Case Filed on Perni Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు, మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్‌లో పేర్ని నానిపై BNS సెక్షన్లు 196(1), 353(2), 351(2), 352 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: KTR : సింగరేణితో ఫుట్‌బాల్ ఆడుతున్నారు..
అయితే, రెండు రోజుల క్రితం ఏలూరు జిల్లా చాట్రాయిలో నిర్వహించిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పేర్ని నాని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు ప్రజాప్రతినిధుల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. పేర్ని నాని వ్యాఖ్యలు చట్టపరంగా నేర పరిధిలోకి వస్తాయా అనే అంశంపై విచారణ కొనసాగుతోందని సమాచారం. ఈ కేసు నమోదు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.