చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.. షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు చంద్రబాబు.. అయితే, రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో.. ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.. మరోవైపు, చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు ఎటువంటి అనుమతులు లేవని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు పోలీసులు.. చంద్రబాబు రోడ్ షో, సభల్లో పాల్గొంటే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు పర్యటనలో ఎవరూ పాల్గొనకుడదని పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.. అయితే, ర్యాలీలు, సభలపై బ్యాన్ విధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను పట్టించుకోమని.. యథావిథిగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించారు టీడీపీ నేతలు.. కేవలం విపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. తన కుప్పం పర్యటనలో ఎలా ముందుకు సాగనున్నారు అనేది ఉత్కంఠగా మారింది.
లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడు బలి
లోన్ యాప్స్ వేధింపులతో బలి అవుతోన్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.. అవసరానికి డబ్బు తీసుకున్నా.. తిరిగి కట్టలేక వేధింపులతో ప్రాణాలు తీసుకునేవారు కొందరైతే.. చెల్లించినా వేధింపులు తప్పక ఆత్మహత్యలకు పాల్పడుతోన్నవారు మరికొందరు.. తాజాగా, చిత్తూరు జిల్లాలో మరో యువకుడు లోన్ యాప్ వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పెనుమూరు అంబేద్కర్ కాలనీ చెందిన యువకుడు జానకీరాం.. లోన్ యాప్‌లో 80వేలు రూపాయలు డబ్బులు తీసుకున్నాడు.. కొంత కాలం బాగానే చెల్లించినా.. ఆ తర్వాత చెల్లింపులు చేయడం ఆ యువకుడికి కష్టంగా మారింది.. అయితే, లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో.. ప్రాణం తీసుకున్నాడు.. అవరాలకు రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాను.. తిరిగి కట్టలేక పోయాను.. వాళ్లు నన్ను వేధిస్తున్నారు.. ఈ బాధను భరించలేకపోతున్నా.. ఆత్మహత్య చేసుకుంటున్నా.. నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోట్ రాసుకొచ్చాడు జనకీరాం..
మళ్లీ ఐటీ దాడులు.. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లలో సోదాలు
హైదరాబాద్ లో మళ్లీ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తెల్లవారుజాము 4 నుంచే ఐటీ దాడులు మొదలయ్యాయి. ఐటీ కార్యాలయం నుంచి సిబ్బంది 40 కార్లు, 3 సీఆర్పీఎఫ్ బస్సుల్లో బయలుదేరారు. ప్రస్తుతం ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కంపెనీకి చెందిన గచ్చిబౌలి ప్రధాన కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 18 చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా శాఖలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు ఒక్కసారిగా భారీ వాహనాలతో బయటకు రావడంతో ఎవరి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎవరి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతాయో మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. పెద్ద సంఖ్యలో ఐటీ అధికారులు కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. దీంతో ఐటీ శాఖ బడా వ్యక్తులపై దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఐటీ దాడులు చేస్తుండటంతో హైదరాబాద్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకుల్లో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఎవరిపై ఐటీ దాడులు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు.
దానికి ఒప్పుకోలేదని.. ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది..
హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం జరిగింది. కాజీపేటలో ప్రేమోన్మాది ఘూతుకానికి ఒడిగట్టాడు. పెళ్లికి ఒప్పుకోవడం లేదని, ప్రేయసి గొంగుకోశాడు దుర్మార్గుడు. ఆయువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నిన్న రాత్రి మండలంలోని కడిపికొండలో జరిగింది. కాజీపేట మండలం కపిడికొండకు చెందిన శ్రీనివాస్ తన గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమో కూడా ఇతడిని ప్రేమించింది. అయితే ఇద్దరి మతాలు వేరు. అందుకే శ్రీనివాస్ ఆమెకోసం మతం కూడా మార్చుకున్నాడు. కొంతకాలం వీరిద్దరి ప్రేమ బాగానే సాగిన, వీరి ప్రేమలో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య కొద్ది రోజులు గొడవలు మొదలయ్యాయి. నిన్న రాత్రి ఇదే విషయమై శ్రీనివాస్ యువతి ఇంటికి వెళ్లాడు. పెళ్లి గురించి మరోసారి యువతిని నిలదీశాడు. తమ కుటుంబ సభ్యులు వద్దన్నారని దీనికి యువతికూడా నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న కత్తితో యువతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. యువతి గొంతు, చేయి కోశాడు. యువతి కేకలు వేయడంతో.. కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేసి, చితకబాదారు. పోలీసులకు సమాచారం అందడంతో మడికొండ పోలీస్ స్పెక్టర్ గుజ్జేటి వేణు తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. యువతిని వరంగల్ లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు ప్రాణాపాయం లేదని తెలిపారు. శ్రీనివాస్ ను అదుపులో తీసుకున్నారు. కుటుంబ సభ్యులను శాంతిపచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆధార్ కార్డులో ఇది మరింత ఈజీగా..
ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం మరింత సులభతరం చేసింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI).. ఆధార్ హోల్డర్లు తమ ఆధార్ కార్డ్‌లలో చిరునామాను అప్‌డేట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఆసక్తికరంగా, కొత్త ప్రక్రియతో, ఆధార్ వినియోగదారులు ఎలాంటి పత్రాలను చూపించాల్సిన అవసరం లేకుండా ఆధార్ కార్డ్‌లోని చిరునామాను సులభంగా మార్చగలరు లేదా నవీకరించగలరు. ముఖ్యంగా, ఇప్పటి వరకు, ఆధార్ చిరునామా ప్రక్రియలో, చిరునామాలో మార్పును ప్రాసెస్ చేయడానికి వినియోగదారులు UIDAI కోసం కొత్త చిరునామా యొక్క రుజువును అప్‌లోడ్ చేయాల్సి ఉండగా.. ఇకపై ఆ కష్టాలు ఉండబోవన్నమాట. అయితే, కుటుంబ పెద్ద సమ్మతితో ఆన్‌లైన్‌లో ఆధార్‌లో చిరునామాను అప్‌డేట్ చేయడంలో వారికి సహాయపడటానికి UIDAI రెసిడెంట్ ఫ్రెండ్లీ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. “ఆధార్‌లోని కుటుంబ పెద్ద ఆధారిత ఆన్‌లైన్ చిరునామా అప్‌డేట్ వారి ఆధార్‌లోని చిరునామాను అప్‌డేట్ చేయడానికి వారి సొంత పేరు మీద సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేని పిల్లలు, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు మొదలైన వారి బంధువులకు గొప్ప సహాయం చేస్తుందని UIDAI అధికారిక ప్రకటనలో తెలిపింది. ఆధార్‌లో చిరునామా మార్పు రేషన్ కార్డ్, మార్క్‌షీట్, వివాహ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ లేదా దరఖాస్తుదారు మరియు కుటుంబ పెద్ద ఇద్దరి పేరు, వారి మధ్య సంబంధం మరియు OTP ఆధారిత ప్రమాణీకరణ వంటి సంబంధిత పత్రాలను సమర్పించడం ద్వారా జరుగుతుంది. ఇక, కుటుంబ పెద్దతో తమకున్న రిలేషన్‌షిప్ రుజువు పత్రం అందుబాటులో లేకుంటే, నివాసి UIDAI సూచించిన ఫార్మాట్‌లో కుటుంబ పెద్ద ద్వారా స్వీయ-డిక్లరేషన్‌ను సమర్పించవచ్చు అని పేర్కొంది.
ఉక్రెయిన్ దాడిలో 89 మంది సైనికులే చనిపోయారు.. ప్రకటించిన రష్యా
న్యూ ఇయర్ వేళ ఉక్రెయిన్ జరిపిన దాడిలో తమ సైనికులు 89 మంది ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతీయ రాజధాని డొనెట్స్క్‌లోని జంట నగరమైన మాకివికాలోని వృత్తి విద్యా కళాశాలలో నాలుగు ఉక్రేనియన్ క్షిపణులు తాత్కాలిక రష్యన్ బ్యారక్‌లను తాకినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారిక దర్యాప్తు ప్రారంభించినప్పటికీ, దాడికి ప్రధాన కారణం సైనికులు మొబైల్ ఫోన్‌లను అక్రమంగా ఉపయోగించడమేనని మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యన్ సైనికుల శిబిరమైన వొకేషనల్ కాలేజీ బిల్డింగ్‌పై పెద్ద ఎత్తున రాకెట్లతో దాడిచేసిన సంగతి తెలసిందే. ఈ ఘటనలో 300 నుంచి 400 మంది ప్రత్యర్థి సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే ఆ దాడిని ధ్రువీకరించిన రష్యా రక్షణ శాఖ.. మొదట 63 మంది సైనికులు మృతిచెందారని తెలిపింది.
టోక్యోని వీడండి.. లక్షలు కొట్టేయండి.. జపాన్ ప్రభుత్వం ఆఫర్
నగరాల్లో ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉంటాయి. కూలీ పని చేసుకోవడం దగ్గర నుంచి లక్షల్లో జీతాలు అందుకునే పెద్ద ఉద్యోగాలు దాకా.. నగరాల్లో అందుబాటులో ఉంటాయి. దీనికితోడు జీవన విధానం కూడా వృద్ధి చెందుతుంది. అందుకే.. మారుమూల ప్రాంతాల నుంచి జనాలు నగరాలకు పోటెత్తుతుంటారు. జపాన్‌లోని టోక్యో విషయంలోనూ అదే జరుగుతోంది. ఆ నగరంపై అయితే జనాలు దండయాత్ర చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి, అక్కడ బస చేస్తున్నారు. దీంతో.. అక్కడ ఇబ్బడిముబ్బడిగా జనాలు పెరిగిపోతోంది. ప్రస్తుతం 3.80 కోట్లకు పైగా జనాభా కలిగిన టోక్యో.. ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా రికార్డులకెక్కింది. ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది కానీ.. టోక్యోకు జనాలు పోటెత్తుతుండటం వల్ల, మిగిలిన పట్టణాల్లో జనాభా తగ్గిపోతోంది. దాంతో ఆ పట్టణాలు సంక్షోభవంలోకి వెళ్లిపోతున్నారు. జనం లేక అక్కడి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఫలితంగా.. ఆస్తుల విలువ దారుణంగా పడిపోతోంది. ఈ సమస్యని గుర్తించిన జపాన్ ప్రభుత్వం.. ఇతర నగరాల్ని సంక్షోభంలో నుంచి బయటపడేసేందుకు, టోక్యో నుంచి వలసల్ని ప్రోత్సాహించేందుకు ఒక వినూత్నమైన వ్యూహానికి తెరతీసింది. ఎవరైతే టోక్యో నగరాన్ని వీడుతారో.. వారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. గతంలోనే జపాన్ ప్రభుత్వం.. టోక్యోను వీడే ఒక్కో కుటుంబంలోని బిడ్డకు 3 లక్షల యెన్ చొప్పున ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు అదే ఆఫర్‌ని 10 లక్షల యెన్ (దాదాపు రూ. 6.35 లక్షలు)లకు పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ కొత్త ఆఫర్ అమల్లోకి రానుంది.
ఆ టైంలో ఇబ్బంది పడ్డా.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్
ఈ సంక్రాంతి శృతిహాసన్‌కు చాలా ప్రత్యేకమని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే.. కథానాయికగా నటించిన రెండు సినిమాలు (వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి) సంక్రాంతికి వస్తున్నాయి. దీంతో.. ఈ అమ్మడు ఫుల్ జోష్‌తో రెండు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగానే కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని, షూటింగ్ సమయంలో తాను పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా.. వాల్తేరు వీరయ్యలోని ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అంట’ అనే పాట చిత్రీకరణ సమయంలో తాను చాలా ఇబ్బంది పడ్డానంటూ శృతి తాజాగా చెప్పుకొచ్చింది. ఎందుకంటే, ఈ పాటని ఫ్రాన్స్‌లోని మంచుకొండల్లో షూట్ చేసిన సంగతి తెలిసిందే! శృతిహాసన్ మాట్లాడుతూ.. ‘‘ఇకపై నేను మంచులో చీరతో మరో పాటకు డ్యాన్స్ చేయకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే.. ‘నువ్వు శ్రీదేవి అయితే’ అనే పాట షూటింగ్ సమయంలో ఆ వాతావరణంలో నేను చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను. చలిలో వణుకుతూ స్టెప్పులు వేయలేకపోయా. అయితే.. ప్రేక్షకుల కోసం మేము తప్పకుండా చేయాల్సిందే కాబట్టి, ఆ చలిని తట్టుకుంటూనే డ్యాన్స్ చేశా. కానీ నాకు మాత్రం మైనస్ డిగ్రీల చలీలో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ పాటకి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. జనవరి 13వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇందులో చిరంజీవి, రవితేజ కలిసి నటించడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.