నేడు విశాఖకు ప్రధాని మోడీ..
ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం నాలుగు గంటలకు మోడీ విశాఖ చేరుకుంటారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకూ రోడ్ షో చేస్తారు. ఈ షోలో ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉంటారు. బహిరంగసభ జరిగే వేదికను ఇప్పటికే మంత్రులు పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని SPG తమ అధీనంలోకి తీసుకుంది. 5 వేల మంది పోలీసులు సభా ప్రాంగణానికి పహారాగా ఉన్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని మోడీ పర్యటన, రోడ్ షో, సభ జరుగుతుంది. ఇందుకోసం 35 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక, విశాఖ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. వీటిలో విశాఖ రైల్వే జోన్ ఉంది. సభా వేదికపై ప్రధాని దాదాపు గంట సేపు ఉంటారు. సభా ప్రాంగణంలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా బ్లాకులు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు వీవీఐపీ పాసులు జారీ చేస్తున్నారు. ప్రధాని సభకు వచ్చే వారికోసం 26 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. మోడీ రోడ్ షో మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. సభ కోసం జనాన్ని తరలించేందుకు వేలాది బస్సులను సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు కూటమి నేతలు.
విశాఖలో ప్రధాని బహిరంగసభ.. వేదికపై 13 మందికే అవకాశం
భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కోసం విశాఖ నగరం ముస్తాబైంది. ఈ పర్యటనలో 2 లక్షల 8వేల కోట్ల విలువైన పథాకలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని. ఆంధ్రాయూనివర్శిటీలో బహిరంగసభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వేదికపై 13 మందికే అవకాశం కల్పించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు వేదికపై కూర్చుంటారు. ప్రధాని ప్రసంగాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలుగులోకి అనువదిస్తారు. వేదికకు కుడివైపు ఆరు బ్లాకుల్లో మంత్రులు, రాష్ట్రస్థాయి నేతలు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది తరలివస్తారని భావిస్తున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోడీ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. గతేడాది నవంబర్‌లో పర్యటించాల్సి ఉన్నా తుపాను కారణంగా రద్దైంది. ఇక, వేదికపై కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు లోకేష్, సత్యకుమార్, BJP రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, ఎంపీలు ఎం.శ్రీభరత్, సీఎం రమేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ వేదికపై కూర్చొనే అవకాశం ఉంది.. ఈ సభలో ప్రధాని మోడీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్, సీఎం రమేష్ ప్రసంగించనున్నట్టుగా తెలుస్తోంది.
విశాఖ పర్యటనకు మోడీ.. స్టీల్‌ప్లాంట్‌పై కీలక ప్రకటన..!
ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో పలు కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న రైల్వేజోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ప్రధాని. అనకాపల్లి జిల్లా పూడిమడక దగ్గర NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులను ప్రారంభిస్తారు. రెండు దశల్లో లక్షా 85వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రోజుకు 15 వందల టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు అమ్మోనియా, మిథనాలను, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఉత్పత్తి జరగనుంది. దీనివల్ల 25 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. రోజుకు 80 మిలియన్ లీటర్ల సముద్రపునీటిని డీసాలినేషన్ చేసి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2వేల ఎకరాలతో నిర్మించే బల్క్‌డ్రగ్ పార్కుకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు ప్రధాని.. దీనికి సుమారు 19వందల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. 10 నుంచి 14వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. 28 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
వైఎస్ జగన్‌కు బిగ్ రిలీఫ్.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. యునైటెడ్ కింగ్డమ్ (యూకే) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తాజా పాస్ పోర్టు పొందేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని జారీ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.. ఐదేళ్ల కాల వ్యవధితో వైఎస్ జగన్ కు పాస్ పోర్ట్ జారీ చేయాలని పాస్ పోర్ట్ అధికారులను ఆదేశాలు జారీ చేసింది. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవం కోసం ఈ నెల 16వ తేదీన యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసుకున్న అభ్యర్థనలు ఆమోదం తెలిపింది హైకోర్టు.. ఎన్‌వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై 20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి..
నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణ
నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణ జరగనుంది. ఈ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. అరవింద్ కుమార్‌ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. మరోవైపు ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈడీ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. ఏసీబీ, ఈడీ విచారణ 10:30 కు ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉండగా.. సంచలనం సృష్టిస్తున్న ఫార్ముల ఈ రేస్ కేసుపై కేటీఆర్ నిన్న మీడియాతో మాట్లాడారు. ఒక పాత సామెత చిన్నప్పటి నుంచి వింటున్నామని, అవినీతి పరులు ప్రతిచోటా అదే జరుగుతుంది అనుకుంటారన్నారు. ఉదయం నుంచి కాంగ్రెస్ నాయకులు ఏదో హడావుడి చేస్తున్నారని, ఏమి లేకున్నా నా మీద లొట్టపీసు కేస్ పెట్టారని ఆయన విమర్శించారు. అవినీతి లేదని తెలిసి కూడా నామీద కేసు పెట్టి శునకానందం పొందతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాజ్యాంగపరంగా ప్రతి హక్కును వినియోగించుకుంటా అని ఆయన స్పష్టం చేశారు. నా మీద కేస్ పెట్టిన చిట్టి నాయుడు కి ఒక విషయం చెప్పాలని, నేను ఏసీబీ ఆఫీసుకు వెళ్లినా నన్ను ప్రశ్నించడానికి భయపడ్డారన్నారు. మేము కోర్టు కు వెళ్ళామని, హై కోర్టులో మేము వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేశారన్నారు. మేము సుప్రీంకోర్టు కు వెళ్ళామని, రెండు మూడు రోజుల్లో విచారణ కు వస్తుందన్నారు.
“చైనా మాంజా యమ డేంజర్”.. అమ్మితే ఇలా ఫిర్యాదు చేయండి..
హైదరాబాద్‌లో గతేడాది విషాదం నెలకొంది. లంగర్ హౌజ్ లో చైనా మాంజా దారం మెడకు చుట్టుకుని ఆర్మీ జవాన్ మృతి చెందాడు. లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ వద్ద సైనికుడి మెడకు మాంజా చుట్టుకుని ప్రమాదం జరిగింది. విధులు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తున్న సైనికుడికి ఈ ప్రమాదం జరిగింది. మాంజా మెడకు చుట్టుకోవడంతో సైనికుడికి తీవ్రగాయాలు అయ్యాయి. అతడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సైనికుడు కోటేశ్వరరావు మృతి చెందాడు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరంలో నిషేధిత చైనా మాంజా ద్విచక్ర వాహనదారుడి మెడకు చుట్టుకోవడంతో అతని మెడకు తీవ్రంగా గాయమైంది. ఈ ఘటనలో రక్తస్రావం అధికంగా కావడంతో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు అతనిని కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం తర్వాత హైదరాబాద్‌కి తరలించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చైనా మాంజా బాధితులు చాలా మంది ఉన్నారు. ఈ చైనా మాంజా మెడకు చుట్టుకుని ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.
నేడు ఒకే దేశం- ఒకే ఎన్నికపై జేపీసీ మొదటి సమావేశం..
ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) తొలి సమావేశం ఈరోజు (జనవరి 8) జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రతిపాదిత చట్టాల నిబంధనలను జేపీసీ సభ్యులకు న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు వివరించనున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేగాక పలువురి అభిప్రాయాలను కూడా జేపీసీ తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అయితే, జేపీసీ తన నివేదికను వచ్చే పార్లమెంట్ సెషన్‌లో మొదటి వారం చివరి రోజున లోక్‌సభలో సమర్పించాలి. ఈ నేపథ్యంలోనే దీనిపై సుధీర్ఘ చర్చ చేపట్టేందుకు కమిటీ సభ్యులు చర్యలు వేగవంతం చేసినట్టు సమాచారం. కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లును లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రవేశ్ పెట్టారు. ఈ తీర్మానికి లోక్ సభ ఆమోద ముద్ర వేసింది. అయితే, ప్రతిపక్ష సభ్యుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ బిల్లుపై మరింత కసరత్తు చేయడానికి కేంద్ర సర్కార్ జేపీసీకి ఈ బిల్లును పంపించింది. 39 మంది సభ్యులతో కూడిన కమిటీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ను నుంచి ప్రియాంక గాంధీ, జేడీయూ- సంజయ్ ఝా, శివసేన (షిండే)కు చెందిన శ్రీకాంత్ షిండే, తృణమూల్‌కు చెందిన కళ్యాణ్ బెనర్జీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌తో పాటు తదితరులు సభ్యులుగా ఇందులో ఉన్నారు.
వారిని విడిచి పెట్టకపోతే హమాస్‌కు నరకం చూపిస్తా..
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టకముందే హమాస్ చెరలో ఉన్న బందీలను రిలీజ్ చేయాలి.. అలా జరగకపోతే మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు నరకం చూపిస్తానని అతడు హెచ్చరించారు. చరిత్రలో ఎప్పుడూ చూడని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. తక్షణమే బందీలను విడుదల చేయండి అని సూచించాడు. గతంలో ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడను.. ఇప్పుడు జరగాల్సిందాని గురించి ఆలోచించాలని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇక, నేను రేపు ఖతార్ రాజధాని దోహాకు వెళ్తున్నాను అని అమెరికాకు కాబోయే అధినేత డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. అక్కడ, పలు అంశాలపై పురోగతి లభిస్తుందని అనుకుంటున్నాను చెప్పుకొచ్చారు. అయితే, అంతకుముందు, ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన అల్ కస్సామ్ బ్రిగేడ్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అందులో అమెరికా- ఇజ్రాయెల్ జాతీయుడైన ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడుతూ.. నేను గత 420 రోజులుగా హమాస్ చెరలో బందీగా కొనసాగుతున్నట్లు తెలిపాడు. మేమంతా భయంతో రోజుకు వెయ్యిసార్లు చస్తున్నామని వాపోయాడు. మమ్మల్ని త్వరగా విడిపించండి అంటూ అభ్యర్థించాడు.. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
‘వన్‌ప్లస్ 13’ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేశాయి.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలో వన్‌ప్లస్ 13 సిరీస్‌ను రిలీజ్ చేసింది. మంగళవారం నిర్వహించిన వింటర్ లాంచ్ ఈవెంట్‌లో 13 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్‌లను లాంచ్ చేసింది. 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 808 మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫ్లాగ్‌షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లకు నాలుగేళ్ల ఓఎస్ అప్‌డేట్లు, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను ఇస్తున్నట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. 13 సిరీస్ ఫోన్‌ల ధర, స్పెసిఫికేషన్ల డీటెయిల్స్ చూద్దాం. వన్‌ప్లస్ 13 ఫోన్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.69,999గా ఉండగా.. 16జీబీ+512జీబీ ధర రూ.76,999గా ఉంది. ఇక టాప్ వేరియంట్ 24జీబీ+1టీబీ ధరను రూ.89,999గా కంపెనీ నిర్ణయించింది. జనవరి 10 నుంచి ఈ ఫోన్లు అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి. మిడ్‌నైట్ ఓషన్, ఆర్కిటిక్ డాన్, బ్లాక్ ఎక్లిప్స్ రంగుల్లో ఇది లభ్యం కానున్నాయి. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ కార్డుపై రూ.5 వేల తగ్గింపు ఆఫర్ ఉంది. రూ.7వేల వరకు అదనపు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
ఏఎఫ్‌ఐ అధ్యక్షుడిగా బహదూర్‌సింగ్!
రెండు రోజుల పాటు సాగనున్న అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం చండీగఢ్‌లో ఆరంభమైంది. ఏఎఫ్‌ఐ అధ్యక్షుడిగా మాజీ షాట్‌పుట్ క్రీడాకారుడు, పద్మశ్రీ బహదూర్‌సింగ్ సాగూ ఎన్నికయ్యారు. ఆదిల్ సుమరివాలా స్థానంలో బహదూర్‌సింగ్ బాధ్యతలు చేపట్టారు. పోటీలో మరెవ్వరూ లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2029 వరకు ఏఎఫ్‌ఐ అధ్యక్షుడిగా కొనసాగుతారు. బహదూర్‌సింగ్ 2002 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచారు. 2000, 2004 ఒలింపిక్స్‌లోనూ ఆయన పాల్గొన్నారు. భారత్ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్లోబల్ జావెలిన్ ఛాంపియన్‌షిప్ జరగబోతోందని ఏఎఫ్‌ఐ వెల్లడించింది. ఈ పోటీల్లో స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రాతో పాటు స్టార్ జావెలిన్ ఆటగాళ్లు ఆడబోతున్నారు. ‘వచ్చే సెప్టెంబర్‌లో భారత్‌లో ప్రపంచ స్థాయి జావెలిన్ ఛాంపియన్‌షిప్ జరగబోతోంది. నీరజ్ చోప్రాతో పాటు టాప్-10 ర్యాంకు ప్లేయర్లు టోర్నీలో ఆడబోతున్నారు. 2027 ప్రపంచ రిలేస్, 2028 ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్, 2029 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు బిడ్‌లు మొదలయ్యాయి. వీటి నిర్వహణకు భారత్ తన ఆసక్తిని తెలియజేసింది’ అని ఆదిల్ సుమరివాలా తెలిపారు.
ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన రజాకార్.. ఎప్పుడంటే.?
తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, ప్రేమ, అనుష్య త్రిపాఠి, ఇంద్రజ, అనసూయ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రలు పోషించారు. గతేడాది మార్చిలో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓ మోస్తారు సక్సెస్ రాబట్టింది. రాజాకార్ల పాలనలో జరిగిన డార్క్ సైడ్ ను సిల్వర్ స్క్రీన్ పై చక్కగా మలిచాడు దర్శకుడు.ఈ సినిమా రిలీజ్ కు ముందు పలు వివాదాలకు కారమైంది. విడుదల చేయద్దంటూ కోర్టుల్లో కేసులు కూడా వేసారు. అలా రిలీజ్ అయిన ఈ సినిమాను ఓటీటీ లో మాత్రం రిలీజ్ కాలేదు. థియేటర్స్ లో రిలీజ్ అయి పది నెలలు కావొచ్చినా ఓటీటీ రిలీజ్ కానీ ఈ సినిమా ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. రజాకార్ ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు ప్లాట్ ఫామ్ ఆహా కొనుగోలు చేసింది. ఇన్నాళ్లకు అహ స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. జనవరి 24 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘రజాకార్’ మూవీ స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. పలు వివాదాలకు కారణమైన ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ రాబడుతుందని ఆహా భావిస్తోంది. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రానికి గూడూరు నారాయణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిచారు..
ఏపీలో టికెట్ రేట్స్ పెంపుపై హైకోర్టులో పిటిషన్
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్. ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘రిలీజ్ రోజు అనగా జనవరి 12 తెల్లవారుజామున 4 గంటల బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500 గా నిర్ణయించారు.అలాగే రెగ్యులర్ షోస్ కు మల్టీప్లెక్స్ టికెట్ ధరపై పై రూ. 135, సింగిల్ స్క్రీన్‌లపై రూ. 110 పెంచుతూ జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ కు కూడా బెన్ఫిట్ షోస్ రూ.600పెంచడంతో పాటు రెగ్యులర్ షోస్ కు ముల్టీప్లెక్స్ లో రూ. 135, సింగిల్ స్క్రీన్‌లపై రూ. 110 పెంచుకోమని ఆదేశాలు జారీచేసింది ఏపీ ప్రభుత్వం. అయితే డాకు మహారాజ్, గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరలు పెంచటాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సినిమాలకు ఇలా బెన్ ఫిట్ షో అనుమతి ఇవ్వటం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని ప్రస్తావించారు పిటిషనర్. హైదరాబాద్ లోని సంధ్య ధియేటర్ ఘటనలో ఒకరు మృతి చెందారని, ఆ కేసుకు సంబంధించి FIR కాపీని జత చేసారు పిటిషనర్. నిబంధనలకు విరుద్ధంగా ఏపీలో టికెట్ ధరలు పెంచారని పిటిషన్ లో పేర్కొన్నారు. నేడు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు ఏ తీర్పుఇస్తుందోననే టెన్షన్ మేకర్స్ లో నెలకొంది.
డాకు మహారాజ్ ఇప్పటికీ RR వర్క్ పెండింగ్
సీనియర్ హీరోలలో హ్యాట్రిక్ హిట్స్ తో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అయన తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికె విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్. అందులో భాగంగా చిత్ర ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. కానీ ఇప్పటికి ఇంకా వర్క్ జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ డాకు మహారాజ్ ఫస్ట్ హాఫ్ ఆర్ ఆర్ ఫినిష్ చేసి లాక్ చేసేరు కానీ సెకండ్ హాఫ్ కు సంబంధించి ఇంకా వర్క్ పెండింగ్ ఉందట. దర్శకుడు బాబీ, తమన్ నిద్ర లేకుండా కంటిన్యూ గా ఈ వర్క్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారట. ఇంకా రెండు రోజుల వర్క్ బ్యాలెన్స్ ఉందని గ్యాప్ లేకుండా వర్క్ చేస్తున్నామని దర్శకుడు బాబీ స్వయంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్ ల్లో వెల్లడించారు. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న గేమ్ ఛేంజర్ కు కూడా తమన్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఆ సినిమా వర్క్ డిలే కారణంగా ముందు గేమ్ ఛేంజర్ ఫినిష్ చేసి, ఇప్పుడు డాకు మహారాజ్ వర్క్ స్టార్ట్ చేసాడు తమన్. రెండు రోజుల్లో టోటల్ వర్క్ ఫినిష్ చేయాల్సి ఉంది.