‘రేషన్’వార్.. కూటమి వర్సెస్ వైసీపీ..!
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ వాహనాలను తొలగించారు.. ఇంటింటికి తీసుకొచ్చి వాహనాల్లో రేషన్ ఇవ్వడం వల్ల ఆర్థికంగా నష్టం వస్తుందని కూటమి ప్రభుత్వం వీటిని తొలగించింది.. వీటి స్థానంలో రేషన్ షాపులోనే ఇకనుంచి రేషన్ ఇవ్వనున్నారు. ప్రతి నెల 15 రోజులు పాటు రేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు.. దివ్యాంగులకు ఇంటి వద్దకు తెచ్చి ప్రతి నెల 5వ తేదీ లోపు రేషన్ అందిస్తారు.. ఇకనుంచి రేషన్ దుకాణాలను రేషన్ మాల్స్ గా మార్చి మిగిలిన వస్తువులు కూడా అందించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.. గత ప్రభుత్వం పై పౌర సఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రమైన విమర్శలు చేశారు.. గత ప్రభుత్వం రేషన్ వాహనాలను ఉపయోగించడం వల్ల 1700 కోట్లకు పైగా నష్టం వచ్చింది అన్నారు.. అదే విధంగా రేషన్ వాహనాల్లో మాఫియా వల్ల అక్రమ బియ్యం తరలింపు ఆస్కారం కలిగిందన్నారు.. రేషన్ వాహనాలు ఎప్పుడు వచ్చేవో కూడా తెలిసేది కాదన్నారు.. ఏదో ఒక మూల వాహనాన్ని పెట్టి కొంతమందికి రేషన్ ఇచ్చి వెళ్లిపోయే వారిని విమర్శలు చేశారు.. దీంతో ఖజానాకు నష్టం కాకుండా అక్రమ బియ్యం తరలింపు అస్కారాలు ఏర్పడింది అన్నారు నాదెండ్ల మనోహర్.
టీడీపీ నేత దారుణ హత్య.. ముక్కలుగా నరికి బోరుబావిలో వేసి..!
ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో రాజకీయ హత్యలు జరుగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలు జిల్లాలో పలు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు.. తాజాగా, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు.. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. తాతా హోటల్ పక్కన జంపాలవారిపాలెంలో టీడీపీ నేత తోపూరి నరసింహం అనే వ్యక్తిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు బ్రహ్మయ్య అనే వ్యక్తి.. అంతటితో ఆగకుండా.. రెండు రోజులు నరసింహం మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో వేశాడు.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే, నరసింహం నిమ్మతోట దగ్గర కాపలాదారుడిగా పనిచేస్తున్నాడట బ్రహ్మయ్య.. ఏ విషయంలో ఆ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది.. నరసింహంను అంత దారుణంగా ఎందుకు హత్య చేశాడు లాంటి విషయాలు తెలియాల్సి ఉండగా.. నరసింహం కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. బోరుబావి దగ్గరకు వెళ్లి ఆధారాలను సేకరించే పనిలోపడిపోయారు.. అయితే, ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది..
కూటమి పాలనకు ఏడాది.. సంక్రాంతి – దీపావళి కలబోసిన జనసేన వేడుక..
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పాలనకి ఏడాది పూర్తవడంతో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించనుంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన ఏడాది ఉత్సవాలు చేస్తోంది జనసేన. సుపరిపాలన ప్రారంభమై ఏడాది.. పీడ విరగడై ఏడాది అంటూ, ఈ నెల 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకోవాలని జనసేన నిర్ణయించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపుతో జనసేన కూటమి ప్రభుత్వానికి ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తోంది. జనసేన నేతలు, శ్రేణులు తమ వాకిళ్లను రంగవల్లులతో అలంకరించాలనీ, ముగ్గుల పోటీలు నిర్వహించాలనీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి దిశానిర్దేశం అందింది. దీంతోపాటు సాయంత్రం దీపావళి తరహాలో దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చాలని సూచించారు. ఈ వేడుకలన్నింటినీ సోషల్ మీడియాలో పోస్టులు రూపంలో ప్రదర్శించాలని పార్టీ కోరుతోంది. ఈ సందర్భంగా డిజిటల్ క్యాంపెయిన్‌కి కూడా జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
కువైట్ నుంచి వచ్చాడు అల్లుడిని హతమార్చాడు..! షాకింగ్ స్టోరీ..
కువైట్ నుంచి వచ్చాడు అల్లుడ్ని హతమార్చాడు ఓ వ్యక్తి.. తన కుమార్తెను వేధిస్తున్న అల్లుడిని వేట కొడవలితో విచక్షణ రహితంగా హత్య చేశాడు మహబూబ్ భాషా అనే వ్యక్తి… కడప నగరంలోని అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న చాంద్ బాషా అనే వ్యక్తిని ఓ విందు కార్యక్రమంలో ఉండగా అక్కడి నుండి కాళ్లు చేతులు కట్టేసి కిడ్నాప్ చేసిన మామమహబూబ్ బాషా.. తన ఇంట్లో, మరి కొంతమంది వ్యక్తులతో కలిసి వేట కొడవలితో అతి దారుణంగా హత్య చేశారు.. దీనికి అంతటికీ కారణం.. తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆమెను నానా రకాలుగా వేధింపులకు గురిచేయడమే కారణమని తెలుస్తోంది.. అయితే, ఈ ఘటనలో మరో కోణం కూడా లేకపోలేదు.. నిషేధిత ఉగ్రవాద సంస్థలో గతంలో చాంద్ బాషా స్టూడెంట్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉండే వారని పోలీసులు గుర్తించారు.. ఆర్కే నగర్‌కు చెందిన చాంద్ బాషాకు, అశోక్ నగర్‌లో నివాసం ఉండే మహబూబ్ బాషా కుమార్తె ఆయేషాతో తొమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది… అయితే, అప్పటినుండి తన కుమార్తె ఆయేషాను చాంద్ బాషా వేధిస్తూ ఉండడంతో పలుమార్లు.. వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు, పంచాయతీల పర్వం సాగింది.. ఇక, గత రెండు సంవత్సరాలుగా చాంద్ బాషా భార్యకు దూరంగా ఆర్కే నగర్ లో నివాసం ఉంటూ వచ్చారు.. ఆయేషా తండ్రి తన కుమార్తెకు అల్లుడు చాంద్ బాషా అన్యాయం చేస్తున్నాడని జీర్ణించుకోలేకపోయాడు.. పది రోజుల క్రితం కువైట్ నుంచి వచ్చి అల్లుడి హత్యకు స్కెచ్ వేశాడు.. ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న చాంద్ బాషాను అక్కడి నుంచి రహస్యంగా తీసుకొచ్చి మహబూబ్ బాషా తన ఇంట్లో అతి దారుణంగా వేట కొడవళ్ళతో తలపై విచక్షణ రహితంగా నరికి చంపారు… ఈ ఘటనపై చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…
జ్యోతి మల్హోత్ర, భయ్యా సన్నీ యాదవ్‌ను కలిపి విచారిస్తున్న ఎన్‌ఐఏ..!
వారం రోజులైనా యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ జాడ తెలియలేదు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగగానే యూట్యూబర్ సన్నీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జ్యోతి మల్హోత్ర, సన్నీలను కలిపి ఎన్‌ఐఏ విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే మల్హోత్ర అరెస్టు చేసి జైలుకు పంపారు. వారం రోజులైనా సన్నీ యాదవ్ తమ దగ్గర ఉన్నాడని ఎన్‌ఐఏ చెప్పడం లేదు. పాకిస్థాన్లో వీడియోలు చేసి దుబాయ్ మీదుగా చెన్నైకి చేరుకున్నాడు భయ్యా సన్నీ యాదవ్.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారితో సమావేశమైన వీడియోలు బయటికి వచ్చాయి. ఇతడితో సంబంధాలు ఉన్న వాళ్ళతో సమావేశంపై ఆరా తీస్తోంది ఎన్ఐఏ. కాగా.. రెండ్రోల కిందట సన్నీ యాదవ్ తండ్రి రవీందర్ ఎన్టీవీతో మాట్లాడారు. భయ్యా సన్నీ యాదవ్ ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సన్నీ యాదవ్ స్నేహితుడు చెర్రీని ఇంట్లో 29న గుర్తుతెలియని వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు మా ఇంటికి కూడా వచ్చారన్నారు. కొన్ని పత్రాలు పరిశీలించారని మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. మా అబ్బాయికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవు. సన్నీ యాదవ్ దేశ భక్తుడు.. పాకిస్తాన్ కు కేవలం బైక్ రైడర్ గానే వెళ్ళాడు.. పహల్గాం ఘటనకు ముందే పాకిస్తాన్ టూర్ కంప్లీట్ చేసుకుని వచ్చాడని తెలిపాడు. ఎవరు, ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్తే.. నేను కూడా వారికి సహాకరిస్తానని తెలిపాడు. మా అబ్బాయి ఆచూకీ చెప్పాలి. లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపాడు.
కరెన్సీ నోట్లపై నుంచి “జాతిపిత” ఫోటోని తీసేసిన యూనస్ సర్కార్..
బంగ్లాదేశ్ నెమ్మదిగా తన చరిత్రను మరిచిపోతోంది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం సాధించడానికి కారణమైన షేక్ ముజిబుర్ రెహమాన్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్యల్లో భాగంగానే బంగ్లాదేశ్ తన కరెన్సీ నోట్లపై జాతిపితగా పేరుగాంచిన ముజిబుర్ రెహమాన్ ఫోటోని తీసేస్తున్నారు. గతేడాది హింసాత్మక విద్యార్థి ఉద్యమంలో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్‌ని బంగ్లా ప్రజల హృదయం నుంచి తుడిచేయాలని మహ్మద్ యూనస్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే, షేక్ హసీనా పార్టీ అవామీలీగ్ పార్టీని రద్దు చేశాడు. మొత్తంగా బంగ్లాదేశ్ జాతిపిత ఖ్యాతిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడిలో, 40 రష్యన్ విమానాలు ఖతం..
ఉక్రెయిన్ రష్యాపై భారీ డ్రోన్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రష్యా వైమానిక స్థావరం టార్గెట్‌గా జరిపిన దాడిలో 40కి పైగా రష్యన్ విమానాలు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ దేశీయ భద్రతా సంస్థ, సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ (SBU) అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఉక్రెయిన్‌పై లాంగ్-రేంజ్ క్షిపణులను ప్రయోగించడానికి మోహరించే Tu-95, Tu-22 వ్యూహాత్మక బాంబర్‌లతో సహా రష్యన్ విమానాలను ఉక్రెయిన్ దళాలు నాశనం చేసినట్లు పేర్కొంది. రష్యాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలోని స్రెడ్నీ సెటిల్మెంట్ లోని సైనిక యూనిట్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందని ప్రాంతీయ గవర్నర్ ఇగోర్ కోబ్జెవ్ అన్నారు. ముర్మాన్స్క్ ప్రాంతంలోని ఒలెన్యా ఎయిర్ బేస్ సమీపంలో పేలుళ్లు, భారీ పొగలు గమనించినట్లు బెలారసియన్ వార్తా మీడియా సంస్థ NEXTA నివేదించింది. ఎక్స్‌లో ఫోటోలు, వీడియోలను పంచుకుంది. ప్రాథమికంగా ఇది డ్రోన్ దాడి అని నివేదికలు సూచిస్తున్నాయి. ఒలెన్యా రష్యాకు సంబంధించి కీలకమైన ఎయిర్ బేస్. ఈ బేస్‌లో అణ్వాయుధాలను మోసుకెళ్లే విమానాలు ఉంటాయి. అయితే, దీనిపై ఇంకా పూర్తి స్థాయి స్పష్టత, ధ్రువీకరణ రాలేదు. ఒక వేళ ఇదే నిజమైతే రష్యాపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటిగా పరిగణించబడుతుంది.
క్వాలిఫయర్-2కి వరుణుడి గండం.. మ్యాచ్ రద్దయితే ఎవరికి లాభం..?
ఈరోజు ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం స్టేడియంలో వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభంకానుంది. ప్రస్తుతం పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్‌సీబీతో తలపడుతుంది. ఒకవేళ వరుణుడి వల్ల మ్యాచ్ రద్దు అయితే పంజాబ్ కింగ్స్ లాభపడుతుంది. ఎందుకంటే.. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ కింగ్స్ మెరుగ్గా ఉంది. ఆ లెక్కన టేబుల్ టాపర్‌గా నిలిచినందున పంజాబ్ ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది. కానీ.. మరి కొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. రేపే టైటిల్ గ్లింప్స్..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. తాజాగా ఓ క్రేజీ కాంబో సెట్ అయిపోయింది. బేబీ, కలర్ ఫొటో లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల మేకర్స్ అయిన నిర్మాత, డైరెక్టర్ సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్ తో కిరణ్ కొత్త మూవీ చేయబోతున్నాడు. బేబీ తర్వాత సాయిరాజేశ్ చేస్తున్న సినిమా ఇది. కాకపోతే ఈ మూవీకి అతను డైరెక్టర్ కాదు. కేవలం కథ అందిస్తున్నాడు. సాయిరజేశ్, ఎస్కేఎన్ కలిసి అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. రవి నంబూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ ను జూన్ 2న అంటే రేపు సాయంత్రం 5.35 గంటలకు రిలీజ్ చేస్తున్నామని మూవీ టీమ్ ప్రకటించింది. త్వరలోనే మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్లు ఇస్తామని చెబుతున్నారు. క సినిమాతో మంచి హిట్ అందుకున్న కిరణ్.. ఆ తర్వాత ఓ ప్లాప్ మూటగట్టుకున్నాడు. కాబట్టి ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
ఈ వయసులో ఇదేంటి.. రాజేంద్రా నీకేమైంది?
వయసు పెరిగే కొద్దీ నటుడికి విలువ పెరగాలి. హుందాతనం అనువనువునా కనపడాలి. అదే ఆయన్ను మరో స్థాయిలో నిలబెడుతుంది. కానీ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన పేరు, ప్రతిష్టలు నోటి మాటతో పోగొట్టుకుంటున్నాడు. విజ్ఞానం మరీ ఎక్కువైన వ్యక్తి కాకరకాయను పట్టుకుని గీకరకాయ అన్నాడంట. రాజేంద్ర ప్రసాద్ కూడా ఇలాగే తయారయ్యాడు. ఈ నడుమ స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతున్నాడో అతనికి కూడా అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది. మైక్ పడితే కంట్రోల్ తప్పుతున్నాడు. సభా మర్యాదలు కూడా మర్చిపోతున్నాడు. ఎవరిని పడితే వారిని బూతులు అనేస్తున్నాడు. తన స్థాయి మర్చిపోయి తన విలువ తానే తగ్గించుకుంటున్నాడు. ఆ నడుమ రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను పట్టుకుని దొంగ ముం* కొడుకు అనేశాడు. తెలుగు యువత చీవాట్లు పెట్టడంతో క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. దానికంటే ముందు ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ అల్లు అర్జున్ పై ఇన్ డైరెక్ట్ గానే నోరు పారేసుకున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవాడు హీరో ఏంటి అని దురుసుగా మాట్లాడాడు. దానిపై పెద్ద రచ్చనే జరిగింది. బన్నీ ఫ్యాన్స్ ఏకిపారేశారు. మరి అంత జరిగినా నోరు అదుపులో పెట్టుకుంటున్నాడా అంటే మళ్లీ అదే బాట పట్టాడు.