రెండో రోజు చంద్రబాబు సింగపూర్ టూర్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం పర్యటన సింగపూర్‌లో కొనసాగుతోంది.. ఇవాళ రెండో రోజు సీఎం చంద్రబాబు మరింత బిజీగా గడపనున్నారు.. ఎయిర్ బస్, హనీవెల్, ఎవర్వోల్ట్ ప్రతినిధులతో సమావేశాలు కాబోతున్నారు.. రెండోరోజు పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా.. పలు సంస్థల అధిపతులతో సమావేశంకానున్నారు.. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చించబోతున్నారు.. భారత కాలమాన ప్రకారం ఉదయం 7 గంటలకు ట్రెజరీ బిల్డింగ్‌లో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానుండగా.. విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చించనున్నారు.. ఇక, ఉదయం 8.30 గంటలకు ఎయిర్‌బస్ సంస్థ ప్రతినిధులు కృతీవాస్, వేంకట్ కట్కూరితోనూ చంద్రబాబు సమావేశం అవుతారు.. ఉదయం 9 గంటలకు హనీవెల్ సంస్థ ప్రతినిధులతో మీటింగ్ ఉండగా.. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.. ‘నైపుణ్యాల నుంచి సామర్థ్యాల వైపు మరలడం : కార్మిక శక్తిని వేగవంతం చేయడం అనే అంశంపై చర్చ సాగనుంది.. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ, సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్శిటీ, సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ & డిజైన్ విద్యార్ధులు పాల్గొంటారు..
చికెన్ సిండికేట్..! వాళ్లు నిర్ణయించిందే ధర.. లేదంటే..?
ముక్క లేకుంటే ముద్ద దిగాని వాళ్లు చాలా మంది ఉన్నారు. కనీసం వారానికి ఒకసారైనా మసాలా రుచి చూడకుంటే మనసు లాగేస్తుంది. ప్రతీ పూటా నాన్‌వెజ్ లాగించేవారు కూడా ఉన్నారు. ఈ డిమాండ్‌ను ఆసరాగా తీసుకుని నంద్యాల జిల్లాలో చికెన్ సిండికేట్ ఏర్పాటైంది. డోన్‌లో వీరు కోసిందే కోడి..! చెప్పిందే రేటు అన్నట్టు తయారైంది పరిస్థితి. ఉన్న రేటుకన్నా ఎక్కువకు ఇక్కడ సిండికేట్‌గా మారి వ్యాపారులు చికెన్ అమ్ముతున్నారు. ఈ దందా చాన్నాళ్లుగా సాగుతోంది. ఒక వేళ ఎవరైనా తక్కువ రేటుకు అమ్మితే వెంటనే బలవంతంగా దాడులు చేసి షాపులు మూయించేస్తున్నారు. డోన్‌లో చికెన్ షాపులు 50కి పైగానే ఉన్నాయి. ప్రతి రోజు 4 వేల నుంచి 5 వేల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. ఆదివారం ఇది రెండింతలు ఉంటుంది. ఇక్కడ అమ్మే రేటు మరెక్కడా ఉండదు. చికెన్ సిండికేట్లో కిలో పైన 40 నుంచి 50 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. అయితే, వీరితో కలవలేదని TR నగర్‌లో ఒక షాపుపై 6 నెలల క్రితం దాడి చేశారు.. తాజాగా గెలాక్సీ చికెన్ సెంటర్ యజమాని తక్కువ రేటుకు అమ్ముతున్నాడని బలవంతంగా షాపును మూయించేశారు. చికెన్ సిండికేట్ దౌర్జన్యాలపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఇప్పటికైనా చికెన్ షాపుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు స్థానికులు. సిండికేట్‌గా మారి.. అధిక ధరలకు చికెన్ విక్రయించడం ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు, సిండకేట్‌లో చేరని వ్యాపారులపై దాడులు ఏంటి అంటూ మండిపడుతున్నారు..
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ సమావేశమవుతుంది. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్‌కు పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాపై చర్చిస్తుంది. దీంతో పాటు సిగాచి పరిశ్రమలో అగ్నిప్రమాదంపై నిపుణుల కమిటీ నివేదిక, దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల అంచనాల సవరణ, సీతారామ ప్రాజెక్టు, SRSP ప్రాజెక్టు పనులపైనా చర్చించబోతోంది మంత్రివర్గం. ఇక, ఇవాళే కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశం ఉంది. నివేదిక అందితే కేబినెట్ భేటిలో యథావిధిగా జస్టిస్ పీ.సీ. ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. జూలై 31తో కమిషన్ పదవీకాలం ముగియనుండటంతో ఆలోపే కాళేశ్వరం నివేదిక ఇవ్వాలని కమీషన్ చైర్మన్ ఘోష్ నిర్ణయించారు. ఇప్పటికే విద్యుత్ సంస్థలో అక్రమాలకు సంబంధించి జస్టిస్ మదన్ భీమ్‌రావ్ లోకూర్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఘోష్ నివేదిక అందితే రెండు కమిషన్ రిపోర్టులకు మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంది. ఆమోదం తర్వాత రెండు కమిషన్ల రిపోర్టుపై తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది.
ఫ్రెండ్ బర్త్ డే కోసం వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురైన యువకులు.. ఒకరి మృతి
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. నలుగురు యువకులు ఫ్రెండ్ బర్త్ డే కోసం ఎర్టీగా కారు రెంట్ కి తీసుకుని వెళ్లారని తెలిపారు. బర్త్ డే పార్టీలో మద్యం సేవించినట్లు వెల్లడించారు. పార్టీ అనంతరం తిరిగి వస్తుండగా తెల్లవారుజామున యువకులు మద్యం మత్తులో కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో కారు బోల్తా కొట్టినట్లు తెలిపారు. ప్రమాద ధాటికి కరెంట్ స్తంభం విరిగిపోయింది. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ఈ ప్రమాదంలో జశ్వంత్ అనే 18 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. గాయపడ్డ వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న నలుగురు యువకులు 20 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
అరుదైన రికార్డ్ సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్..
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు సృష్టించారు. యూపీకి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ఆయన 8 ఏళ్ల 132 రోజులు ఈ పదవిలో ఉన్నారు, కొనసాగుతున్నారు. అంతకు ముందు ఉన్న గోవింద్ వల్లభ్ పంత్ రికార్డును యోగి అధిగమించారు. పంత్ యూపీకి ముఖ్యమంత్రిగా 8 ఏళ్ల 127 రోజులను యోగి అధిగమించారు. ఈ మైలురాయితో యూపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ మొదట మార్చి 19, 2017న ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వరసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉత్తర్ ప్రదేశ్‌లో వరసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రికార్డు కూడా యోగి, బీజేపీ పార్టీకి ఉంది. తన పాలనలో మాఫియా డాన్‌లు, నేరస్తులను అణిచివేయడంతో యోగి మార్క్ కనిపించింది.
హిందూ అమ్మాయిలే టార్గెట్, పట్టుబడిన ‘‘లవ్ జిహాద్’’ గ్యాంగ్..
ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతంతోకి మార్చుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘‘లవ్ జిహాద్’’ ముఠాను ఉత్తర్ ప్రదేశ్ కుషినగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. సునీల్ వర్మ అనే వ్యక్తి, తన 19 ఏళ్ల కుమార్తెను ప్రలోభపెట్టి అమృత్‌సర్ తీసుకెళ్లారని, అక్కడ ఆమెను బలవంతంగా మతం మార్చి, దాచిపెట్టారని ఫిర్యాదు దాఖలు చేయడంతో ఈ అరెస్టులు జరిగాయి. ఫిర్యాదు రావడంతో స్థానిక పోలీసులు, సైబర్ సెల్ సంయుక్తంగా ఆదివారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి బాలికను సురక్షితంగా రక్షించారు. పోలీసులు రెండు ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఒకదాంట్లో ఆమె పేరు నేహా శర్మగా, మరొక దాంట్లో మతం మార్చిన తర్వాత పర్వాణి ఖాటూన్ అనే పేరుతో ఉంది. 11 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఐదో టెస్టుకు పంత్ దూరం.. జట్టులోకి తమిళనాడు ప్లేయర్
మాంచెస్టర్‌లో భారత, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాల్గవ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి టెస్ట్ జూలై 31 నుంచి లండన్ లో జరుగనుంది. కాగా ఐదో టెస్టుకు సిరీస్ హీరో పంత్ దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. రిషబ్ పంత్ గాయం కారణంగా ఐదవ టెస్ట్ కు దూరమయ్యాని తెలిపింది. అతని స్థానంలో వికెట్ కీపర్, బ్యాటర్ ఎన్ జగదీశన్ ను జట్టులోకి తీసుకున్నారు. బోర్డు 5వ టెస్ట్ కు కొత్త జట్టును కూడా ప్రకటించింది. మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్ సందర్భంగా కుడి కాలుకి గాయం కారణంగా రిషబ్ పంత్ ఐదవ మరియు చివరి టెస్ట్‌కు దూరమైనట్లు బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో 2025 జూలై 31న ప్రారంభమయ్యే ఐదవ టెస్ట్ కోసం రిషబ్ పంత్ స్థానంలో నారాయణ్ జగదీశన్‌ను పురుషుల సెలక్షన్ కమిటీ జట్టులోకి తీసుకుంది.
ఒకే సారి 5 సినిమాలు స్టార్ట్ చేస్తున్న ‘యాత్ర 2’ మేకర్స్
విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా 70మMM ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై వచ్చిన చిత్రం యాత్ర 2. 2024లో రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమాకు మహి వి రాఘవ దర్శకత్వం వహించారు. ఇందులో మలయాళ నటుడు ముమ్మట్టి, తమిళ నటుడు జీవా ముఖ్య పాత్రలు పోషించారు. కానీ ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. ఈ సినిమాను నిర్మించిన 70మMM ఎంటటైన్మెంట్స్ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపింది. యాత్ర 2 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ నిర్మాణసంస్థ ఏకంగా ఐదు సినిమాలను లైన్ లో పెట్టింది. ఒకే సారి అయిదు సినిమాలు అనౌన్స్ చేసి, ప్రారంభించబోతోంది. స్మాల్ టు మిడ్ రేంజ్ హీరోలతో ఈ సినిమాలు ఉండబోతున్నాయి. ఆగస్ట్ రెండో వారంలో అనౌన్స్ మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఆ వెంటనే షూటింగ్ కూడా చేసేలా ప్లాన్ చేస్తున్నారట. వినిపిస్తున్న సమాచారం ప్రకారం యంగ్ హీరోలు నాగ శౌర్య, గోపీచంద్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆకాష్ పూరిలతో సినిమాలు చేయబోతున్నారట. అయితే ఈ ఐదుగురు యంగ్ హీరోలు హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. అలంటి వారితోనే హిట్ సినిమా తీయాలని చూస్తున్నట్టున్నారు మేకర్స్. ఈ బ్యానర్ లో సుధీర్ బాబు ఇప్పటికే రెండు సినిమాలు చేసాడు. ముచ్చటగా మూడవసారి నటిస్తున్న ఈ బ్యానర్ లో ఈ సారైనా హిట్ కొడతాడో లేదో. కాకుంటే ఈ ఐదు సినిమాలకు దర్శకులు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ బ్యానర్ లో కంటిన్యుగా సినిమాలు చేస్తున్న మహి వి రాఘవ కూడా సినిమా చేసే అవకాశం లేకపోలేదు.
బాబీ – చిరు కాంబో ఫిక్స్.. శ్రీకాంత్ ఓదెల సినిమా లేనట్టేనా.?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ బాబీ కాంబోలో వచ్చిన సినిమా వాల్తేర్ వీరయ్య. 2023సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వరుస ఫ్లోప్స్ తో సతమతమవుతున్న మెగాస్టార్ కు ఆ సినిమా బ్రేక్ వేసి సక్సెస్ ఇచ్చింది. మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా రవితేజ ఈ కీలక పాత్రలో కనిపించగా దర్శకుడు బాబీ ఇద్దరు హీరోలను చక్కగా హ్యాండిల్ చేసాడు. ముఖ్యంగా చిరులోని వింటేజ్ ఫన్ టోన్ ను మరోసారి చూపించాడు బాబీ. కాగా మరోసారి మెగాస్టార్ , బాబీ కాంబో రిపీట్ కానుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘విశ్వంభర’ షూటింగ్ ముగించేశారు. సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకులు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా కూడా ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకుంది. ఇప్పుడీ రెండు ప్రాజెక్ట్‌లు కాకుండా తనకు ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఘన విజయాన్ని అందించిన దర్శకుడు బాబీ కొల్లితో మరోసారి సినిమా చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన డాకు మహారాజ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాబీ అదే జోష్ లో మెగాస్టార్ తో సినిమా కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథ రెడీ చేసాడట. ఈ ఏడాది సెప్టెంబర్ లో బాబీ – మెగాస్టార్ సినిమాల మొదలు కానుంది. అలాగే యంగ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమాను ప్రకటించిన చిరు. ఆ సినిమాను బాబీ సినిమా తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
అఖండ 2 vs OG.. నీ యవ్వ తగ్గేదేలే..
వస్తే అతి వృష్టి.. లేదా అనా వృష్టిలా ఉంటుంది టాలీవుడ్ పరిస్థితి. చిన్న హీరో నుండి స్టార్ హీరో వరకు అందరు ఇంతే. ఇప్పుడు రాబౌయే సెప్టెంబర్ రేస్ లో రెండు పెద్ద సినిమాలు నువ్వు నేనా అనే రీతిలో పోటిపడుతున్నాయి. సెప్టెంబర్ 25 మేము వచ్చేది ఫిక్స్ వెనకడుగు వేసేది లేదు అని ఓ సినిమా నిర్మాత అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరతాం అని చెప్తున్నారు. వివరాలలోకెలితే బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తుంది అఖండ 2. భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమాను సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ఇది వరకే ప్రకటించారు మేకర్స్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవి OG. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే OG షూటింగ్ ముగించేసుకుని రెడీ గా ఉంది. కానీ బాలయ్యా – బోయపాటిల అఖండ 2 షూటింగ్ ఇంకా జరుగుతుండడంతో సెప్టెంబర్ 25 రిలీజ్ ఉండదు వాయిదా పడుతుందని టాక్ వినిపించింది. కానీ కేవలం ఒకే ఒక సాంగ్ మినహా షూట్ మొత్తం ఫినిష్ అయింది మరో వారం రోజుల్లో ఫినిష్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి రిలీజ్ కు రెడీ అవుతామని యూనిట్ నుండి సమాచారం. సో సెప్టెంబర్ 25న రెండు సినిమాలు రిలీజ్ కావడం ఫిక్స్. ఈ విషయంలో ఎవరు తగ్గదేలే అనే చెప్తున్నారు.