కోడిని కోసినా కేసులు పెడుతున్నారు.. కూటమికి వినాశనం తప్పదు..!
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కోడిని కోసినా కేసులు పెట్టే పరిస్థితి నెలకొందని, ఈ విధమైన పాలనతో కూటమికి వినాశనం తప్పదని ఆయన హెచ్చరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లు గడిచినా రాష్ట్ర పరిస్థితి మారలేదని అన్నారు. ప్రభుత్వం ప్రజలను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తోందని ఆరోపించారు. రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అమరావతిలో ఏదో జరుగుతోందన్న ప్రచారం మాత్రమే చేస్తున్నారని, కోట్లకు కోట్లు అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణం అంటున్నారని అన్నారు. రాజధాని కోసం తొలి విడతలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, రిటర్నబుల్ ప్లాట్ల వ్యవహారం ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉందని చెప్పారు. రెండో విడత రాజధాని కోసం 1.75 లక్షల ఎకరాలు కావాలంటూ ఎవరి భూములను నాశనం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మీరు చేసిన పరేడ్‌లో అప్పుడెప్పుడో కట్టిన క్వార్టర్స్ చూపిస్తున్నారని, కంప చెట్లు కొట్టేందుకు కూడా కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు కేతిరెడ్డి… పనుల పేరుతో పర్సంటేజీలు తీసుకుంటున్నారని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్న ప్రభుత్వం వాటికి సంబంధించిన డేటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులపై చూపుతున్న శ్రద్ధ అభివృద్ధిపై చూపడం లేదని మండిపడ్డారు. ప్రజలు మోసపోయారని, సూపర్ సిక్స్ హామీల వాస్తవాలు ఇప్పుడు బయటపడుతున్నాయని చెప్పారు. లేచిన దగ్గర నుంచి తమ నాయకుడు జగన్‌పై, తమపై పడుతూ ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక, దావోస్ వెళ్లి ఏమి తెచ్చారో చెప్పలేదని, పరిపాలన, లా అండ్ ఆర్డర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు ప్రతీదీ గమనిస్తున్నారని, అన్ని రంగాల్లో భయం, నిస్సహాయత నెలకొందని అన్నారు.
మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్.. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు, మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్‌లో పేర్ని నానిపై BNS సెక్షన్లు 196(1), 353(2), 351(2), 352 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, రెండు రోజుల క్రితం ఏలూరు జిల్లా చాట్రాయిలో నిర్వహించిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పేర్ని నాని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు ప్రజాప్రతినిధుల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. పేర్ని నాని వ్యాఖ్యలు చట్టపరంగా నేర పరిధిలోకి వస్తాయా అనే అంశంపై విచారణ కొనసాగుతోందని సమాచారం. ఈ కేసు నమోదు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అధికారులపై బొత్స సత్యనారాయణ సీరియస్.. నా పేరే తొలగిస్తారా..?
విశాఖ జిల్లా అధికారుల తీరుపై వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్) ఎక్స్ ఆఫిషియో జాబితా నుంచి తన పేరును తొలగించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గీతం భూముల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో, పాలకవర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించి తన పేరును ఎక్స్ ఆఫిషియో సభ్యుల జాబితా నుంచి తొలగించిందని బొత్స ఆరోపించారు. ఈ విషయమై “వాటీజ్ దిస్ నాన్సెన్స్” అంటూ అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, తాను ఇప్పటికే ఐదు నుంచి ఆరు సార్లు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యానని గుర్తు చేశారు. అయితే, రేపు జరిగే సమావేశానికి రావడానికి వీల్లేదని అధికారులు చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు ఓటు వేస్తేనే నేను ఎమ్మెల్సీగా గెలిచాను. అలాంటి నన్ను ఎక్స్ ఆఫిషియో జాబితా నుంచి తొలగించడం ఏమిటి? అంటూ ప్రశ్నించారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే, పరిశీలించి చెబుతాం అని సమాధానం ఇవ్వడమేంటని మండిపడ్డారు. నాన్సెన్స్‌ని కూడా పరిశీలిస్తామని చెప్పడమేంటి? అంటూ అధికారుల సమాధానాన్ని బొత్స తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తూ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే, ఈ వ్యవహారం విశాఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సింగరేణితో ఫుట్‌బాల్ ఆడుతున్నారు..
సింగరేణి సంస్థలో జరుగుతున్న టెండర్ల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతను పక్కన పెట్టి, తన సొంత బంధువులకు , అనుకూలమైన కాంట్రాక్టర్లకు మేలు చేసేలా నిబంధనలను మార్చిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా సంస్థకు చెందిన నిధులను పక్కదారి పట్టిస్తూ, బొగ్గు గనుల టెండర్లలో వేల కోట్ల రూపాయల స్కామ్‌కు తెరలేపారని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. తెలంగాణ జీవనాడి అయిన సింగరేణి సంస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఆటవస్తువులా మార్చుకుందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటిస్తూ తాను కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పుకుంటున్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణికి సంబంధించిన సుమారు 10 కోట్ల రూపాయల నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఫుట్బాల్ క్రీడల కోసం దుర్వినియోగం చేశారని, ఇది సంస్థకు తీరని అన్యాయం చేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వినోదం కోసం సంస్థ నిధులను వాడుకుంటూ, కార్మికుల కష్టార్జితాన్ని పక్కదారి పట్టిస్తున్నారని, రాష్ట్ర ప్రజలతో ప్రభుత్వం ఫుట్బాల్ ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరప్ తో ఒప్పందం.. ఏ కార్లు చౌకగా మారతాయి?
భారత్- యూరప్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. అనేక రంగాలలో దిగుమతి సుంకాలు తగ్గనున్నాయి. EU, భారత్ మధ్య ఈ ఒప్పందం ఆటోమొబైల్ రంగానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. భారతదేశంలోని అనేక యూరోపియన్ ఆటోమేకర్ల నుండి కార్లను కొనుగోలు చేయడంతో డబ్బు ఆదా కానుంది. చాలా ఆటోమొబైల్ కంపెనీలు భారతదేశంలో వాహనాలను విక్రయిస్తున్నాయి. వీటిలో చాలా వరకు యూరోపియన్ దేశాలలో ఉన్నాయి. EU- భారతదేశం మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో, ఈ కంపెనీల నుండి హై-ఎండ్ కార్లను కొనుగోలు చేయడం ఇప్పుడు సులభం అవుతుంది. భారతదేశంలో వాహనాలను విక్రయించే ప్రధాన యూరోపియన్ వాహన తయారీదారులలో స్కోడా, వోక్స్‌వ్యాగన్, రెనాల్ట్, సిట్రోయెన్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, BMW, పోర్స్చే, లంబోర్గిని, ఫెరారీ, వోల్వో ఉన్నాయి. స్కోడా చెక్ రిపబ్లిక్ నుండి వచ్చింది. వోక్స్‌వ్యాగన్, ఆడి, మెర్సిడెస్-బెంజ్, BMW, పోర్స్చే ప్రధానంగా జర్మనీకి చెందినవి. వోల్వో స్వీడన్‌కు చెందినది. లంబోర్గిని, ఫెరారీ ఇటలీకి చెందినవి. రెనాల్ట్, సిట్రోయెన్ ఫ్రెంచ్ ఆటోమేకర్లు.
ఈ ఏజ్ దాటితే.. గర్భధారణ సమయంలో గుండెపోటు.. షాకింగ్..
ఏ వయస్సులో జరగాల్సినవి.. ఆ వయస్సులోనే జరగాలని పెద్దలు చెబుతుంటారు.. ఇక, గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలో ఎంతో సున్నితమైన, శారీరకంగా-మానసికంగా కఠినమైన దశ. ఒకప్పుడు గర్భిణీ స్త్రీలు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వారికి గుండెపోటు రావడం చాలా అరుదు అన్న నమ్మకం ఉండేది. కానీ తాజా వైద్య గణాంకాలు ఆ నమ్మకాన్ని పూర్తిగా తప్పుబడుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా గర్భధారణ సమయంలో గుండెపోటు మరియు ఇతర గుండె సంబంధిత సమస్యల కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాతీయ మీడియా కథనం ప్రకారం, 2023 గణాంకాల ఆధారంగా భారత్‌లో ప్రతి 1 లక్ష మంది మహిళల్లో సుమారు 88 మంది గర్భధారణ లేదా ప్రసవ సమస్యల కారణంగా మరణిస్తున్నారు. వార్షికంగా ఈ సంఖ్య దాదాపు 22,500 వరకు చేరుతోంది. ప్రసవించే ప్రతి లక్ష మంది మహిళల్లో సుమారు 3 మంది తీవ్రమైన గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్)కు గురవుతున్నారని అంచనా. సంఖ్య తక్కువగా కనిపించినా, గతంలో ఇటువంటి కేసులు దాదాపు లేనందున ఇది వైద్య నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది అదేవిధంగా, ప్రతి 100 మంది గర్భిణీ స్త్రీలలో 1 నుంచి 4 మంది వరకు గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు, అంటే ఇది ఇకపై అరుదైన సమస్య కాదు.
ఫోల్డబుల్ ఇల్లు వచ్చేశాయ్.. 4 గంటల్లోనే మీ సొంత ఇల్లు రెడీ!
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే మాటలను మనం ఇప్పటికీ తరచుగా వింటూ ఉంటాం. ఎందుకంటే ఇల్లు, పెళ్లి అనేది జీవితాంతం ఉండేవి కాబట్టి, చాలా జాగ్రత్తగా, ఎలాంటి తప్పులు లేకుండా చూసుకుంటారు. నిజానికి ఇండియాలో ఈ రోజుకు కూడా ఇల్లు కట్టడం అనేది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. డిజైన్, సామగ్రి, పని వాళ్లు, వాతావరణం అన్నీ కూడా ఇల్లు కట్టే సమయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో, షార్క్ ట్యాంక్ ఇండియా కొత్త సీజన్‌లో అప్రియర్ బిల్డ్ అనే స్టార్టప్ కనిపించింది. భారతదేశంలో అలాంటి స్టార్టప్‌లు ఎక్కువగా లేనప్పటికీ, గంటల్లో ఇళ్లను నిర్మించగల కంపెనీలు యూరప్, యుఎస్‌లలో పుష్కలంగా ఉన్నాయి. అప్రియర్ బిల్డ్ ఈ కంపెనీ మోడల్ మాడ్యులర్ నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. దీని అర్థం ఇంటిలోని గోడలు, అంతస్తులు, పైకప్పులు, వైరింగ్, ప్లంబింగ్ వంటి భాగాలను ఫ్యాక్టరీలో తయారు చేసి, ఆ తర్వాత ఇంటిని నిర్మించే సైట్‌కు తీసుకువచ్చి అసెంబుల్ చేస్తారు. కేవలం 4 గంటల్లోనే ఒక ప్రామాణిక యూనిట్‌ను ఆన్-సైట్‌లో ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇలా కట్టిన ఇల్లు డిజైన్ పరంగా, నాణ్యత పరంగా దృఢంగా కనిపిస్తుంది. ఈ ఇంటిని 30-40 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించవచ్చని సదరు కంపెనీ పేర్కొంది.
పరువు నష్టం దావా వేసిన స్మృతి మంధాన ఎక్స్ లవర్.. !
మరాఠీ నటుడు – నిర్మాత విజ్ఞాన్ మానేపై ప్రముఖ బాలీవుడ్ సంగీతకారుడు, చిత్ర నిర్మాత పలాష్ ముచ్చల్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మంగళవారం ఈ కేసు విచారణ జరిగిన ముంబైలోని అంధేరి కోర్టుకు పలాష్ తన న్యాయవాది శ్రేయాన్ష్ మిఠారేతో కలిసి వచ్చారు. పలాష్ పై విజ్ఞాన్ మానే తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. సినిమా పెట్టుబడి పేరుతో పలాష్ తనకు రూ.40 లక్షలు మోసం చేశాడని మానే ఆరోపించారు. అలాగే క్రికెటర్ స్మృతి మంధానతో పలాష్ సంబంధం గురించి కూడా ఆయన పలు ఆరోపణలు చేశారు. స్మృతి తండ్రి ద్వారా తనకు పలాష్ పరిచయం అయ్యాడని, ఆ తర్వాత తన దగ్గరి నుంచి సినిమా పెట్టుబడి పేరుతో రూ.40 లక్షలు తీసుకున్నాడని, కానీ తిరిగి ఇవ్వలేదని మానే చెప్పారు. స్మృతి – పలాష్ పెళ్లి రోజున పలాష్ మరొక మహిళతో పట్టుబడ్డాడని, అందుకనే స్మృతితో తన వివాహం ఆగిపోయిందని కూడా మానే పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై మహారాష్ట్రలోని సాంగ్లిలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే దీనిపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని, దురుద్దేశంతో కూడుకున్నవని పలాష్ పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా విజ్ఞాన్ మానేకు రూ.10 కోట్ల పరువు నష్టం నోటీసు పంపానని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలాష్ మాట్లాడుతూ.. తన ఇమేజ్, కెరీర్‌కు హాని కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా ఈ నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ఇదే టైంలో విజ్ఞాన్ కూడా తనకు నోటీసు అందినట్లు ధృవీకరించారు. పలాష్ – స్మృతి మంధానల వివాహం రద్దు అయిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. స్మృతి మంధాన – పలాష్ ల వివాహం రద్దు అయిన సంగతి తెలిసిందే. నిజానికి వాళ్లిద్దరూ చాలా కాలం ప్రేమలో ఉన్నారు. పెద్దల అనుమతితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ పలు కారణాలతో వారి పెళ్లి రద్దు అయ్యింది.
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఐసీసీ.. దెబ్బ అదుర్స్ కదూ!
2026 T20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు బయటికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇండియాలో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడటానికి భద్రతా కారణాలను సాకుగా చూపిన బంగ్లాదేశ్.. ఏకంగా టోర్నీ నుంచే దూరం అయిన సంగతి తెలిసిందే. ఇదే కారణాలను చూపి ఇప్పుడు ICC బంగ్లా స్పోర్ట్స్ జర్నలిస్టులను కూడా టోర్నీ నుంచి నిషేధించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. టోర్నమెంట్‌ను కవర్ చేయడానికి బంగ్లాదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టులకు గుర్తింపు ఇవ్వడానికి ICC నిరాకరించింది. ఇది కేవలం భారతదేశంలో జరిగే మ్యాచ్‌లకే పరిమితం కాదు, శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లను కూడా కవర్ చేయకుండా బంగ్లాదేశ్ జర్నలిస్టులను ICC బ్యాన్ చేసింది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఐసీసీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. భారతదేశం-శ్రీలంక మ్యాచ్ కవరేజ్ కోసం బంగ్లాదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఇవ్వడానికి ఐసిసి నిరాకరించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. గతంలో బంగ్లాదేశ్ జట్టు భారతదేశంలో మ్యాచ్‌లు ఆడకూడదని పట్టుబట్టడంతో ICC ఆ జట్టును టోర్నమెంట్ నుంచి బహిష్కరించింది. ఈ మెగా టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
శ్రీ లీల నోటి మహిమ.. రాజేంద్రప్రసాద్’కి పద్మ శ్రీ
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి సినిమా రంగం పరంగా రాజేంద్రప్రసాద్‌తో పాటు మురళీమోహన్‌కు పద్మశ్రీ ప్రకటించారు. అయితే, రాజేంద్రప్రసాద్ పద్మశ్రీ వెనుక ఒక ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి పద్మ అవార్డులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజేంద్రప్రసాద్ పేరును సిఫార్సు చేయగా, ఆయనకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. అయితే, ఈ మధ్యకాలంలో నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ‘రాబిన్ హుడ్’ సినిమాలో రాజేంద్రప్రసాద్ నటించారు. ఆ సినిమాలో శ్రీలీల సెక్యూరిటీ చీఫ్‌గా ఆయన ఒక పాత్రలో నటించారు. ఈ క్రమంలోనే ఒక సన్నివేశంలో శ్రీలీల.. “ఈయన చాలా టాలెంటెడ్ గా ఉన్నారు, ఆయన పేరు నోట్ చేసుకో.. ఈసారి ఏం చేసినా సరే ఆయనకు పద్మ శ్రీ అవార్డు ఇప్పిద్దాం” అంటూ కామెంట్ చేసింది. ఇదే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల రాజేంద్రప్రసాద్‌కి విషెస్ చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ అంశం మరోసారి వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి: విశ్వక్‌సేన్
కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రగ్‌గా మారిన డైరెక్టర్ కె.వి.అనుదీప్, విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతూ, టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సూపర్ బజ్ నెలకొంది. ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో హీరో విశ్వక్‌సేన్, హీరోయిన్ కయాదు లోహర్, డైరెక్టర్ అనుదీప్ కె.వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని అన్నారు. వాటిని చిత్రీకరించే టైంలో హీరోహీరోయిన్ల కంటే ఎక్కువగా డైరెక్టర్ అనుదీప్ ఇబ్బంది పడ్డారని సరదాగా ఆటపట్టించారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు కె.వి. అనుదీప్ ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి రడీ అవుతున్నారు. ‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన, మరోసారి విభిన్నమైన కథాంశం, కట్టిపడేసే హాస్యంతో ప్రేక్షకుల మనసు దోచుకోడానికి సిద్ధం అవుతున్నారు. ‘ఫంకీ’ మూవీలో విశ్వక్ సేన్ సినీ దర్శకుడి రోల్ ప్లే చేస్తుండటం విశేషం. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.