తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భోళా శంకరుడిని దర్శనానికి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే భక్తులు పూజలు, అభిషేకాలు చేస్తూ శంభో శంకరా భోళ శంకరుడిని కీర్తిస్తూ శివుని కృపకు పాత్రులవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, మహానంది, కోటప్పకొండ, వేములవాడ, కాలేశ్వరం, కొమరవల్లి, ఐనవోలు, చెర్వుగట్టు సహా.. ఇతర శైవ ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.
రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు.. చెరువు ప్రాంతంలో దిగేందుకు..
వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే వేడుకల్లో మొదటి రోజు శుక్రవారం శివనామస్మరణతో పట్టణం మార్మోగింది. స్వామివారి గర్భాలయంలో జరిగే అభిషేక పూజలను రద్దు చేశారు. ఇవాళ, రేపు (శని,ఆదివారాల్లో) భక్తులందరికీ లఘు దర్శనమే కల్పించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు తరలివస్తున్నారు. నిన్న (శుక్రవారం) వేములవాడ శ్రీ పార్వతీరాజరాజేశ్వరస్వామి గుడి చెరువు వేదిక వద్ద దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శివార్చన వేడుకలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రి కొప్పుల ఈశ్వర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి ఇవాళ శ్రీ పార్వతీరాజరాజేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరిలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం వెల్లివిరియాలని గవర్నర్ ఆకాంక్షించారు. కాగా.. మహాశివరాత్రి జాతర కోసం హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం వేములవాడ ఆలయ అధికారులు హెలికాప్టర్ సేవలను అందుబాటులో ఉంచారు. నేరుగా రాజన్న ఆలయ చెరువు ప్రాంతంలో దిగేందుకు ఏర్పాట్లు చేశారు. 400 వసతి గదులు మాత్రమే ఉండడంతో గుడిచెరువు నేలంతా పందిళ్లతో నిండిపోయింది. తాగునీటి వసతితో పాటు స్నాన ఘాట్‌లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. రాత్రి జాగరణ చేసే భక్తులకు శివార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకోసం దేశం నలుమూలల నుంచి కళాకారులు తరలివచ్చారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఇతర జిల్లాలకు చెందిన మున్సిపల్ కార్మికులు, తాత్కాలిక కార్మికులు ఆలయ సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నారు. నిన్న (శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతరకు వచ్చే భక్తుల కోసం 4 లక్షల లడ్డూలు, 10 క్వింటాళ్ల పులిహారను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
రేపే ఎస్‌ఐ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష.. ఇవి మర్చిపోవద్దు..
నిరుద్యోగ యువతకు శుభవార్త చెబుతూ ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఇందులో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి కూడా పూనుకుంది.. ఇప్పటికే పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB AP) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులున్నాయి. సివిల్ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న అనగా రేపు నిర్వహించనున్నారు.. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. ఆదివారం జరగనున్న ప్రాథమిక రాత పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 291 కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష ఉండనుంది.. పరీక్ష రాసే ఎస్‌ఐ అభ్యర్థులు ఇవి తప్పకుండా గుర్తించుకోవాలి.. ఉదయం జరిగే పరీక్షకు 10 గంటల తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే పరీక్షా కేంద్రంలోకి ఎంట్రీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.. ఇక, మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, పర్సు, నోట్సు, ఛార్టులు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల లాంటివి ఏవైనా ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించరు. వాటిని అసలు పరీక్ష కేంద్రాల వద్దకే తీసుకురావొద్దని, భద్రపరచడానికి ఎలాంటి అదనపు ఏర్పాట్లు ఉండబోవని పోలీసు నియామక మండలి ఇప్పటికే ప్రకటించింది. ఎగ్జామ్ సెంటర్ విషయంలో గందరగోళ పరిస్థితి ఉండకుండా.. అభ్యర్థులు ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలని సూచించారు. మరోవైపు పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులు.. ఆధార్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్‌కార్డు వంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకురావాలి స్పష్టం చేశారు.. కాగా, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.. దరఖాస్తులు భారీ స్థాయిలో వచ్చాయి.. ఇప్పటి వరకు 1,71,936 మంది సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.. ఈ లెక్కన చూసినా.. ఒక్కో పోస్టుకు సగటున 418 మంది పోటీ పడుతున్నారన్నమాట.. ఇప్పటి వరకు ఎలా చదివాం అన్నది కాదు.. ఎగ్జామ్ ఎలా రాశాం అన్నది ఎంతో కీలకం.. కాబట్టి అభ్యర్థులు గందరగోళానికి గురికాకుండా.. కూల్‌గా ఎగ్జామ్ రాయాలని సూచిస్తున్నారు విద్యారంగ నిపుణులు.
మళ్లీ ఏపీ కేబినెట్ విస్తరణ..! మంత్రులకు కొత్త టెన్షన్..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతోన్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలకమైన చర్చ మొదలైంది.. అదే, ఏపీ కేబినెట్ విస్తరణ.. దీంతో, మంత్రులకు టెన్షన్ పట్టుకుందట.. నా పదవి ఉంటుందా? ఊడిపోతుందా? అనే లెక్కలు వేసుకుంటున్నారట మంత్రులు.. వైఎస్ జగ్మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌లో స్థానం సంపాదించుకున్న కొందరు మంత్రులను.. వైఎస్ జగన్ తన రెండో కేబినెట్‌లోనూ కొనసాగిస్తున్నారు.. కొందరి మార్చేసి.. కొత్తవారికి పదవులు కట్టబెట్టారు.. మాజీ మంత్రులకు పార్టీలో కీలక పోస్టులు ఇచ్చారు.. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన పలుకుతూ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట.. వారి స్థానంలో కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారని ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జోరుగా సాగుతోంది.. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వంపై సమీక్షల సందర్భంగా పనితీరు బాగలేని మంత్రులు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం జగన్.. ఎవరు వెనకబడ్డారు.. ఎవరు పనితీరు మార్చుకోవాలి అనే విషయాలను కూడా సూటిగా చెప్పేశారు. దీంతో, ఈసారి కేబినెట్ పదవి కోల్పోయే మంత్రులు ఎవరు? అనే చర్చ మొదలైంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసి వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఇప్పుటికే రెండుసార్లు కేబినెట్ విస్తరణ జరిగింది.. తొలి కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మంత్రుల్లో ముగ్గురు, నలుగురు మినహా మిగిలిన వారందరికీ రెండో కేబినెట్‌లో అవకాశం రాలేదు.. అయితే, ఇప్పుడు మూడోసారి కూడా మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీలుగా విజయం సాధించినవారిలో ముగ్గురు, నలుగురిని తన కేబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం జగన్ ఆలోచనగా ఉందట.. పార్టీ కోసం పని చేసి పదవులు రాని కొందరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి.. వారిని మంత్రులను చేయలనే యోచనలో జగన్మోహన్‌రెడ్డి ఉన్నారట. దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారట.. ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారట.. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికపై చర్చించి.. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేశారట.. ఇందులో భాగంగానే సామాజిక వర్గాలుగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చాలాకాలంగా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ పెండింగ్‌లో ఉంది. ఇదే సమయంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ చెప్పడంతో.. కేబినెట్ విస్తరణ త్వరలోనే ఉంటుందనే చర్చ సాగుతోంది. కానీ, ఈ విస్తరణతో కేబినెట్‌లో ఉండేది ఎవరు? పదవులు ఊడేవి ఎవరివి అనేది ఆసక్తికరంగా మారింది.
అల వైకుంఠపురములో… అక్కడ ఆడట్లేదు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన మూవీ ‘అల వైకుంఠపురములో’. ఒక సింపుల్ ఫ్యామిలీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమా అల్లు అర్జున్ ని హిట్ ట్రాక్ లోకి ఎక్కించింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, బన్నీ ఫన్ టైమింగ్, తమన్ మ్యూజిక్, పూజా గ్లామర్ లాంటి ఎలిమెంట్స్ అల వైకుంఠపురములో సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచాయి. తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయిన ఈ మూవీని హిందీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘షెహజాదా’ అనే పేరుతో రీమేక్ చేశారు. నిన్న రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ బిలో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. కార్తీక్ ఆర్యన్ ఫాన్స్ కి బాగానే నచ్చింది కానీ కామన్ ఆడియన్స్ మాత్రం షెహజాదా సినిమా బాగోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ ఉండే హిట్ సినిమా స్క్రిప్ట్ కి యావరేజ్ అనే టాక్ కూడా రాకుండా ఫ్లాప్ అనే టాక్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మొదటి రోజే కేవలం 13% ఆకుపెన్సీ మాత్రమే ఉంది అంటే షెహజాదా సినిమాకి నెగటివ్ టాక్ ఎంత స్ప్రెడ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నెగటివ్ టాక్ కి కారణం, అల వైకుంఠపురములో సినిమా అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు త్రివిక్రమ్ రాసిన ఒక పక్కా తెలుగు సినిమా. కొన్ని సినిమాలని రీమేక్ చెయ్యకూడదు అంటారు కదా, అల వైకుంఠపురములో అలాంటి సినిమానే. కథ బాగుండి హిట్ అయిన సినిమాని రీమేక్ ఏ బాషలో అయిన చెయ్యొచ్చు కానీ ఒక హీరో కోసం మాత్రమే రాసిన కథని రీమేక్ చెయ్యాలి అనుకోవడం ఇబ్బంది కలిగించే విషయమే. 96, రఘువరన్ Btech, హ్రిద్యం, లూసిఫర్, లవ్ టుడే, అసురన్ లాంటి సినిమాలు ఆ హీరోల కోసమే రాసినవి, ఆ హీరోలు క్యారెక్టర్స్ లో జీవించినవి… కాబట్టి ఇలాంటి సినిమాలని రీమేక్ చెయ్యకూడదు. ఈ విషయాన్ని ఫిల్మ్ మేకర్స్ అర్ధం చేసుకుంటే షెహజాదా లాంటి దెబ్బలు తగలకుండా ఉంటాయి.