నేడు నరసరావుపేటకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.. ఇదే తొలిసారి
ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నరసరావుపేట JNTU కాలేజీలో వన మహోత్సవంలో పాల్గొంటారు. విద్యార్థులతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మొక్కలు నాటనున్నారు. తర్వాత జేఎన్టీయూ ప్రాంగణంలోనే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు.. జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.. నరసరావుపేట మండలం కాకాని వద్ద ఉన్న జేఎన్‌టీయూ కశాళాల ప్రాంగణంలో ఆటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న వనమహోత్సవం కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎంల హోదాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొంటారు.. వేర్వేరుగా రెండు హెలిక్యాప్టర్లలో జేఎన్‌టీయూకు చేరుకోనున్నారు ఇద్దరు నేతలు.. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.. ముందుగా మొక్కలు నాటి వనమహోత్సావాన్ని ప్రారంభించిన తర్వాత .. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు.. పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు..
పిఠాపురంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు.. అడపడుచులకు డిప్యూటీ సీఎం అదిరిపోయే గిఫ్ట్‌లు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై అందరి ఫోకస్ ఉంది.. దానికి అనుగుణంగా.. పవన్ కల్యాణ్ కూడా తన నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.. ఓవైపు తనకు కేటాయించిన శాఖలపై పట్టుకోసం ప్రయత్నాలు చేస్తూనే.. నియోజకవర్గంలోనూ క్షేత్రస్థాయిలో పర్యటించారు.. అంతేకాదు.. ఆ నియోజకవర్గంలోని ఆడపడుచుల మనసులు గెలుచుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం.. శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అయిన ఈ రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా.. 12 వేల చీరలను పిఠాపురంలోని ఆడపడుచులకు పంపించారు పవన్ కల్యాణ్.. అయితే, ప్రతీ ఏడూ శ్రావణమాసం చివరి శుక్రవారం రోజున పిఠాపురంలోని పురూహూతికా దేవాలయంలో పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు ఆడపడుచులు.. అదే కోవలో ఈ ఏడాది కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు చేయగా.. తాను గెలిచిన తర్వాత వచ్చిన తొలి ఈవెంట్ కాబట్టి.. అందరికీ అదిరిపోయే గిఫ్ట్‌లు పంపారు పవన్ కల్యాణ్.. .
నేడు విజయవాడకు ముంబై నటి జత్వానీ.. సీపీతో భేటీ..!
ముంబై నటి కాదంబరి జత్వానీ ఇవాళ విజయవాడకు వచ్చే ఛాన్స్ ఉంది. ఐపీఎస్ అధికారులు తనను తన ఫ్యామిలీని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపణలు చేస్తోంది జత్వానీ. ప్రభుత్వం విచారణకు ఆదేశించటంతో ఈరోజు విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబును జత్వానీ కలుస్తుందని సమాచారం. మొత్తం ఘటనపై నాలుగు రోజుల్లో విచారణ అధికారి స్రవంతి రాయ్ నివేదిక ఇవ్వనున్నారు. అయితే, గురువారం రాత్రే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమె.. రాత్రి హైదరాబాద్‌లో బస చేశారు.. ఇక, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. నటి జత్వానీపై వేధింపుల కేసుని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆమె నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు తీసుకోవాలని.. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఇప్పటికే CMO ఆదేశాలు ఇచ్చింది. తనకు, తన కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని జత్వానీ కోరింది. ఇక కాదంబరి జత్వానీ ముంబై నుంచి హైదరాబాద్ చేరుకుంది. ఆ తర్వాత ఆమెను ఏపీ పోలీసులు విజయవాడకు తీసుకువెళ్లనున్నారని తెలుస్తోంది. వేధింపుల వ్యవహారానికి సంబంధించి ఆమె స్టేట్ మెంట్‌ను రికార్డు చేసే అవకాశం ఉంది. మరోవైపు.. తన దగ్గర ఉన్న ఆధారాలను ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని తెలిపింది జత్వానీ. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని చెబుతోంది. తనపై 2014లో మల్టిపుల్ క్రిమినల్ కేసులు నమోదు చేశారని.. గత ప్రభుత్వ పెద్దలు తనను అట బొమ్మలా వాడుకున్నారని తెలిపింది. చట్ట వ్యతిరేకంగా కొందరు గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చిత్ర హింసలకు గురిచేశారని ఆరోపిస్తోంది జత్వానీ.
ఐంఎండీ కీలక హెచ్చరిక.. నేడు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా గుజరాత్ రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అలాగే ఆర్థికంగా కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదిలావుంటే, తాజాగా భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎండీ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, సౌరాష్ట్ర, కచ్, ఒడిశా, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది..
గమనిక.. నగరంలో నీటి సరఫరా బంద్..
జలమండలిలోని ఓఅండ్‌ఎం డివిజన్-2లోని బాలాపూర్ రిజర్వాయర్ కింద గుర్రం చెరువు నుంచి సన్నీ గార్డెన్స్ వరకు ఎస్‌ఎన్‌డీపీ డ్రెయిన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాలాపూర్ రిజర్వాయర్ అవుట్‌లెట్ 450 ఎంఎం డయా పైప్‌లైన్ డైవర్షన్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. నేడు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు శనివారం (రేపు) రాత్రి 8 గంటల వరకు ఈ పనులు జరగనున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. రాజా నరసింహ కాలనీ, ఇందిరానగర్, పిసల్‌బండ, దర్గా బురాన్‌షాహి, ఘాజీ-మిల్లత్, ఉప్పుగూడ, DMRL, DRDL, గారిసన్ ఇంజనీర్-1, 2, DRDO మిధాని, OYC హాస్పిటల్, BDL, CRPF సెంట్రల్ విద్యాలయం, హస్నాబాద్, ందనగర్, సంతోష్‌నగర్ ఓల్డ్ కాలనీ , యాదగిరి కమాన్ ఎదురుగా ఉన్న ప్రాంతం, MIGH, HIGH, LIGH కాలనీలు, ఫహాబా మసీదు, మారుతీనగర్, పోచమ్మ గడ్డ, హనుమాన్ టైలర్ గల్లీ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని, ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకుని సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తస్మాత్ జాగ్రత్త.. కండోమ్స్ కొంటే మీ వివరాలు లీకైనట్టే..
యూకే ఆధారిత కండోమ్, పర్సనల్ లూబ్రికెంట్స్ బ్రాండ్ స్థానిక విభాగం అయిన డ్యూరెక్స్ ఇండియా నుంచి తన కస్టమర్ల ప్రైవేట్ సమాచారం లీక్ అయింది. డ్యూరెక్స్ భారతీయ విభాగం భద్రతా ఉల్లంఘనకు గురైంది. దీని వలన సున్నితమైన కస్టమర్ డేటా చోరీకి గురైంది. సౌరజీత్ మజుందార్ అనే సెక్యూరిటీ రీసెర్చర్ ఈ విషయాన్ని టెక్ క్రంచ్‌కు నివేదించారు. దీంతో కస్టమర్లు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. డ్యూరెక్స్ ఇండియా వెబ్‌సైట్ ఆర్డర్ కన్ఫర్మేషన్ పేజీలో ప్రాపర్ అథంటికేషన్ లోపించిందని, దీని వలన గుర్తు తెలియని వ్యక్తులు వెబ్ సైట్లోకి చొరబడి ప్రైవేట్ కస్టమర్ డేటాను చోరీ చేశారని తెలిపారు. డేటాలో కస్టమర్ పేర్లు, ఫోన్ నంబర్‌లు, ఇమెయిల్ చిరునామాలు, షిప్పింగ్ అడ్రస్, ఆర్డర్ చేసిన ఉత్పత్తులు, చెల్లించిన మొత్తం వివరాలు ఉంటాయి. ఎంత మంది డేటా లీక్అయిందో కంపెనీ మాత్రం వెల్లడించలేదు.. ఈ సంఖ్య వందల నుంచి వేల వరకు ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. డ్యూరెక్స్ ఇండియా ఆర్డర్ కన్ఫర్మేషన్ పేజీలో సరైన భద్రత లేకపోవడంతో ఇది జరిగినట్లు గుర్తించారు. ఈ పర్యవేక్షణ సెన్సిటివ్ అయిన కస్టమర్ సమాచారాన్ని లీక్ చేయడానికి దారితీసింది. డేటా ఇప్పటికీ అందుబాటులో ఉందని.. మరో సారి దోపిడీని ఇప్పటికీ పునరావృతం చేయవచ్చని మజుందార్ చెప్పారు. ఆ కారణంగా డ్యూరెక్స్ ఇండియా సమస్యను పరిష్కరించే వరకు లోపం వివరాలను రహస్యంగా ఉంచింది.
సీనియర్ సిజన్ల కోసం అద్భుత పథకం.. ఉద్యోగ విరమణ తర్వాత నెలకు రూ.20వేలు!
ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి నెలా ఆదాయాన్ని సంపాదించడం ఉద్యోగస్తులకు అంత సులభం కాదు. అయితే ఉద్యోగ సమయంలో డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టినట్లయితే.. ఈ పని కూడా సులభం అవుతుంది. మీరు పదవీ విరమణ తర్వాత కూడా నెలవారీ ఆదాయాన్ని పొండానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు మనం అటువంటి స్కీమ్ గురించి తెలుసుకుందాం.. ఇది ప్రభుత్వ పథకం. చిన్న పొదుపు పథకం కింద పనిచేస్తుంది. ఈ పథకం పదవీ విరమణ ప్రణాళిక కోసం ప్రముఖ పథకాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పోస్ట్ ఆఫీస్ పథకాల యొక్క గొప్ప పథకం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS). సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా ప్రతి నెలా ఐదేళ్లపాటు రూ.20 వేలు సంపాధించవచ్చు. ఈ ప్రభుత్వ పథకం కింద 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఎస్సీఎస్ఎస్ పథకం కింద.. 5 సంవత్సరాల మెచ్యూరిటీ ఉంది. ఇందులో నెలవారీ పెట్టుబడికి బదులు ఒక్కసారి మాత్రమే డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు.
సంచలనం.. 26 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడు..
ఆస్ట్రేలియా క్రికెటర్ విల్ పుకోవ్స్కీ క్రికెట్ కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. అనేక తల గాయాల కారణంగా, వైద్యులు అతనిని క్రికెట్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కారణంగా ఈ వర్ధమాన ఆస్ట్రేలియా క్రికెటర్ ఇంత త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు పుకోవ్స్కీ తలకు చాలాసార్లు గాయాలయ్యాయి. మార్చి 2024లో అతనికి తగిలిన గాయం చాలా తీవ్రంగా మారింది. పదే పదే గాయాలు అతని ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో 26 ఏళ్ల వయసులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మెడికల్ ప్యానెల్ సిఫారసు మేరకు 26 ఏళ్ల ఆటగాడు క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు. 2022లో జరిపిన వైద్య పరీక్షలో అతని తల గాయాలు కొన్ని అసలు గాయాలు కావని.., ఒత్తిడి కారణంగా సంభవించాయని తేలింది. ఇది అతని అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగించడం మరింత కష్టతరం చేసింది. పుకోవ్స్కీ తన చిన్న కెరీర్‌లో 13 సార్లు బంతిని తలకు తగిలించుకున్నాడు. పుకోవ్స్కీ జనవరి 2021లో భారత్ తో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతను అద్భుతంగా ఆడాడు. కానీ. అతని కెరీర్ పదేపదే గాయాలతో ప్రభావితమైంది. దాని కారణంగా అతను అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను ఎక్కువగా ప్రదర్శించలేకపోయాడు. పుకోవ్‌స్కీ 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ల్లో 45 కంటే ఎక్కువ సగటుతో 2350 పరుగులు చేశాడు. ఐకమరోవైపు 14 లిస్ట్ A మ్యాచ్ లలో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీల సహాయంతో 333 పరుగులు చేశాడు. పుకోవ్స్కీ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడి ఆ టెస్టు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు.
రోహిత్ శర్మ రికార్డును బద్దలుగొట్టిన రూట్!
జో రూట్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం చురుకైన ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా జో రూట్ నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు.. అతను మూడో స్థానంలో ఉన్నాడు. కానీ ఆగస్టు 29న లార్డ్స్‌లో తన టెస్ట్ కెరీర్‌లో 33వ సెంచరీని సాధించి రెండో స్థానాన్ని సాధించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో యాక్టివ్‌గా ఉన్న ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్రత్యేక రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. ప్రస్తుతం అతడు మొత్తం 80 సెంచరీలు చేశాడు. అతని తర్వాత రూట్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. రూట్ ఖాతాలో ఇప్పుడు మొత్తం 49 సెంచరీలు ఉన్నాయి. రూట్ కంటే ముందు.. భారత స్టార్ రోహిత్ శర్మ 48 సెంచరీలతో ప్రత్యేక జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే నిన్న రూట్ సెంచరీ చేయడం రోహిత్ ను దాటేశాడు. ‘హిట్‌మ్యాన్’ శర్మ ప్రస్తుతం 48 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.
బన్నీ మెప్పిస్తాడా..? చిరు, మహేష్, దేవర కొండ ను మించి చేస్తాడా..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పుష్ప 2 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్‌లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే రెడ్ బస్ యాడ్ లో నటించిన బన్నీ మరో యాడ్ లో కనిపించబోతున్నాడు. ‘థమ్స్ అప్’ యాడ్ బన్నీ చేతికి వచ్చింది. బన్నీ ఈ యాడ్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు థమ్స్ అప్ యాడ్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించి.. సందడి చేశారు. ఇక ఇప్పుడు ఈ యాడ్ లో బన్నీ మెరవబోతున్నాడు. తమ హీరో అరుదైన ఘనత సాధించడంతో పాటు క్రేజ్ పెరిగిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ యాడ్ లో బన్నీ ఏ రేంజ్ స్టంట్స్ చేస్తాడో అని క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో మరో ఘనత సాధించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బన్నీ ఈ యాడ్ లో అందరిని మెప్పిస్తాడా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే పుష్ప అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే డైలాగ్ తగ్గేదే లే.. ఈ డైలాగ్ ప్రతి ఒక్కరి నోట వస్తున్న మాటే.. ఇదే డైలాగ్ థమ్స్ అప్ యాడ్ లో వాడుకుంటారా? అనే మాటలు వినిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం అలా ఏమీ ఉండదు.. ఈ యాడ్ లో వెరైటీ స్టంట్ చేసి బన్నీ అందరిని మెప్పిస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ ఐకాన్ స్టార్ పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొంటుండగా.. త్వరలోనే షూటింగ్‌ని పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసి ప్రమోషన్స్‌ను చేపట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.