మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ నానిపై మూడు కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశాయి. కొడాలి నానిపై గుడివాడలో 2, విశాఖపట్నంలో ఒక కేసు రిజిస్టర్ అయ్యాయి. ఇవి కాకుండా మైనింగ్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ సమయంలో కొడాలి నాని అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని డీజీపీకి టీడీపీ ఫిర్యాదు చేయటంతో లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు కొడాలి నాని చెలరేగిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లను ఇష్టమొచ్చినట్టు తిట్టిపోశారు. నోటికి ఎంతొస్తే అంత మాట అనేవారు. టీడీపీ టార్గెట్ లిస్ట్‌లో కొడాలి నాని పేరు అందరికంటే ముందుంది. కొడాలి నాని ఫ్రెండ్ అయిన వల్లభనేని వంశీ ఇప్పటికే కటకటాల్లో ఉన్నారు. 100 రోజులుగా జైలు జీవితం గడుపుతున్నారు వల్లభనేని వంశీ. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కొత్త కేసు వంశీపై నమోదవుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు వంశీపై మొత్తం 8 కేసులున్నాయి. ఇప్పుడు కొడాలి నానిపై ఫోకస్ చేసినట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.
పేలుళ్ల కుట్ర కేసులో కూపీ లాగుతున్న ఎన్‌ఐఏ.. ఏ నగరాలను టార్గెట్ చేసారు..?
బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు సిరాజ్, సమీర్‌లను విజయనగరం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారిద్దరినీ 7 రోజుల కస్టడీకి ఇస్తూ గురువారం సాయంత్రమే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలిచ్చింది. వారిద్దరూ విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. శుక్రవారం ఉదయమే విశాఖ సెంట్రల్ జైలుకు చేరుకున్న విజయనగరం పోలీసులు… సిరాజ్, సమీర్‌లను కస్టడీలోకి తీసుకుని విజయనగరంలోని పోలీస్ ట్రెయినింగ్ కాలేజీకి తరలించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ మాధవరెడ్డి, ఎన్ఐఏ, ఏటీఎస్ అధికారులు కూడా అక్కడకు చేరుకున్నారు. అందరూ కలసి సంయుక్తంగా సిరాజ్, సమీర్‌లను ప్రశ్నించారు. సిరాజ్, సయ్యద్ సమీర్ లాంటివాళ్లు మరికొంతమంది ఉండొచ్చని భావిస్తున్న ఎన్‌ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్, వరంగల్ సహా దేశ, విదేశాల్లో ఉగ్రవాద భావజాలమున్న యువకులతో వీరికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. సిరాజ్ లాంటివాళ్లు మరికొందరు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇక, ఉగ్ర కుట్ర నిందుతులు సిరాజ్, సమీర్‌ను నేడు రెండో రోజు విచారించనుంది ఎన్‌ఐఏ.. సిరాజ్ ఎక్కడెక్కడ కుట్ర ప్లాన్ చేసారు అన్న కోణంలోనే విచారణ సాగనుంది.. ఉగ్ర లింక్స్, పరిచయాలపైనేలు, ఎంత డబ్బులు ఇచ్చారు, వాటితో ఏం కొనుగోలు చేసారు.. బాంబుల తయాలికి ఏమైనా శిక్షణ ఇచ్చారా..? వాళ్ల టార్గెల్ ఎవ్వరు? పెద్ద వ్యక్తుల అంటే ఏ స్థాయి వాళ్లు? అన్న కోణంలోనే ఎన్‌ఐఏ విచారణ సాగనుంది..
దారుణం.. మత్తు మందు ఇచ్చి వైద్య విద్యార్థినిపై క్లాస్‌మెట్స్ గ్యాంగ్‌రేప్
మహారాష్ట్రలో దారుణం జరిగింది. వైద్య వృత్తికే కళంకం తెచ్చే దిగ్భ్రాంతి ఘటన జరిగింది. సహచర విద్యార్థినికి తోడుగా ఉండాల్సిన స్నేహితులే కాటేశారు. కామంతో కళ్లు నెత్తికెక్కిన విద్యార్థులు అఘాయిత్యాకి పాల్పడ్డారు. మత్తు మందు ఇచ్చి సహచర విద్యార్థినిపై ముగ్గురు వైద్య విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని బెలగావికి చెందిన బాధితురాలు (22) మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఎంబీబీఎస్ చదువుతోంది. మే 18న రాత్రి 10 గంటల ప్రాంతంలో ముగ్గురు మగ వైద్య స్నేహితులతో కలిసి సినిమా చూడాలని ప్లాన్ చేసుకుంది. అయితే అందులో ఒకడు.. ఆమెను ప్లాట్‌కు తీసుకెళ్లి మద్యం తాగించాడు. మత్తులో ఉన్నప్పుడు ఆమెకు స్పైక్డ్ డ్రింక్ ఇచ్చాడు. ఆ డ్రింక్ తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు స్నేహితులు ఆమెపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె స్పృహలోంచి బయటకు వచ్చాక.. జరిగిన ఘోరాన్ని ప్రశ్నించింది. అంతే ముగ్గురు నిందితులు ఆమెపై బెదిరింపులకు దిగారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు.
వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కంకిపాడు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న వంశీ సతీమణి పంకజశ్రీ కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని సైతం ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో వంశీకి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కంకిపాడు పోలీస్ కస్టడీ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వంశీ ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్ కి తరలించాలని పేర్ని నాని ఆసహనం వ్యక్తం చేశారు.
జక్రాన్ పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. బావ బామ్మర్దుల మృతి
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న బావ బామ్మర్దులను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఇద్దరు మృతిచెందారు. బైక్ ను ఢీకొన్న తర్వాత కంటైనర్ పల్టీలు కొట్టింది. కేక్ కొనేందుకు బైక్ పై బయల్దేరిన బావ బామ్మర్దులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులు వివేక్ నగర్ తండాకు చెందిన శ్రీనివాస్, నవీన్ గా గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అధిక స్పీడు, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
నేడు మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. హాజరుకానున్న సీఎంలు
ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం కానుంది. ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. “వికసిత్ రాజ్య, వికసిత్ భారత్-2047” ఇతివృత్తం (థీమ్)గా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం కానుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి రెండు తెలుగు రాష్ట్రాల ముుఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత్ మండపంలో ఈ సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ పాలక మండలి సభ్యులంతా పాల్గొంటారు. నీతి ఆయోగ్ ఛైర్ పర్సన్‌గా ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, పూర్తికాలపు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొంటారు. 2047 కల్లా పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్‌ను ఆవిష్కరించుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశంలో విస్తృత సమాలోచనలు చేయనున్నారు.
అమ్మ నాన్న మాట వినకపోవడం మంచిదైంది..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 20ఏండ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ అంతే క్రేజీ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది తమన్నా. ఆమె ఐటమ్ సాంగ్ చేస్తే సినిమాకే హైప్ వస్తుంది. ఆమె వెబ్ సిరీస్ చేసినా దానికి ఎక్కడ లేని బజ్ క్రియేట్ అవుతుంది. సినిమాల సంఖ్య తగ్గినా తమన్నా ఇమేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఇక ఎంత బీజీగా ఉన్నప్పటికి కూడా అభిమానులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు తమన్నా. రీసెంట్‌గా నిర్వహించిన చిట్ చాట్‌లో ఆమె వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తమన్నా మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీలోకి ఆడవారు రావడం అంటే ఇప్పటికి కూడా అది పెద్ద విషయం. నేరంగా భావించేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నాయి. నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్న విషయం ఇంట్లో చెబితే.. మా అమ్మానాన్నలకు సినిమా ఇండస్ట్రీ గురించి భయంకరంగా చెప్పారు. ఇక ఇరుగుపొరుగు వారికి తెలిసి నేను పెద్ద నేరం చేస్తున్నట్టుగా మాట్లాడటం మొదలు పెట్టారు. కానీ ఆ రోజు నా పేరెంట్స్ వాళ్ల మాటలు విన్నట్టయితే.. ఈ రోజు నటిగా నా కెరీర్ ఉండేది కాదు. వేధింపులు అన్ని రంగాల్లోనూ ఉంటాయి. అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీని మాత్రమే ఎందుకు భూతద్దంలో పెట్టి చూస్తారు?’ అంటూ తమన్నా ప్రశ్నించింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కోవిడ్ బారిన పడ్డ మరో సినీ నటి..
దేశంలో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే 250కి పైగా యాక్టివ్ కేసులు నమోదవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో వివిధ రాష్ట్రాలు అప్రమత్తం మవుతున్నాయి, వైద్య నిపుణులు ప్రజలను మాస్క్ తిరిగి ధరించాలి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ నటి నికితా దత్తా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేషనల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. నికితా దత్తా తో పాటు ఆమె తల్లికి ఈ మహమ్మారి సోకినట్లు సమాచారం. ‘కోవిడ్ మా అమ్మగారికి, నాకు హలో చెప్పడానికి వచ్చాడు. ఈ ఆహ్వానించబడిన అతిథి ఎక్కువ సేపు ఉండకూడదు ఆశిస్తున్నాను. ఈ చిన్న క్వారంటైన్ తర్వాత కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ పోస్ట్ చేసింది. అయితే గతంలో నికితా కోవిడ్ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మళ్లీ వైరస్ బారిన పడటంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు ధైర్యం చెబుతూ పోస్టులు చేస్తున్నారు. ఇటివల మహేష్ బాబు మరదలు కూడా కరోనా బారిన పడింది. ఆమె కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కోరింది.