ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, సంక్షేమ పథకాలు మరియు ప్రజా ప్రయోజన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే ఈ సర్వే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమగ్ర కుటుంబ సర్వేను ప్రత్యేక మొబైల్ యాప్ సహాయంతో నిర్వహించనున్నారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, నివాస పరిస్థితులు, ఆదాయం, ఉపాధి, విద్య, ఆరోగ్య సమాచారం వంటి అంశాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. సర్వే ద్వారా సేకరించిన డేటాను ఆధారంగా చేసుకుని అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించనున్నారు. అలాగే ప్రభుత్వ విభాగాలు అమలు చేస్తున్న ప్రజా సేవల ప్రభావాన్ని అంచనా వేసేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయ్యాక, డేటా ధృవీకరణ ప్రక్రియ చేపట్టి, భవిష్యత్‌లో విధాన నిర్ణయాలకు ఈ సమాచారాన్ని కీలకంగా ఉపయోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సంక్షేమ పాలన మరింత బలోపేతం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇచ్చిన మాట కోసం ఇప్పటం పర్యటనకు పవన్ కల్యాణ్.. తాజా షెడ్యూల్ ఇదే..
జనసేన చీఫ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇప్పటం పర్యటన ఖరారు అయ్యింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ రోజు అంటే మంగళవారం.. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామానికి పవన్ కల్యాణ్ వెళ్లాల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. అయితే, పవన్ కల్యాణ్ ఇప్పటం పర్యటన ఖరారు చేశారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు అనగా బుధవారం రోజు ఉదయం 11 గంటలకు మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామాన్ని సందర్శించనున్నారు. 2022లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో.. రోడ్ల వైండింగ్ పేరుతో ఇప్పటం గ్రామంలో పలువురు పేదల ఇళ్లను కూల్చివేయగా, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న పవన్ కల్యాణ్ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అయితే, ఆ సమయంలో పవన్ కల్యాణ్‌ను చూసి ‘నువ్వు నా కుమారుడివే’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఇండ్ల నాగేశ్వరమ్మను అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మళ్లీ వచ్చి కలుస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, రేపు స్వయంగా ఇండ్ల నాగేశ్వరమ్మను కలవనున్నారని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన రాజకీయంగా కాకుండా మానవీయ కోణంలో ప్రాధాన్యం సంతరించుకుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, ఇప్పటం గ్రామంలోని ఇండ్ల నాగేశ్వరమ్మను పవన్ కల్యాణ్ ఈ రోజు కలవాల్సి ఉంది.. కానీ, ఈ పర్యటన అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన వాయిదా పడడంతో.. రేపు పవన్ కల్యాణ్.. ఇప్పటం వస్తున్నారంటూ తాజాగా ప్రకటించాయి జనసేన పార్టీ వర్గాలు..
పవన్ కల్యాణ్‌పై అంబటి సెటైర్లు.. ఆయనది ఓపెనింగ్‌లో ఓవర్ యాక్షన్.. ఇంటర్వెల్లో డల్.. చివరిలో కన్ఫ్యూజ్..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవర్తనపై వ్యంగ్యంగా స్పందిస్తూ, ఆయనది ఓపెనింగ్‌లో ఓవర్ యాక్షన్, ఇంటర్వెల్లో డల్, చివరిలో కన్ఫ్యూజన్ అంటూ విమర్శించారు. పవన్ కల్యాణ్‌లో ఎవరినో బెదిరించాలనే భావన కనిపిస్తోందని అంబటి ఆరోపించారు. పవన్‌ను ఎవరైనా విమర్శించారా? లేక వైసీపీపై ఎందుకు దూషణలు చేస్తున్నారని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంగా మార్చి వారి జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు అంబటి. ఈ అంశాన్ని ప్రజలకు తెలియజేయడానికి వైసీపీ కోటి సంతకాలు సేకరించిందని తెలిపారు. మెడికల్ కాలేజీల స్కాంలో బాగస్వామ్యం ఉంటే జైలుకు పంపుతామని వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారని అంబటి గుర్తు చేశారు. ఈ స్కాంల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు.
బీజేపీ లేదా జనసేనలో చేరతారంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన బుట్టా రేణుక
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారం పోయి.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, ఇక కిందిస్థాయి ప్రజాప్రతినిధులు ఎంతో మంది.. వైసీపీకి రాజీనామా చేసి కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలో చేరిపోయారు.. మరోవైపు, మరికొందరు కీలక నేతలపై కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ బుట్టా రేణుక కూడా వైసీపీకి గుడ్‌బై చెబుతారని.. జనసేన లేదా బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతుండగా.. తనపై జరుగుతున్న రాజకీయ ప్రచారంపై తీవ్రంగా స్పందించారు బుట్టా రేణుక… తాను బీజేపీ లేదా జనసేనలో చేరుతున్నానంటూ కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజల్లో తనకు ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకే ఈ రకమైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని బుట్టా రేణుక మండిపడ్డారు.. తనపై అవాస్తవాలను ప్రచారం చేసిన వారే భవిష్యత్తులో ప్రజల ముందు నవ్వులపాలవుతారని వ్యాఖ్యానించారు. 2019లో తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి ఆశలు, పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేశానని బుట్టా రేణుక తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేశానని స్పష్టం చేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తనకు అపారమైన నమ్మకం ఉందని, ఆయన నాయకత్వంలోనే కొనసాగుతానని బుట్టా రేణుక ప్రకటించారు. జగనన్నను విడిచి వెళ్లాల్సి వస్తే అదే తన రాజకీయ జీవితానికి చివరి రోజే అని కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ వ్యాఖ్యలతో తన పార్టీ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు బుట్టా రేణుక పూర్తిగా తెరదించారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు – ఏపీ డిస్కం మధ్య కుదిరిన ఎంవోయూ
ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లోని వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలతో ఏపీ డిస్కం.. మధ్య ఎంఓయూ కుదిరింది. మున్సిపాల్టీలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ .. చెత్తను విద్యుత్ గా మార్చి సంపద సృష్టిస్తున్నాం అన్నారు. గుంటూరు లో 20 మెగావాట్లు, విశాఖలో 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో మున్సిపాల్టీల్లో ప్రతి రోజూ 7500 మెట్రిక్ టన్నుల వేస్ట్ ఉత్పత్తి అవుతోందని.. నెల్లూరు, కాకినాడ, కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతిలో వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు… నెల్లూరు, కాకినాడ, కడప ,కర్నూలులో విద్యుత్ ఎనర్జీ కేంద్రాలతో డిస్కంల ఒప్పందం జరిగిందన్నారు. త్వరలో విజయవాడ, తిరుపతి లో వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు సురేష్ కుమార్.. చెత్త కుప్పలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. ఇక, గత ప్రభుత్వం చెత్తపైన కూడా పన్నును వసూలు చేసిందన్నారు మంత్రి నారాయణ… వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తను అలాగే ఉంచి పోయిందని.. అక్టోబర్ 2 నాటికల్లా నిల్వ ఉంచిన చెత్తనంతా తొలగించాలని సీఎం ఆదేశించారన్నారు. నారాయణ.. లక్ష్యం కంటే ఎక్కువగానే 93 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను అధికారులు తరలించారని… చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్రంలో 10 ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు నారాయణ.. ప్రస్తుతం.. విశాఖ, గుంటూరులో రెండు కేంద్రాల నుంచి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోందని.. నెల్లూరు, కాకినాడ, కడప , కర్నూలులో విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు.. ఇవాళ నెల్లూరు, కాకినాడ, కడప, కర్నూలులో ప్లాంట్లతో డిస్కంలు ఎంవోయూ చేసుకున్నాయని… రోజూ రాష్ట్రంలో 7500 టన్నుల చెత్త వస్తుండగా.. వాటన్నింటితో విద్యుత్ ఉత్పతి చేస్తాం అన్నారు నారాయణ… మరో రెండేళ్లలోనే మరో 6 కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేస్తామని… మున్సిపార్టీల్లో పీపీపీ విధానంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు… విశాఖ, విజయవాడ, తిరుపతిలో రెండు నెలల్లో ఈ వేస్ట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి నారాయణ..
బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ శాఖకు ‘చీకటి రోజులు’..
తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగంపై గత పదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని ఎండగడుతూ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలనే కనీస చిత్తశుద్ధి లేదని ఆయన ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో తమ వాటాగా ఉన్న 299 టీఎంసీల నీటిలో పాలమూరు-నల్గొండ జిల్లాల ప్రాజెక్టుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏనాడూ గట్టిగా డిమాండ్ చేయలేదని మండిపడ్డారు. పదేళ్ల సుదీర్ఘ పాలనలో బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయిందని, కానీ కాళేశ్వరం పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తే చివరికి మూడు బ్యారేజీలు కూలిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు.
భక్తులకు గమనిక.. రేపు మేడారంలో దర్శనాలు నిలిపివేత.!
మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనానికి సిద్ధమవుతున్న భక్తులకు పూజారుల సంఘం ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. ములుగు జిల్లాలోని ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో రేపు (బుధవారం) ఒక రోజంతా అమ్మవార్ల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం మేడారంలో గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుండటంతో పాటు, భవిష్యత్తులో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గద్దెల విస్తరణ పనులను కూడా వేగవంతంగా చేపడుతున్నారు. ఈ అభివృద్ధి పనులు, ఆధ్యాత్మిక క్రతువుల కారణంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఒక రోజు పాటు దర్శనాలను రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అమ్మవార్ల సేవా కార్యక్రమాలకు, ఆలయ అభివృద్ధి పనులకు భక్తులందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని పూజారుల సంఘం విజ్ఞప్తి చేసింది. రేపటి పనులు ముగిసిన అనంతరం దర్శనాలు యధావిధిగా కొనసాగుతాయని, జాతర పనులు వేగంగా సాగుతున్నందున భక్తులు ఈ అసౌకర్యానికి సహకరించాలని కోరారు.
మధ్యప్రదేశ్‌లో 42.74 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు..
మధ్యప్రదేశ్ ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ సంవత్సరం జాబితాలో గణనీయమైన మార్పులు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 42.74 లక్షల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించారు. రాజధాని భోపాల్‌లో మాత్రమే 4.38 మిలియన్లకు పైగా పేర్లు తొలగించబడ్డాయి. ఓటర్ల జాబితా పూర్తిగా దోషరహితంగా మరియు పారదర్శకంగా ఉండేలా చూసుకోవడానికి ఈ కసరత్తు చేపట్టినట్లు ప్రధాన ఎన్నికల అధికారి (CEO) విలేకరుల సమావేశంలో తెలిపారు. SIR ప్రక్రియ కింద, మొత్తం 57.46 మిలియన్ల ఓటర్లలో 53.131 మిలియన్ల ఓటర్లు తమ ఓట్ల గణనను సమర్పించారు. 31.51 లక్షల మంది ఓటర్లు (5.49%) తమ చిరునామాను మార్చుకున్నారని లేదా చాలా కాలంగా గైర్హాజరయ్యారని CEO పేర్కొన్నారు. 8.46 లక్షల మంది (1.47%) మంది ఓటర్లు మరణం కారణంగా తొలగించబడ్డారు. 2.77 లక్షల మంది (0.48%) మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్నట్లు కనుగొనబడింది . భోపాల్ కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ విడుదల చేసిన డేటా ప్రకారం, SIR కి ముందు, భోపాల్‌లో 21 లక్షల 25 వేల 908 మంది ఓటర్లు ఉన్నారు, అది ఇప్పుడు 16 లక్షల 87 వేల 33 కి తగ్గింది. అసెంబ్లీ ప్రాంతంవారిగా తొలగించిన ఓటర్ల సంఖ్యను చూస్తే.. గోవింద్పుర్లో అత్యధికంగా 97,052 ఓట్లు తొలగించగా.. నరేలాలో 81,235 ఓట్లు, సెంట్రల్ అసెంబ్లీలో 67,304 ఓట్లు, నైరుతిలో 63,432 మంది, నార్త్ అసెంబ్లీలో 51,058 మంది ఓట్లు, బెరాసియాలో 12,903 మంది ఓట్లను తొలగించారు.. అయితే, మీ పేరు జాబితా నుండి తొలగించబడి ఉంటే.. లేదా మీరు కొత్త ఓటరుగా చేర్చుకోవాలనుకుంటే, క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాలకు చివరి తేదీ జనవరి 22, 2026గా ఉంది. అభ్యంతరాలు దాఖలు చేసిన తర్వాత, ధృవీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తుది ఓటరు జాబితా ఫిబ్రవరి 21, 2026న ప్రచురించబడుతుంది అని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
అరుదైన రికార్డుకు ఒక్క పరుగు దూరంలో కింగ్ కోహ్లీ..
పరుగుల మిషన్, కింగ్ కోహ్లీ ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నాడు.. మరో అరుదైన రికార్డుకు కేవలం ఒకే ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు.. విజయ్ హజారే ట్రోఫీకి ఢిల్లీ జట్టులో విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు.. రిషబ్ పంత్ కెప్టెన్సీలో అతను కనీసం రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడట.. ఇక్కడే సరికొత్త రికార్డు రేస్‌లోకి వచ్చాడు కింగ్.. అయితే విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ రికార్డు ఏమిటో తెలుసుకుందాం… ఇప్పటివరకు, విరాట్ కోహ్లీ.. విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరపున 17 మ్యాచ్‌లు ఆడాడు, చివరిసారిగా 2010లో ఆడాడు. ఈ దేశీయ 50 ఓవర్ల టోర్నమెంట్లో అతను 910 పరుగులు చేశాడు, అతని అత్యధిక స్కోరు 124. అతని సగటు 60.66. విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరపున విరాట్ నాలుగు అర్ధ సెంచరీలు మరియు నాలుగు సెంచరీలు చేశాడు. లిస్ట్ ఎ క్రికెట్లో 16,000 పరుగులు చేరుకోవడానికి విరాట్ కోహ్లీ కేవలం ఒక పరుగు దూరంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ భారత బ్యాట్స్‌మన్‌గా అతను నిలిచాడు. ఇప్పటివరకు, విరాట్ 342 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 57.34 సగటుతో 15,999 పరుగులు చేశాడు. దేశవాళీ 50 ఓవర్ల ఫార్మాట్లో అతనికి 57 సెంచరీలు మరియు 84 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాడు .. ఇక, జనవరి 11న ప్రారంభమయ్యే ఇండియా vs. న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు సిద్ధం కావడానికి విజయ్ హజారే ట్రోఫీని ఉపయోగించుకుంటాడని గమనించాలి. ఇటీవలి వన్డేల్లో విరాట్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను తన గత కొన్ని మ్యాచ్‌లలో నాలుగు 50+ స్కోర్లు సాధించాడు, వాటిలో వరుసగా రెండు సెంచరీలు ఉన్నాయి.
రోషన్–నితీష్ కుమార్ రెడ్డి మధ్య ఫన్నీ చిట్‌చాట్.. ‘ఛాంపియన్’ ప్రమోషన్ వీడియో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో మేకా రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ ప్రమోషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతూ, మూవీ టీమ్ తాజాగా ఒక స్పెషల్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో రోషన్ మేకా, భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇద్దరూ ఒకరినొకరు అభినందించుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. నితీష్, రోషన్‌కు సినిమా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలుపగా.. రోషన్ కూడా నితీష్ క్రికెట్ కెరీర్‌కు అభినందనలు తెలిపాడు. “నీ మూవీకి కాంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్” అని నితీష్ చెప్పగా.. సినిమా డిసెంబర్ 24న అమెరికాలో ప్రీమియర్స్, 25న వరల్డ్‌వైడ్ రిలీజ్ అవుతుందని రోషన్ తెలిపాడు. దీనితో నితీష్ సినిమాను కచ్చితంగా చూస్తానన్నాడు.
నటుడు శివాజీకి మహిళా కమిషన్ షాక్.. కేసు నమోదు, విచారణకు హాజరు కావాలని ఆదేశం!
సినీ నటుడు శివాజీ చుట్టూ కొత్త వివాదం అలుముకుంది. ఇటీవలే జరిగిన దండోరా సినిమా వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చట్టపరమైన చిక్కులకు దారితీశాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రసంగించారన్న ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ధండోరా’ సినిమా ఈవెంట్ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని భావించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, దీనిని సుమోటో (Suo Motu) కేసుగా స్వీకరించింది. ప్రాథమిక విచారణ అనంతరం, ఆయన ప్రసంగంలో మహిళల పట్ల అవమానకర ధోరణి ఉందని కమిషన్ నిర్ధారించింది. మహిళా కమిషన్ తన అధికారాలను ఉపయోగించి, తెలంగాణ మహిళా కమిషన్ చట్టం 1998లోని సెక్షన్ 16(1)(b) ప్రకారం ఈ విచారణను ప్రారంభించింది. కేవలం నోటీసులతోనే సరిపెట్టకుండా, ఈ వ్యవహారాన్ని లోతుగా విచారించాలని కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే నటుడు శివాజీకి అధికారికంగా నోటీసులు జారీ అయ్యాయి. మహిళా కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం డిసెంబర్ 27వ తేదీన ఉదయం 11:00 గంటలకు హైదరాబాద్‌లోని బుద్ధ భవన్లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయంలో శివాజీ స్వయంగా కమిషన్ ఎదుట హాజరై తన వివరణ ఇచ్చుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, సదరు వ్యాఖ్యలకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలు లేదా వివరణాత్మక పత్రాలను కూడా వెంట తీసుకురావాలని ఆదేశించింది.
సామాన్ల కామెంట్లపై ఎట్టకేలకు వెనక్కి తగ్గిన శివాజీ.. ‘సోషల్ మీడియా సాక్షిగా క్షమాపణలు
నటుడు శివాజీ తాజాగా జరిగిన ‘దండోరా’ సినిమా ఈవెంట్లో, హీరోయిన్లు చీరలు కట్టుకు రావాలని, సామాన్లు కనపడే డ్రస్సులు వేసుకు రావద్దంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం వెంటనే వైరల్ అయింది. ఈ ఉదయం నుంచి అనేకమంది సినీ సెలబ్రిటీలు సైతం శివాజీ మాటలను తప్పుపడుతూ తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, శివాజీ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా ఈ వీడియోని షేర్ చేశారు. శివాజీ మాట్లాడుతూ “ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు ఇబ్బంది పడ్డ కారణంగా నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్తూనే, రెండు అన్‌పార్లమెంటరీ వర్డ్స్ (Unparliamentary words) నేను వాడడం జరిగింది. కచ్చితంగా నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే.. నేను మాట్లాడింది అమ్మాయిలందరిని ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే నీకు ఇబ్బంది ఉండదు ఏమో అమ్మ అనే ఉద్దేశం తప్ప, నేను ఎవరిని అవమానపరచాలని కాదు. కానీ, ఏదైనా రెండు అన్‌పార్లమెంటరీ వర్డ్స్ దొర్లాయి, దానికి నా సిన్సియర్ అపాలజీస్ (Sincere apologies).