టాలీవుడ్‌లో మరో విషాదం.. వెండితెర సత్యభామ కన్నుమూత..
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ఇవాల ఉదయం సీనియర్ సినీనటి జమున మృతిచెందారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. జమున మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె మృతి వార్త విన్నగానే టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికలుగా కొనసాగిన కథానాయికలు ఎందరో ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే తమ నటనా ప్రతిభతో పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అలాంటి వారిలో జమున ఒకరు. నిజానికి తన మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు నేలపైనే ఎదిగి సినీ పరిశ్రమలో అరుదైన కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. జమున 1937లో కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో జన్మించింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆంధ్రాకు వెళ్లడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాలో బాల్యం గడిచింది. జమున అసలు పేరు జానాబాయి. అయితే జన్మ నక్షత్రాన్ని బట్టి ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్యులు చెప్పడంతో.. ఆమె పేరు మధ్యలో ము అనే అక్షరాన్ని చేర్చారు. అలా ఆమె పేరు జమున అయింది. నటుడు జగ్గయ్యది అదే గ్రామం కావడంతో జమున కుటుంబానికి ఆయనతో కొంత పరిచయం ఉంది.
తెలంగాణలో నేటి నుంచే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు..
టీచర్ల బదిలీలు తెలంగాణ రాష్ట్రంలో ఆ మధ్య తీవ్ర వివాదాన్ని సృష్టించాయి.. ఇప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు ఈ వ్యవహారంలో ఆందోళనను చేస్తూనే ఉన్నాయి.. అయితే, ఇప్పుడు బదిలీలు, ప్రమోషన్లకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. రాష్ట్రంలో ఇవాళ్టి నుండి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.. దీనికి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసింది విద్యా శాఖ.. 37 రోజుల పాటు ఈ ప్రాసెస్ కొనసాగనుంది.. ఇప్పుడు బదిలీ అయిన, ప్రమోషన్ పొందిన టీచర్లు ఈ విద్యా సంవత్సరం చివరి రోజున.. ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ నుంచి రిలీవ్‌కానున్నారు.. వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు, పదోన్నతులు ఉంటాయని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఇక, ఉపాధ్యాయ బదిలీలు – 2023. గైడ్ లైన్స్ విషయానికి వస్తే.. బదిలీకి కటాఫ్ తేదీ 1 ఫిబ్రవరి 2023గా నిర్ణయించారు.. యాజమాన్యం వారీగానే బదిలీలు, పదోన్నతులు ఉంటాయి.. అంటే 1 ఫిబ్రవరి 2023 నాటికి ఒక పాఠశాలలో 2 సంవత్సరాల సర్వీస్ నిండిన వారు బదిలీ దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు అవుతారు.. బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరుగుతాయి. ఎన్‌సీసీ ఆఫీసర్స్ కు మాత్రం మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.. 1 ఫిబ్రవరి 2023 నాటికి ఒక పాఠశాలలో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు, 8 సంవత్సరాల పూర్తి చేసిన ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ జరగనున్నాయి. ఇక, మూడు సంవత్సరాల లోపు రిటైర్ అయ్యేవారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.
నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ లోకి గిరిధర్ గమాంగ్..
టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి మారిన తర్వాత కేసీఆర్ దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్య నేతలు, జాతీయ నేతలతో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా బీఆర్ఎస్ కార్యకలాపాలను విస్తరింపజేస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సమక్షంలో ఒడిశా మాజీ సీఎం, ఆరాష్ట్ర సీనియర్ నేత, గిరిధర్ గమాంగ్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఒడిశాలోని కోరాపుట్ మాజీ ఎంపీ జయరాం పాంగి, బీజేపీ నేత, గిరిధర్ గమాంగ్ తనయుడు శిశిర్ గమాంగ్ సహ పెద్ద సంఖ్యలో నాయకులు బీఆర్‌ఎస్ లో చేరనున్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేపట్టిన ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసేందుకు అనేక రాష్ట్రాల నుంచి పలు పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావులు ముందకు వస్తున్నారు.
డెక్కన్ భవనం కూల్చివేత.. బిల్డింగ్ ఒకపక్కకు ఒరిగే అవకాశం..!
సికింద్రాబాద్ మినస్టర్ రోడ్ లోని డెక్కన్ స్పోర్ట్స్ భవనం కూల్చివేత పనులు నిన్న అర్థరాత్రి 11 గంటల నుంచి 2 గంటలకు వరకు కొనసాగించారు. అనంతరం రాత్రి 2 గంటల తర్వాత కూల్చివేత పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. బిల్డింగ్ పటిష్టత 70 నుంచి 80 శాతం కోల్పోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. బిల్డింగ్ ఒకపక్కకు ఒరిగే అవకాశం ఉండటంతో అధికారులు పకడ్బంది చర్యలు చేపట్టారు. డెక్కన్ మాల్ లోని రెండు సెల్లార్స్ ని పటిష్టం చేస్తూ.. ఇంజినీర్లు ర్యాంప్ ఏర్పాటు చేశారు. ర్యాంప్ నిర్మాణం పూర్తి చేశారు. ఇవాళ తిరిగి ఉదయం 6.50 నిమిషాల నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారు అధికారులు. హైడ్రాలిక్ క్రషర్ డిమాలిషన్ విధానంలో ఈ భవనాన్ని కూల్చివేయనున్నారు. ఎలాంటి అడ్డంకులు లేకపోతే.. 5 రోజుల్లో బిల్డింగ్ మొత్తాన్ని కూల్చేసే అవకాశం ఉంటుందని తెలిపారు అధికారులు.
తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు.. ఈ సేవలన్నీ రద్దు..
తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.. రథసప్తమి వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒకేరోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీవారి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి.. ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం, ఉదయం 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్షవాహనం, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు.. ఇక, రేపు రథసప్తమి సందర్భంగా సర్వదర్శనం భక్తులుకు జారీచేసే టోకెన్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.. మరోవైపు.. ఇవాళ, రేపు అడ్వాన్స్ విధానంలో వసతి గదులు కేటాయింపును కూడా రద్దు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.. మరోవైపు.. ఇవాళ టీటీడీ మొబైల్ యాప్‌ని విడుదల చేయనున్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ మొబైల్ యాప్ ద్వారా టీటీడీకి సంబంధించిన సమగ్ర సమాచారం భక్తులకు ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంచనుంది టీటీడీ.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచిఉన్నారు భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 58,379 మంది భక్తులు దర్శించుకున్నారు.. 28,950 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు లభించింది.
ఐసిస్ సీనియర్ నాయకుడు బిలాల్-అల్-సుదానీ హతం
ఉత్తర సోమాలియాలో యూఎస్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) సీనియర్ వ్యక్తి బిలాల్-అల్-సుడానీని హతమార్చిందని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ గురువారం ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాల మేరకు అమెరికా జరిపిన దాడి ఆపరేషన్‌లో అనేక మంది ఇతర ఐసిస్ సభ్యులను ఈ ఆపరేషన్‌లో హతమయ్యారని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో పౌరులెవరూ గాయపడలేదని ప్రకటించారు. జనవరి 25న ప్రెసిడెంట్ జో బిడెన్ ఆదేశాల మేరకు అమెరికా మిలిటరీ ఉత్తర సోమాలియాలో ఒక దాడి ఆపరేషన్ నిర్వహించింది. దీని ఫలితంగా సోమాలియాలోని ఐసిస్ నాయకుడు బిలాల్-అల్-సుడానీతో సహా అనేక మంది ఐసిస్ సభ్యులు మరణించారు. ఐసిస్ గ్లోబల్ నెట్‌వర్క్. ఆఫ్రికాలో పెరుగుతున్న ఐసిస్ ఉనికిని పెంపొందించడానికి, ఆఫ్ఘనిస్తాన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా గ్రూప్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి అల్-సుడానీ ముఖ్య పాత్ర వహించాడని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
కెరీర్ చివరి టోర్నీలో సానియాకు షాక్.. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఓటమి
కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాకు శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో బిగ్ షాక్ తగిలింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి సూపర్ పెర్ఫామెన్స్‌తో ఫైనల్‌కు చేరి.. ఫైనల్‌లో బ్రెజిలియన్ జోడీ లూయిసా స్టెఫానీ, రాఫెల్ మాటోస్ చేతిలో సానియా-బోపన్న జోడీ ఘోరమైన ఓటమి చవిచూసింది. రాడ్ లావర్ ఎరీనాలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ ఓటమిని మూటగట్టుకుంది. వరుస రెండు సెట్లలో 6-7 (2-6), 2-6తో ఓటమి పాలయ్యారు. అద్భుత ఆటతీరుతో దూసుకుపోయిన సానియా – బోపన్న జోడీ సెమీఫైనల్‌లో బ్రిటన్, అమెరికాకు చెందిన నీల్ సుపాస్కి-డిసీర్ క్రాజిక్‌లపై 7-6, 6-7, 10-6 తేడాతో విజయాన్ని సాధించి గ్లాండ్‌స్లామ్ ఫైనల్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. క్వార్టర్స్‌లో వాకోవర్ లక్‌తో సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సానియా-బోపన్న జోడి.. సెమీస్‌లో పాయింట్ పాయింట్‌కి పోరాడాల్సి వచ్చింది. కెరీర్‌లో సానియా మీర్జాకు ఇదే చివరి గ్లాండ్‌స్టామ్ టోర్నమెంట్. ఫిబ్రవరిలో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు ఇటీవలే సానియా స్పష్టం చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచి కెరీర్‌ను ఘనంగా ముగించే అవకాశం సానియాకు లభించింది. ఫైనల్‌లో సానియా – బోపన్న జోడి ఇదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటివరకు రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ చేజిక్కించుకుంది సానియా. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఒకసారి, మరోసారి విమెన్స్ డబుల్స్‌లో విజేతగా నిలిచింది. మరో మూడు సార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఉక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు.. 11 మంది మృతి
అత్యాధునిక యుద్ధ ట్యాంకులు సరఫరా చేస్తామని అమెరికా, జర్మనీలు ప్రకటించిన నేపథ్యంలో రష్యా దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఉక్రెయిన్‌లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని చేసిన క్షిపణి దాడుల్లో దాదాపు 11 మంది మృతి చెందారు. కీవ్, ఒడెసాలపై క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో 11 మంది పౌరులు చనిపోయారని, మరో 11 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ పేర్కొంది. రష్యా ప్రయోగించిన 55 క్షిపణుల్లో 47 క్షిపణులను తమ బలగాలు ధ్వంసం చేశాయని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. కీవ్ ప్రాంతంలోని గృహాలకు చాలా నష్టం వాటిల్లిందని, దాడి తర్వాత 100 మంది సహాయక సిబ్బంది వారికి సాయం చేసేందుకు అక్కడికి చేరుకున్నారని సర్వీస్ ప్రతినిధి ఒలెక్సాండర్ ఖోరుంజీ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా ఉక్రెయిన్‌పై దాడిని ఖండించింది. గాయపడిన వారందరికీ సానుభూతి తెలిపింది.ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులను అందించడానికి అమెరికా, జర్మనీలు అంగీకరించిన తర్వాత ఈ దాడి జరిగింది.ఈ క్షిపణి దాడుల్లో 35 భవనాలు దెబ్బతిన్నాయి. ఈ క్షిపణుల వల్ల ఉక్రెయిన్‌లోని 11 ప్రాంతాల్లో నష్టం వాటిల్లిందని ఖోరుంజీ చెప్పారు. రష్యా తాజా క్షిపణి దాడుల ఫలితంగా 11 మంది మరణించగా, 11 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అత్యవసర సేవలు తెలిపాయి. అక్టోబరు నుంచి రష్యా ఉక్రెయిన్ అంతటా శక్తి అవస్థాపనకు వ్యతిరేకంగా సాధారణ దాడులను ప్రారంభించింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి చేరుకుంటాయి.