ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మృతి, 8 మందికి సీరియస్..!
నంద్యాల జిల్లాలో ఓ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.. నంద్యాల మండలం చాపిరేవులలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలు వెంకటమ్మా , ఆరేళ్ళ బాలుడు పండు మృత్యువాత పడ్డారు. రెండు ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.. ఓ ఇంట్లో సోమవారం రాత్రి సమయంలో ఇంట్లో సిలిండర్ సరిగ్గా ఆఫ్ చేయకపోవడంతో.. గ్యాస్ ఇల్లంతా వ్యాపించింది. అయితే, మంగళవారం తెల్లవారుజామున వృద్ధురాలు వెంకటమ్మ లైట్ వేయడంతో ఒక్కసారిగా సిలెండర్ పేలి, మంటలు వ్యాపించాయి. భారీగా శబ్దం చేస్తూ రెండు ఇళ్లు కూలిపోయాయి. మంటల్లో వృద్దురాలు వెంకటమ్మ , ఆరేళ్ల బాలుడు పండు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. మంటలను అదుపులోకి తెచ్చి, శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందిన బాలుడు పండును బయటికి తీశారు ఫైర్ సిబ్బంది. మరో ఇంట్లో శిథిలాల కింద ఉన్న వెంకటమ్మ బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో.. గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు..
రాయలసీమలో పరిశ్రమలకు కేంద్రం పెద్దపీట.. ఎన్ఐసీడీసీకి రూ.872 కోట్లు విడుదల..
వెనుకబడిన రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కు 872.07 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలంలోని కొప్పర్తిలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ ను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కు బదలాయించనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాక్షర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో నడుస్తున్న కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కును, ఇకనుంచి నేషనల్ ఇండస్ట్రియల్ క్యారిడార్ క్రిందికి వెళ్ళనున్నది. ప్రస్తుతం ఏపీఐసీసీ చేతిలో ఉన్న 2595.40 ఎకరాల భూములను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ కు బదిలీ చేయనున్నారు. ఏపీఐసీసీ నుంచి ఎన్ఐసిడిఐటికి భూములు బదలాయింపుకు అయ్యే 65.40 కోట్లు రూపాయల స్టాంప్ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. కొప్పర్తి లోని ఏపీఐసీసీ భూములు బదలాయింపు కోసం స్టాంప్ డ్యూటీ కింద 43.60 కోట్లు, రిజిస్ట్రేషన్ రుసుముల కోసం 8.72 కోట్లు, ట్రాన్స్ఫర్ డ్యూటీ కింద మరో 13.08 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అవసరమైన ఈ మొత్తం 65.40 కోట్ల రూపాయలను చెల్లించాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇస్తూ, రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పీసీ సిసోడియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూముల బద్దలాయింపు కాగానే నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొప్పర్తిలో మౌలిక వసతులకు శ్రీకారం చుట్టునున్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులను 872.07 కోట్లతో చేపట్టనున్నారు…
పెళ్లిలో భోజనం విషయంలో గొడవ.. కర్రలతో దాడి
అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లిలో సోమవారం రాత్రి ఓ వివాహ వేడుకలో భోజనం వడ్డించే విషయంలో మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఒక వర్గం మరో వర్గంపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘర్షణలో ఓ వర్గానికి చెందిన మాబు, ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. భోజనం వడ్డించే విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. మహమ్మద్ రసూల్, నూర్ భాషా, రెహనాతో పాటు మరో ఇద్దరు మాబు, ఆసిఫ్ పై కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో మహబూబ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
నేడే నాగోబా జాతర మొదలు.. మహా పూజతో జాతర షురూ
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా గుడి వద్ద నేడు నాగోబా మహా పూజల జాతర ఘనంగా ప్రారంభం కానుంది. రాత్రి మహాపూజతో జాతర ఆరంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగుతుంది. మెస్రం వంశీయులు సంప్రదాయరీతిలో ఈ జాతరలో పాల్గొననున్నారు. నాగోబా మహా పూజ ప్రత్యేకంగా నాగోబా దేవుడి పూజార్చనతో ప్రారంభమవుతుంది. మహాపూజ అనంతరం తెల్లవారుజామున కొట్టకోడళ్ళ బేటింగ్ (దేవుడికి పరిచయం చేసే సంప్రదాయం) నిర్వహించనున్నారు. ఇది వంశీయ సంప్రదాయానికి ఎంతో ప్రత్యేకమైన ఆచారం. జాతరలో భాగంగా, కేస్లాపూర్‌లోని మర్రిచెట్టును పూజించిన అనంతరం మెస్రం వంశీయులు గోవాడ్ వద్దకు చేరుకుంటారు. కోనేరు నుంచి కొత్త కుండలతో నీటిని తీసుకొచ్చి పుట్టను తయారు చేయడం వంశ ఆడపడుచులు, అల్లుళ్ల సంప్రదాయ విధిగా నిర్వహిస్తారు. మహాపూజ తర్వాత తెల్లవారుజామున కొట్టకోడ్ళ బేటింగ్, మరుసటి రోజు పెర్సాపెన్, భాన్పేన్ పూజలు, చివరగా ముగింపు పూజ మండగాజలి పూజతో మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు ముగుస్తాయి. ఈ నెల 31న నాగోబా దర్బార్‌ను నిర్వహించనున్నారు. ఈ దర్బార్‌లో నాగోబా వంశీయులు తమ సమస్యలను వర్గపెట్టి చర్చిస్తారు. ఇది వంశీయుల సమాగమానికి ప్రత్యేకమైన భాగం.
తమిళనాడులో పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు..
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. చెన్నై, మైలాడుతురై సహా 25 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఇందులో విదేశీ ఉగ్రవాద సంస్థలతో నిషేధిత ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి సంబంధాలు ఉన్నాయా అనే దానిపై ఆరా తీస్తుంది. అయితే, 2019లో తంజావూరులోని పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకె) నాయకుడు వీ. రామలింగం హత్య కేసు దర్యాప్తుతో తాజా ఆపరేషన్ ముడిపడి ఉన్నట్లు సమాచారం. అణగారిన వర్గాల ప్రజలను బలవంతపు మత మార్పిడులను వ్యతిరేకించినందుకు 2019 ఫిబ్రవరి 5వ తేదీన రామలింగం దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి గతంలో ఎన్ఐఏ 18 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. అలాగే, 2024 సెప్టెంబర్ 24న చెన్నై, కన్యాకుమారి, పుదుకోట్టైతో సహా తమిళనాడులోని 12 ప్రదేశాలలో ఎన్ఐఏ తనిఖీలు చేసింది. ఈ దాడులు నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బ్-ఉత్-తహ్రీర్ యొక్క రిక్రూట్మెంట్ కార్యకలాపాలకు గుర్తించింది. ఇందులో, ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలని హిజ్బ్-ఉత్-తహ్రీర్ వ్యవస్థాపకుడు తకీ అల్-దిన్ అల్-నభానీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భావ జాలాన్ని స్వీకరించిన HUT కార్యకర్త, అజీజ్ అహ్మద్ 2024 ఆగస్టు 31న దేశం విడిచి పారిపోవడానికి బెంగళూరు ఎయిర్ పోర్టుకు వెళ్లగా అతడ్ని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడితో పాటు మరో 17 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) మాజీ డైరెక్టర్ బలరామ్‌తో పాటు మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద సోమవారం నాడు కేసు నమోదు అయింది. అయితే, 2014లో హనీ ట్రాప్ కేసులో తనను అన్యాయంగా ఇరికించడంతో.. నన్ను ఉద్యోగం నుంచి తొలగించడానికి దారితీసిందని గిరిజన బోవి కమ్యూనిటీకి చెందిన మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్ దుర్గప్ప ఆరోపించారు. అయితే, ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్న దుర్గప్ప.. తనపై కులపరమైన విమర్శలతో పాటు బెదిరింపులను ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. దీంతో 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు నగరంలోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా, ఈ అంశంపై ఐఐఎస్సీ అధ్యాపకుల గానీ, ఐఐఎస్సీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యునిగా పని చేస్తున్న ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి గోపాలకృష్ణన్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక, ఈ కేసులో నిందితులుగా ఉన్న గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంద్యా విశ్వేశ్వర్, హరి కేవీఎస్, దాసప్ప, బలరామ్ పీ, హేమలతా మిషీ, ఛటోపాద్యాయ కే, ప్రదీప్ డీ సావ్కర్ తో పాటు మనోహరన్ ఉన్నారు.
యూకేలోని 200 కంపెనీలు కీలక నిర్ణయం.. వారానికి 4 రోజులే పని దినాలు!
యునైటెడ్ కింగ్డమ్లో పని భారాన్ని తగ్గించడానికి అక్కడి కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సుమారు 200 బ్రిటీష్ కంపెనీలు తమ ఉద్యోగులందరికీ ఎటువంటి జీతం కోల్పోకుండా వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని ప్రకటించాయి. ఇక్కడ, 5,000 మందికి పైగా ఉద్యోగులు మార్కెటింగ్, సాంకేతిక సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, 4- డే వీక్ ఫౌండేషన్ డైరెక్టర్ జో రైల్ మాట్లాడుతూ.. ఐదు రోజుల పని వారం అనేది గత 100 సంవత్సరాల క్రితం కనుగొనబడిందన్నారు. కాబట్టి, మేము కొత్తదనాన్ని తీసుకొచ్చాం.. వారంలో నాలుగు రోజుల పని దినాల తర్వాత ప్రజలు సంతోషంగా, సంతృప్తికరంగా జీవించడానికి కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కాగా, ఈ విధానం యూకేలో మొదట మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, ప్రెస్ రిలేషన్స్ సంస్థలు ఆమోదించాయి.. ఆ తర్వాత కార్మికులు జీతం కోల్పోకుండా వారంలో నాలుగు రోజుల పాటు పని చేసిన తర్వాత కంపెనీలకు మంచి విజయాలు దక్కినట్లు బ్రిటిష్ కంపెనీలు గుర్తించాయి.. అందుకే, ఈ పద్దతిని అమలు చేయడానికి 200 కంపెనీలు రెడీ అయినట్లు జో రైల్ వెల్లడించారు.
నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
టీమిండియా కుర్రాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఐదు టీ20 సిరీస్‌లో 2-0తో భారత జట్టు ముందంజలో ఉంది. ఈరోజు జనవరి 28) రాజ్‌కోట్ వేదికగా బట్లర్ సేనతో జరుగబోయే మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శనలు చేస్తూ సిరీస్ కైవసం చేసుకునేందుకు అడుగులు వేస్తుంది. రాజ్‌కోట్‌లోనూ అదే ఊపును కొనసాగించాలనే వ్యూహంతో బరిలోకి సూర్య సేన దిగబోతుంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌లలోనూ ఓడిన ఇంగ్లాండ్ జట్టు.. మూడో టీ20లో అయినా విజయం సాధించి సిరీస్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే, భారత జట్టు పగ్గాలను అందుకున్న సూర్య కుమార్ యాదవ్.. కెప్టెన్ అయ్యాక స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. సారథిగా జట్టుకు విజయాలను అందిస్తున్నప్పటికి.. వ్యక్తిగతంగా అతడి ఫామ్ మాత్రం బాగాలేదు. గత 17 ఇన్నింగ్స్‌లలో సూర్య.. 26.81 సగటుతో 429 రన్స్ మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో పరుగుల వరద పారే రాజ్‌కోట్‌లో అయినా గత ఫామ్‌ను సూర్య అందుకోవాలని భారత్ యాజమాన్యం ఆశిస్తోంది. ఇక, సౌతాఫ్రికా సిరీస్‌లో వరుస సెంచరీలతో రెచ్చిపోయిన సంజూ శాంసన్.. ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌లలోనూ షార్ట్ బాల్స్‌కు పెవిలియన్ బాట పట్టాడు. రాజ్‌కోట్‌లో అతడు విజృంభిస్తే భారత్‌కు మంచి శుభారంభం దక్కుతుంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మంచి టచ్‌లో ఉండగా.. రింకూ సింగ్, నితీశ్ కుమార్ గాయాలతో మ్యాచ్ లకు దూరం కాగా, ఈ మూడో టీ20లో శివమ్ దూబే, రమణ్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మాసివ్ పవర్ ప్యాక్డ్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. పది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 170 కోట్లకు పైగా వరకు గ్రాస్, రూ.85 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. లాంగ్ రన్లో వంద కోట్ల షేర్ కలెక్షన్స్‌ను డాకు మహారాజ్ ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాతో బాలయ్య వరుసగా నాలుగు వంద కోట్లు కొల్లగొట్టి సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు. లేటెస్ట్గా అనంతపురంలో ఈ సినిమా విజయోత్సవ వేడుక కూడా నిర్వహించారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే ఓ వైపు థియేటర్లో డాకు దుమ్ముదులిపేస్తుంటే, మరోవైపు ఈ సినిమా ఓటిటి డేట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో డాకు మహారాజ్ ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపుగా ఫిబ్రవరి 9 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ డేట్ రూమర్‌గానే ఉండనుంది. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలిచింది.
పెళ్లి గురించి ఓపెన్ అయిన మీనాక్షి చౌదరి
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల వరుస విజయాలు అందుకుంటు ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. గత ఏడాది కాలంగా ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ముక్యంగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ థియేటర్స్‌లో సత్తా చాటుతోంది. జనవరి 14 న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లను రాబడుతోంది. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రంలో వెంకటేష్ హీరోగా నటించగా.. వెంకీ భార్యగా ఐశ్వర్య రాజేష్, లవర్ గా మీనాక్షి చౌదరి నటించారు. ఇద్దరికి ఇద్దరు తమ నటనతో ప్రేక్షకుల మనసు దోచేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మూవీకి ప్రతి ఒక్కరు వందకి వంద మార్కులు వేశారు. దీంతో మీనాక్షి గ్రాఫ్ మరింత పెరిగిపోయింది. అయితే ఈ మూవీ సక్సెస్ లో భాగంగా టీం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి తన పెళ్లి, కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ ఓపెన్ అయింది.. మీనాక్షి మాట్లాడుతూ ‘ నాకు కాబోయే వాడు మంచి హైట్ ఉండటంతో పాటు బాగా తెలివైనవాడు, మంచి మనసున్నోడై ఉండాలి. ఓ మగాడిలో నాకు కావాల్సిన అంశాలు ఇవే. నాలాంటి రూపానికి తగిన అబ్బాయి కావాలి, నాకు సమానంగా మేల్ వెర్షన్ ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను’ అని మీనాక్షి చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.