుతూ.. ‘‘దమ్ముంటే, నన్ను పట్టుకెళ్లండి’’ అంటూ ట్రంప్‌కు సవాల్ చేశారు. దీని తర్వాతే, అమెరికా వెనిజులా రాజధాని కారకస్‌పై దాడులు చేసి మదురోను బంధించింది. అయితే, ఇప్పుడు మరో దేశాధినేత కూడా ట్రంప్‌ను సవాల్ చేస్తున్నాడు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సోమవారం అమెరికా ఆపరేషన్‌ను తీవ్రంగా ఖండించారు. ఒక ప్రకటనలో ‘‘ నన్ను వచ్చి పట్టుకోండి. నేను ఇక్కడే మీ కోసం వేచి ఉన్నాను’’ అని అన్నారు. “ఒకవేళ వారు [అమెరికా] బాంబులు వేస్తే, రైతులు పర్వతాలలో వేలాది మంది గెరిల్లాలగా మారతారు. మరియు దేశంలో అధిక భాగం ప్రేమించే మరియు గౌరవించే అధ్యక్షుడిని వారు నిర్బంధిస్తే, వారు ప్రజల ‘జాగ్వార్’ను విడిచినట్లే అవుతుంది’’ అని హెచ్చరించారు. 1990లలో నిరాయుధీకరణకు ముందు వామపక్ష గెరిల్లాగా ఉన్న పెట్రో మాట్లాడుతూ.. ‘‘నేను మళ్లీ ఆయుధం ముట్టుకోనని ప్రమాణం చేశాను. కానీ మాతృభూమి కోసం నేను మళ్లీ ఆయుధాలు పట్టుకుంటాను’’ అని అన్నారు.
2 నిమిషాల్లో రూ.162 కోట్లు పోగొట్టుకున్న బిలియనీర్.. మార్కెట్‌ను ముంచిన ట్రెంట్ షేర్లు
స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ రెడ్ జోన్‌లో ఉన్నాయి. ఈ రోజు మార్కెట్ ప్రారంభమైన వెంటనే ట్రెంట్ షేర్లు కుప్పకూలాయి. ఈ స్టాక్ ధరలు అకస్మాత్తుగా 8% కంటే ఎక్కువ పడిపోయాయి. దీంతో ప్రముఖ పెట్టుబడిదారు రాధా కిషన్ దమాని కేవలం రెండు నిమిషాల్లో రూ.162 కోట్లు కోల్పోయి అతిపెద్ద దెబ్బను చవిచూశారు. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం. మంగళవారం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే ట్రెంట్ షేర్లు 8% కంటే ఎక్కువ పడిపోయాయి. ట్రెంట్ స్టాక్ అనేది టాటా గ్రూప్ రిటైల్ యూనిట్, ఇది మంగళవారం మార్కెట్ స్టార్ట్ అయిన కొద్ది నిమిషాల్లోనే భారీ అమ్మకాలను చవిచూసింది. NSE డేటాను పరిశీలిస్తే, ట్రెంట్ లిమిటెడ్ షేరు ఈ రోజు రూ.4208 వద్ద ప్రారంభమైంది, దాని మునుపటి ముగింపు ధర రూ.4417 నుంచి గణనీయంగా పడిపోయింది, ఆపై అకస్మాత్తుగా రూ.4060కి పతనం అయ్యింది. ట్రేడింగ్ ప్రారంభమైన రెండు నిమిషాల్లో ఇది 8.35% పతనం అయ్యింది. ఈ షేరు పతనం కారణంగా, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పడిపోయింది.
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విప్రో.. ఒక్క గంట తక్కువైనా..
అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల వర్క్ పాలసీని కఠినతరం చేస్తున్నాయి. తాజాగా విప్రో కూడా తన ఉద్యోగులకు ‘‘హైబ్రీడ్ వర్క్ పాలసీ’’ని మరింత కఠినతరం చేసింది. ఇకపై ఉద్యోగులు ఆఫీసుకు వచ్చే రోజుల్లో, కనీసం 6 గంటలు ఖచ్చితంగా ఆఫీస్‌లో ఉండాలని ఆదేశించింది. ఉద్యోగులు 3 రోజులు ఆఫీసుకు, మరో మూడు రోజులు ‘‘వర్క్ ఫ్రం హోమ్’’ను విప్రో ఇప్పటికే అమలు చేస్తోంది. ఆఫీస్‌లో ఉండే రోజుల్లో ‘‘ఇన్’’ నుంచి ‘‘అవుట్’’ వరకు 6 గంటలు ఆఫీస్‌లోనే ఉండాలి, మొత్తంగా 9 9.5 గంటలు పని చేయాలి. ఇందులో మూడు గంటలు ఇంటి నుంచి పని చేయవచ్చు. 6 గంటల కన్నా తక్కువ ఆఫీస్‌లో ఉంటే హాఫ్ డే లీవ్ కట్ చేసే అవకాశం ఉంది. కొత్త పాలసీ జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చింది. ఈ నిర్ణయాన్ని హెచ్‌ఆర్ టీం ఇప్పటికే ఉద్యోగులకు ఈమెయిళ్ల ద్వారా తెలియజేసింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ను ఎవరైనా ఉద్యోగి విఫలమైతే, అది వారి లీవ్స్‌పై ప్రభావం చూపించవచ్చు. ఉద్యోగికి అనారోగ్యానికి గురైనప్పుడు గరిష్టంగా 15 రోజుల వరకు, అలాగే కుటుంబ సంరక్షణకు మరో 15 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం ఉండేది. అయితే, జనవరి 1 నుంచి మాత్రం ఈ సౌలభ్యాన్ని విప్రో తగ్గించింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఏడాదికి రిమోట్ వర్క్ డేస్‌ను 15 రోజుల నుంచి 12 రోజులకు తగ్గించింది. ఫ్యూచర్ హైబ్రీడ్ వర్క్‌దే అని విప్రో చెబుతున్నప్పటికీ, దీనిని క్రమబద్ధంగా అమలు చేయడానికి మార్పులు చేసినట్లు చెప్పింది.
దురంధర్ రికార్డులను ‘రాజా సాబ్’ బద్దలు కొడతాడా..?
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ దురంధర్ ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదల ప్రారంభంలో కొంతమేర మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఆల్‌టైం టాప్ ఇండియన్ చిత్రాల జాబితాలోకి చేరే దిశగా దూసుకుపోతోంది. నాలుగు వారాలు గడిచినా కూడా ఉత్తర భారత మార్కెట్‌లో దురంధర్ జోరు ఏమాత్రం తగ్గలేదు. పెద్ద సినిమాలు లైన్‌లో లేకపోవడంతో, ఈ చిత్రం ప్రతిరోజూ డబుల్ డిజిట్ కలెక్షన్స్‌తో నిలకడగా రాణిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఇదే స్పీడ్ కొనసాగితే టాప్ ఫైవ్ ఇండియన్ మూవీస్ లిస్ట్‌లోకి దురంధర్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు సినీ ట్రేడ్ సర్కిల్స్‌లో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దురంధర్ వసూళ్లకు బ్రేక్ వేసే సత్తా ప్రస్తుతం ఒక్క ప్రభాస్ సినిమాకే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా హారర్ థ్రిల్లర్ ది రాజా సాబ్ జనవరిలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఉత్తర భారతదేశంలో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి, సాలార్ వంటి చిత్రాల తర్వాత నార్త్ మార్కెట్‌లో ఆయనకు తిరుగులేని స్టార్ డమ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ కు భారీ ఓపెనింగ్స్ రావడం దాదాపు ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్
పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినీ పరిశ్రమలో కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఆ పేరే ఓ ప్రభంజనం. ఆయన నటనలో ఉండే వేగం, స్టైల్‌లో ఉండే మేనరిజమ్స్ అన్నింటికి అసంఖ్యాక ఫాన్స్ ఉన్నారు. అలాగే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలం విరామం తర్వాత, జనవరి 7, 2026న పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఒక “కొత్త దశ” ప్రారంభం కాబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ సోషల్ మీడియా అకౌంట్ లో ప్రత్యేక్షమైన ఒక వీడియో ఫ్యాన్స్ మామూలు సర్‌ప్రైజ్ చేయదు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ రోజు ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో, జపాన్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక ఎర్రటి సూర్యుడు, దానికి రెండు వైపులా జపాన్‌లో రాసిన అక్షరాలు, చివర్లో కటానా కత్తి ఒరలో పెడుతున్న పీకే అనే అక్షరాలు కలిగిన టీషర్ట్‌ను ధరించిన వ్యక్తి(పవన్ కళ్యాణ్ కావచ్చు) కనిపిస్తున్నారు. ఇది కేవలం ఒక సినిమా గురించి అనౌన్స్ మెంట్ మాత్రమే కాదు, యుద్ధ విద్యల పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న మక్కువను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారని తాజాగా రిలీజ్ అయిన వీడియో చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. చివర్లో పవన్ కళ్యాణ్ తన కెరీర్ స్టార్టింగ్‌లో ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నప్పటి ఫోటో కనిపిస్తుంది.